ఖానాపూర్ చైర్మన్ ఎన్నిక వాయిదా.. బీజేపీ, బీఆర్ఎస్ సీరియస్
ABN , Publish Date - Apr 04 , 2026 | 04:25 PM
నిర్మల్ జిల్లాలో ఉత్కంఠ రేపిన ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా వేయడంపై బీజేపీ, బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహించారు. ఖానాపూర్ మున్సిపల్ కార్యాలయంలోనే బైఠాయించి ఆందోళనకు దిగారు.
నిర్మల్ జిల్లా: జిల్లాలో ఉత్కంఠ రేపిన ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా వేయడంపై బీజేపీ, బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహించారు. ఖానాపూర్ మున్సిపల్ కార్యాలయంలోనే బైఠాయించి ఆందోళనకు దిగారు. బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థిని చైర్మన్‌గా ఎన్నుకోవడానికి సరిపడా కోరం ఉన్నప్పటికీ.. ఎన్నికను అధికారులు వాయిదా వేయడంపై మండిపడుతున్నారు. దీంతో ఆగ్రహించిన ఇరుపార్టీల కౌన్సిలర్లు, నేతలు, కార్యకర్తలు నిరసనకు దిగారు. వారికి మద్దతుగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితీశ్ రాథోడ్, బీఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ జాన్సన్ నాయక్ ఆందోళనలో పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ వచ్చి ఖానాపూర్ మున్సిపల్ ఎన్నికను నిర్వహించాలని, లేదంటే చనిపోయే వరకూ ఇక్కడే కూర్చుంటామని వారు తేల్చి చెప్పారు. అలా కాకుంటే హైదరాబాద్ ఎన్నికల సంఘం వద్ద ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నిర్వహించాలని డిమాండ్ చేశారు. కౌన్సిల్ సభ్యులకు అధికారులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా చైర్మన్ ఎన్నిక ఎలా వాయిదా వేస్తారని కౌన్సిలర్లు ప్రశ్నిస్తున్నారు. ఈ నిరసన కారణంగా తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో ఖానాపూర్ 8వ వార్డు బీజేపీ కౌన్సిలర్ బొప్పారావు సత్యవతి కళ్లు తిరిగి పడిపోయారు. ఆమెను తోటి కౌన్సిలర్లు అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు.
ఖానాపూర్ మున్సిపల్ ఎన్నిక వాయిదా పడినప్పటికీ నేడు మరో రెండు మున్సిపాలిటీలకు ఎన్నికలు సజావుగా జరిగాయి. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీని బీఆర్ఎస్- సీపీఐ కూటమి దక్కించుకుంది. చైర్‌పర్సన్‌గా బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ గుడిసెల సంధ్యారాణి ఎన్నిక కాగా.. వైస్ చైర్‌పర్సన్‌గా సీపీఐ అభ్యర్థి సరిత ఏకగ్రీవం అయ్యారు. కాంగ్రెస్ పార్టీకి బలం లేకపోవడంతో ఎన్నికకు దూరంగా ఉంది. అలాగే రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ పీఠాన్ని బీఆర్ఎస్, బీజేపీ కైవసం చేసుకున్నాయి. చైర్మన్‌గా బీఆర్ఎస్ అభ్యర్థి టేకుల సుదర్శన్ రెడ్డి, వైస్ చైర్‌పర్సన్‌గా బీజేపీ అభ్యర్థి శ్యామల ఎన్నికయ్యారు.
ఈ వార్తలు కూడా చదవండి
ప్రైవేటు వ్యక్తులతో కలిసి సీఎం రేవంత్ భూములు దోచుకుంటున్నారు: ఎంపీ ఈటల
బాసర ఆలయ అభివృద్ధి అద్భుతంగా ఉండాలి.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం