Share News

హైదరాబాద్‌లో 85వ ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్‌.. ఏర్పాట్లపై మంత్రి కోమటిరెడ్డి సమీక్ష

ABN , Publish Date - Nov 16 , 2026 | 05:56 PM

హైదరాబాద్‌లో నిర్వహించనున్న 85వ ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్‌ (ఐఆర్‌సీ) వార్షిక సదస్సుకు సంబంధించిన ఏర్పాట్లపై రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్ష నిర్వహించారు.

హైదరాబాద్‌లో 85వ ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్‌.. ఏర్పాట్లపై మంత్రి కోమటిరెడ్డి సమీక్ష
Indian Roads Congress

హైదరాబాద్, నవంబరు 16: నగరంలో నిర్వహించనున్న 85వ ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్‌ (ఐఆర్‌సీ) వార్షిక సదస్సుకు సంబంధించిన ఏర్పాట్లపై రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్ష నిర్వహించారు. నవంబర్ 19 నుంచి 22వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు జరగనున్న ఈ ప్రతిష్ఠాత్మక సదస్సుకు జాతీయ, అంతర్జాతీయ స్థాయికి చెందిన 3,000 మందికి పైగా ప్రతినిధులు హాజరుకానున్నారు.

ఈ నేపథ్యంలో ప్రతినిధులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వసతి, రవాణా, ఆతిథ్య ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. సదస్సులో భాగంగా నవంబర్ 18వ తేదీ నుంచే సాంకేతిక ప్రదర్శన ప్రారంభం కానుంది. ఇందులో 400కు పైగా ఎగ్జిబిషన్ స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు. రహదారుల నిర్మాణంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, నూతన ఆవిష్కరణలు, అధునాతన యంత్ర పరికరాలు, వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను ఈ ప్రదర్శనలో అందుబాటులో ఉంచనున్నారు. ముఖ్యంగా తెలంగాణ సంస్కృతి, వారసత్వ సంపదను ప్రతిబింబించేలా రామప్ప దేవాలయ పెవిలియన్‌ను ప్రత్యేక ఆకర్షణగా తీర్చిదిద్దనున్నారు. రాష్ట్రంలో చేపట్టిన రహదారులు, వంతెనలు, ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పురోగతిని కూడా ఈ వేదిక ద్వారా జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులకు పరిచయం చేయనున్నారు.


సదస్సుకు హాజరయ్యే అతిథులకు తెలంగాణ ప్రత్యేకతను చాటిచెప్పేలా హైదరాబాద్‌ ప్రసిద్ధ వంటకాలతో ప్రత్యేక ఆతిథ్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే నవంబర్ 19, 20, 21 తేదీల్లో ప్రతినిధుల కోసం ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. తెలంగాణ కళలు, సంప్రదాయాలు, సంస్కృతిని ప్రతిబింబించే ప్రదర్శనలు ఈ కార్యక్రమాల్లో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. సదస్సు చివరి రోజైన నవంబర్ 22న జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధుల కోసం ప్రత్యేక పర్యాటక పర్యటనలను ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని చారిత్రక, పర్యాటక ప్రదేశాల విశిష్టతను వారికి పరిచయం చేసేలా ఈ పర్యటనలు రూపొందించనున్నారు. ఈ భారీ కార్యక్రమం విజయవంతం కావడానికి రోడ్లు, భవనాలు, పర్యాటక, సాంస్కృతిక, పోలీస్, రవాణా తదితర శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

కాళేశ్వరం ప్రాజెక్టులో గేట్లు మూసి నీటిని నిల్వ చేసే అవకాశం లేదు: మంత్రి తుమ్మల

సజ్జనార్ ఆస్తుల కొనుగోళ్లపై విచారణ జరిపించాలి: రాజాసింగ్

Read Latest Telangana News And AP News

Updated Date - Nov 16 , 2026 | 07:12 PM