వాట్సాప్‌ను వెంటనే అప్‌డేట్ చేసుకోండి.. యూజర్లకు కేంద్రం హెచ్చరిక
ABN , Publish Date - Nov 27 , 2026 | 01:02 PM
వాట్సాప్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వ సైబర్ భద్రతా సంస్థ ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం (సీఈఆర్‌టీ) కీలక హెచ్చరిక జారీ చేసింది. వాట్సాప్‌లో ఐదు భద్రతా లోపాలు ఉన్నట్లు గుర్తించామని, వాటిని ఆసరాగా చేసుకుని హ్యాకర్లు యూజర్ల ఫోన్లలోకి చొరబడి, డేటాను దొంగిలించే ప్రమాదం ఉందని సీఈఆర్‌టీ హెచ్చరించింది.
ఇంటర్నెట్ డెస్క్: వాట్సాప్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వ సైబర్ భద్రతా సంస్థ ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం (సీఈఆర్‌టీ) కీలక హెచ్చరిక జారీ చేసింది. వాట్సాప్‌లో ఐదు భద్రతా లోపాలు ఉన్నట్లు గుర్తించామని, వాటిని ఆసరాగా చేసుకుని హ్యాకర్లు యూజర్ల ఫోన్లలోకి చొరబడి, డేటాను దొంగిలించే ప్రమాదం ఉందని సీఈఆర్‌టీ హెచ్చరించింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్, మ్యాక్, విండోస్ ప్లాట్‌ఫామ్‌లలో ఈ సమస్యలు ఉన్నట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో వ్యక్తులు, సంస్థలు వెంటనే వాట్సాప్‌ను అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది. గురువారం ఈ మేరకు సీఈఆర్‌టీ అడ్వైజరీ జారీ చేసింది. కాగా.. వాట్సాప్ వెబ్ సెషన్లను లాగౌట్ చేయకుండా అలాగే వదిలేయడం వల్ల ఎదురయ్యే ప్రమాదాలపై ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ కూడా అంతకుముందు హెచ్చరించింది.
ఏమిటా భద్రతా లోపాలు?
ఆండ్రాయిడ్ ఫోన్లలో సీవీఈ2026-102769 అనే లోపం ఉందని సీఈఆర్‌టీ తెలిపింది. హ్యాకర్లు ప్రత్యేకంగా రూపొందించిన ఆర్డర్ వివరాల సందేశాన్ని పంపి, యూజర్ దానిపై క్లిక్ చేసేలా చేస్తారు. దాంతో వాట్సాప్ ఫైళ్లను తొలగించే అవకాశం ఉంది. అంతేకాకుండా, సందేశం వచ్చిన సమయంలో యూజర్ ఆన్‌లైన్‌లో ఉంటే, చాట్ డేటాబేస్‌కు సంబంధించిన సమాచారాన్ని కూడా హ్యాకర్లు తెలుసుకునే ప్రమాదం ఉంది. ఇక మెటా ఏఐ కంప్యూటింగ్ వ్యవస్థతో అనుసంధానమయ్యే సమయంలో సర్టిఫికెట్ ధ్రువీకరణలో సీవీఈ 2026-44908 అనే లోపం తలెత్తినట్లు సీఈఆర్‌టీ గుర్తించింది. దీని ద్వారా మెటా సంస్థ అంతర్గత వ్యవస్థల్లోకి ప్రవేశం ఉన్న వ్యక్తులు భద్రతా వ్యవస్థను దాటుకుని డివైజ్‌లోకి చొరబడే అవకాశం ఉందని వెల్లడించింది.
సీవీఈ 2026 23871 అనే లోపం ఆండ్రాయిడ్‌లోని 'క్లిక్ టు వాట్సాప్' ప్రకటనలకు సంబంధించినది. హ్యాకర్లు రూపొందించిన ప్రత్యేక మెసేజీల ద్వారా యూజర్ల ఫోన్లలోని మీడియా ఫైళ్లను తమ నియంత్రణలో ఉన్న వెబ్ అడ్రస్ నుంచి ఓపెన్ అయ్యేలా చేయవచ్చు. దీంతో యూజర్ల ఐపీ అడ్రస్ వివరాలు బయటపడే ప్రమాదం ఉంది. సీవీఈ 2026 23866 అనే నాలుగో లోపం. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్లను ఇది ప్రభావితం చేస్తుంది. ఇన్‌స్టాగ్రామ్ రీల్‌కు సంబంధించిన ఏఐ సమాధానంలో హ్యాకర్లు హానికరమైన లింకులను పంపవచ్చు. వాటిని ప్రాసెస్ చేసినప్పుడు ఫోన్‌లోకి ప్రమాదకరమైన కంటెంట్ చేరే అవకాశం ఉంది. ఐదో లోపం సీవీఈ 2026 23863. ఇది విండోస్ కంప్యూటర్లకు సంబంధించినది. హ్యాకర్లు పంపిన ఫైల్ ఒకరకమైన డాక్యుమెంట్‌లా కనిపించినా, దాన్ని ఓపెన్ చేసినప్పుడు ఎగ్జిక్యూటబుల్ ప్రోగ్రామ్‌గా పనిచేసే ప్రమాదం ఉంది. దీంతో కంప్యూటర్‌లోకి హానికరమైన సాఫ్ట్‌వేర్ చేరవచ్చు. నాలుగు, ఐదో లోపాల గురించి వాట్సాప్ ఈ ఏడాది మే నెలలోనే హెచ్చరించింది.
యూజర్లు.. బహుపరాక్
వాట్సాప్‌లో వచ్చే అనుమానాస్పద సందేశాలు, లింకులు, అటాచ్‌మెంట్లను ఓపెన్ చేయకుండా ఉండాలని సీఈఆర్‌టీ హెచ్చరించింది. గుర్తుతెలియని వ్యక్తులు పంపే ఫైళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, గూగుల్ ప్ స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ లేదా అధికారిక వెబ్‌సైట్ ద్వారా వాట్సాప్‌ను లేటెస్ట్ వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది. కంప్యూటర్లలోనూ వాట్సాప్‌ను అప్‌డేట్ చేయాలని, వాట్సాప్ వెబ్ ఉపయోగించిన తర్వాత కచ్చితంగా లాగౌట్ చేయాలని పేర్కొంది.
ఇవి కూడా చదవండి:
వైభవ్ వన్డేల్లో ట్రిపుల్ సెంచరీ కూడా బాదేస్తాడు: చిన్ననాటి కోచ్ మనీశ్ ఓజా
ఐపీఎల్ 2027: వేలంలోకి వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్