Share News

వాట్సాప్‌లో అదిరిపోయే కొత్త ఫీచర్.. 14 రోజుల ముందే మెసేజ్ షెడ్యూల్ చేసుకోవచ్చు..

ABN , Publish Date - Nov 25 , 2026 | 09:53 PM

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై మనం పంపాలనుకున్న సందేశాలను ముందుగానే సిద్ధం చేసుకుని, మనకు నచ్చిన తేదీ, సమయానికి ఆటోమేటిక్‌గా వెళ్లేలా షెడ్యూల్ చేసుకోవచ్చు.

వాట్సాప్‌లో అదిరిపోయే కొత్త ఫీచర్.. 14 రోజుల ముందే మెసేజ్ షెడ్యూల్ చేసుకోవచ్చు..
WhatsApp Scheduled Messages

ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై మనం పంపాలనుకున్న సందేశాలను ముందుగానే సిద్ధం చేసుకుని, మనకు నచ్చిన తేదీ, సమయానికి ఆటోమేటిక్‌గా వెళ్లేలా షెడ్యూల్ చేసుకోవచ్చు. పుట్టినరోజు శుభాకాంక్షలు, పండుగ సందేశాలు, ముఖ్యమైన రిమైండర్లు పంపేందుకు ఈ ఫీచర్ ఎంతో ఉపయోగపడనుంది. వ్యక్తిగత చాట్లతో పాటు గ్రూపుల్లోనూ ఈ సదుపాయం పనిచేస్తుంది (WhatsApp Scheduled Messages).


వాట్సాప్ తీసుకొచ్చిన ఈ కొత్త ఫీచర్ ద్వారా సందేశాలను కనీసం 10 నిమిషాల నుంచి గరిష్ఠంగా 14 రోజుల ముందుగానే షెడ్యూల్ చేసుకోవచ్చు. సెట్ చేసిన సమయానికి ఫోన్‌లో ఇంటర్నెట్ లేకపోయినా, మొబైల్ స్విచ్ఛాఫ్ అయినా ఆటోమేటిక్‌గా ఆ మెసేజ్ డెలివరీ అయిపోతుంది. ఉదాహరణకు.. మీ స్నేహితుడి పుట్టినరోజు మరో వారం రోజుల్లో ఉందనుకోండి. ఆ రోజు అర్ధరాత్రి 12 గంటలకు శుభాకాంక్షలు చెప్పాలంటే అప్పటివరకు మేల్కొని ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడే సందేశాన్ని టైప్ చేసి, పుట్టినరోజు రోజు అర్ధరాత్రి 12 గంటలకు వెళ్లేలా సమయం నిర్ణయించవచ్చు (WhatsApp New Feature 2026).


ఈ కొత్త ద్వారా కేవలం టెక్స్ట్ మెసేజ్‌లే కాదు.. ఫొటోలు, వీడియోలు, లింకులను కూడా ముందుగానే షెడ్యూల్ చేసుకోవచ్చు. వ్యక్తిగత చాట్లతో పాటు గ్రూప్ చాట్లలోనూ ఈ ఫీచర్ పనిచేస్తుంది. అలాగే ఒకసారి షెడ్యూల్ చేసిన మెసేజ్‌ను కావాలంటే ఎడిట్ చేసుకోవచ్చు. డిలీట్ కూడా చేసుకోవచ్చు. వాట్సాప్‌లో ఇప్పటికే ఉన్న వ్యక్తిగత సందేశాల మాదిరిగానే షెడ్యూల్ చేసిన సందేశాలకు కూడా ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ రక్షణ ఉంటుంది (Schedule WhatsApp Messages).


వాట్సాప్‌లో మెసేజ్ ఎలా షెడ్యూల్ చేయాలి?

  • ముందుగా వాట్సాప్ ఓపెన్ చేసి, సందేశం పంపాలనుకుంటున్న వ్యక్తి లేదా గ్రూప్ చాట్‌లోకి వెళ్లాలి.

  • పంపాలనుకున్న సందేశాన్ని టైప్ చేసి, అవసరమైతే ఫొటో లేదా వీడియోను జతచేసుకోవచ్చు.

  • ఆ తర్వాత సెండ్ బటన్‌ను లాంగ్ ప్రెస్ చేయాలి.

  • అప్పుడు షెడ్యూల్ మెసేజ్ అనే ఆప్షన్ కనబడుతుంది.

  • అప్పుడు సందేశం పంపాల్సిన తేదీ, సమయాన్ని ఎంచుకునే అవకాశం కనిపిస్తుంది.

  • కనీసం 10 నిమిషాల నుంచి గరిష్ఠంగా 14 రోజుల మధ్య మీకు కావాల్సిన సమయాన్ని ఎంచుకోవాలి.

  • చివరగా సెండ్ కొడితే ఆ సందేశం షెడ్యూల్ అవుతుంది.


ఇవి కూడా చదవండి..

ఆకాశంలో వెండివెన్నెల.. హిమాలయాల మధ్య చంద్రోదయం.. వీడియో వైరల్..


తిరుపరంకుండ్రం కొండపై దీపం వివాదం.. వందేళ్ల క్రితం అసలేం జరిగిందంటే..

Updated Date - Nov 25 , 2026 | 09:55 PM