Share News

మానవాళికి ఉపయోగం లేకపోతే.. ఏఐ వెంటపడటం సరికాదు: సత్య నాదెళ్ల

ABN , Publish Date - Sep 14 , 2026 | 12:37 PM

ఏఐ వల్ల మానవాళికి ఉపయోగం లేకపోతే, దాని వెంటపడడం సరికాదని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల అన్నారు. ఏఐ అభివృద్ధిని పూర్తిగా అడ్డుకోవాలని తాను చెప్పడం లేదని, సేఫ్టీ మెకానిజం వచ్చే వరకు ఏఐ అభివృద్ధిని కాస్త నెమ్మదిగా చేయాలని కంపెనీలకు ఎక్స్‌లో ఆయన సూచించారు.

మానవాళికి ఉపయోగం లేకపోతే.. ఏఐ వెంటపడటం సరికాదు: సత్య నాదెళ్ల
Microsoft CEO Satya Nadella

ఇంటర్‌నెట్ డెస్క్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మానవాళికి ఉపయోగం లేకపోతే, దాని వెంటపడటం సరికాదని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల అన్నారు. ఏఐ అభివృద్ధిని పూర్తిగా అడ్డుకోవాలని తాను చెప్పడం లేదని, సేఫ్టీ మెకానిజం వచ్చే వరకూ దాన్ని కాస్త నెమ్మదిగా అభివృద్ధిని చేయాలని కంపెనీలకు ఎక్స్‌లో సూచించారు. అదే సమయంలో టెక్నాలజీ మనుషుల నియంత్రణను దాటిపోకుండా చూడాల్సిన అవసరం కూడా ఉందన్నారు. ఏఐ అభివృద్ధి విషయంలో అందరూ ఒకే అభిప్రాయానికి వచ్చేలా నెమ్మదిగా ముందుకు వెళ్లాల్సిన అవసరముందని పేర్కొన్నారు. ఏఐ వ్యవస్థలు సురక్షితంగా పనిచేస్తున్నాయో లేదో పర్యవేక్షించే, అలాగే భద్రతా నియమాలను కంపెనీలు నిజంగా అమలు చేసేలా సాయపడే ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలను కూడా ఆయన స్వాగతించారు.


'ఏఐని కొన్ని కంపెనీలే నియంత్రించరాదు'

ఏఐ సేఫ్టీ అంటే మోడల్స్ తయారుచేయడం మాత్రమే కాదని, ఏఐని ఎవరు నియంత్రించాలన్న అంశంపైనా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సత్య నాదెళ్ల వ్యాఖ్యానించారు. ‘కొన్ని కంపెనీల చేతుల్లోనే ఏఐ నియంత్రణ ఉండరాదు. ప్రపంచ దేశాలు, కంపెనీలకు ఏఐ ఎకోసిస్టమ్ అందుబాటులో ఉండాలి. కంపెనీలు, వ్యాపారులు, యూజర్లు కొద్దిమంది ఏఐ ప్రొవైడర్లపై శాశ్వతంగా ఆధారపడకూడదు’ అని నాదెళ్ల సూచించారు. అంతకుముందు కూడా ఏఐ వాడకంపై మైక్రోసాఫ్ట్ సీఈవో ఆందోళన వ్యక్తం చేశారు. కంపెనీలు ఏఐ కోసం రెండు విధాలుగా నష్టపోవచ్చని ఆయన హెచ్చరించారు.


‘మొదట ఏఐ టెక్నాలజీని ఉపయోగించడానికి కంపెనీలు డబ్బు చెల్లిస్తాయి. కానీ, ఏఐని ఉపయోగించే సమయంలో తమ కంపెనీకి సంబంధించిన విలువైన సమాచారాన్ని కూడా తెలియజేసే అవకాశం ఉంది. ఏఐకి కంపెనీ ఇచ్చే ప్రతి ప్రాంప్ట్, సవరణ, ఉపయోగించే పని విధానం ద్వారా ఆ కంపెనీ ఎలా పనిచేస్తుందో కొంత సమాచారం బయటపడవచ్చు. ఇలా ఆ సమాచారం కంపెనీకి పోటీదారుల కంటే ముందుండేందుకు ముఖ్యమైన ఆస్తిగా మారవచ్చు’ అని నాదెళ్ల పేర్కొన్నారు.

కంపెనీలు ఏఐని ఉపయోగిస్తూ తమ సొంత లెర్నింగ్ లూప్‌ను అభివృద్ధి చేసుకోవాలని చెప్పారు. ఏఐ ద్వారా తయారుచేసే పరిజ్ఞానం, మోడళ్లపై కంపెనీలకే నియంత్రణ ఉండాలని గతంలోనూ ఆయన అభిప్రాయపడ్డారు. కంపెనీలు తమ సొంత సమాచారాన్ని ఏఐ మోడళ్లలో చేర్చుకోవడంతో పాటు, తాము ఉపయోగించే ఏఐ మోడళ్లపైనా నియంత్రణ కలిగి ఉండాలని తాజాగా వ్యాఖ్యానించారు. కాగా.. ఏఐ అభివృద్ధిని నెమ్మదిగా చేయాలని ఆంత్రోపిక్ చీఫ్ డారియో అమోడీ కూడా అంతకుముందు సూచించారు. ఆయన ప్రతిపాదనను ఎలాన్ మస్క్, ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్ కూడా స్వాగతించారు. ఇప్పుడు సత్య నాదెళ్ల కూడా వారి జాబితాలో చేరారు.


ఇవి కూడా చదవండి...

కాణిపాకంలో చవితి వేడుకలు.. పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఆనం

హైదరాబాద్‌లో ఆరునెలల గర్భవతిగా ఉన్న భార్యను హత్య చేసిన భర్త

Read Latest Technology News And Telugu News

Updated Date - Sep 14 , 2026 | 01:18 PM