ఓపెన్ ఏఐలో సమాచార దుర్వినియోగం.. ముగ్గురిపై వేటు
ABN , Publish Date - Oct 02 , 2026 | 06:47 AM
చాట్ జీపీటీ మేకర్ ఓపెన్ ఏఐ తన సంస్థ నుంచి ముగ్గురు ఉద్యోగులను తొలగించింది. కీలక సమాచారాన్ని దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై ఆ ఉద్యోగులను తొలగించినట్లు ఓపెన్ ఏఐ పేర్కొంది.
ఇంటర్‌నెట్ డెస్క్: చాట్ జీపీటీ మేకర్ ఓపెన్ ఏఐ తన సంస్థ నుంచి ముగ్గురు ఉద్యోగులను తొలగించింది. కీలక సమాచారాన్ని దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై ఆ ఉద్యోగులను తొలగించినట్లు ఓపెన్ ఏఐ పేర్కొంది. అంతేకాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్‌ను పరీక్షించే ఒక బయటి సంస్థతో కలిసి వారు పనిచేశారని, అలా చేయడం కంపెనీ పాలసీలను ఉల్లంఘించినట్లేనని తెలిపింది. ఆ కారణాలపై ఆ ముగ్గురు ఉద్యోగులను సంస్థ నుంచి బయటకు పంపామని ఓపెన్ ఏఐ ఒక ప్రకటనలో పేర్కొంది.
‘సున్నిత సమాచారాన్ని ఆ ముగ్గురు ఉద్యోగులు దుర్వినియోగం చేసినట్లు, అలాగే బయటి సంస్థతో కలిసి పనిచేసినట్లు వారిపై ఆరోపణలు వచ్చాయి. దీంతో వారిపై విచారణ ప్రారంభించాం. ఆ ఆరోపణలు నిజమని విచారణలో తేలడంతో వారిపై వేటు వేశాం’ అని ఓపెన్ ఏఐ వెల్లడించింది. అయితే, తాము తొలగించిన ఆ ఉద్యోగుల పేర్లు, వారి గుర్తింపును ఓపెన్ ఏఐ వెల్లడించలేదు. ఆ ముగ్గురు ఉద్యోగుల్లో ఇద్దరు సేఫ్టీ, అలైన్‌మెంట్‌పై పనిచేసినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్, బ్లూ్మ్‌బర్గ్ భావిస్తున్నాయి.
ఏఐ సేఫ్టీపై నిరంతరం పోస్టులు
తొలగింపునకు గురైన ఆ ముగ్గురు ఉద్యోగులు గత కొన్ని వారాలుగా ఎక్స్‌లో ఏఐ భద్రత, దాని రిస్క్‌లపై నిరంతరం పోస్టులు పెట్టారని ఓపెన్ ఏఐ పేర్కొంది. భవిష్యత్తులో మానవాళిని అంతం చేయడానికి ఏఐకి ఎక్కువ అవకాశం ఉందని ఆ ముగ్గురు ఉద్యోగుల్లో ఒకరు పోస్టు చేశారని కంపెనీ వెల్లడించింది. అలాగే, ఓపెన్ ఏఐ అనుసరిస్తున్న కొన్ని విధానాలపై వారు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారని తెలిపింది. ఆ కారణాలు, డేటాను దుర్వినియోగం చేసినట్లు వారిపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేశామని, ఆ ఆరోపణలు నిజమని తేలిన తర్వాతే ఆ ఉద్యోగుల సేవలకు స్వస్తి చెప్పామని ఓపెన్ ఏఐ వివరించింది.
ఈ వార్తలనూ చదవండి:
ట్రంప్‌తో ఆంత్రోపిక్ సీఈఓ భేటీ.. ఏఐ సేఫ్టీపై చర్చ
పాన్ కార్డులో పేరు తప్పు పడిందా..? మొబైల్‌లోనే మార్చుకోండిలా.