Share News

పౌరులు, పాఠశాలలపై టార్గెట్.. ఏఐ మోడళ్ల తీరుపై ఆందోళన

ABN , Publish Date - Nov 18 , 2026 | 11:49 AM

తాజాగా కృ‌త్రిమ మేధ మోడళ్లపై నిర్వహించిన పరిశోధనలో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి. సైనిక లక్ష్యాలుగా సాధారణ పౌరులను, పాఠశాలలను, అంబులెన్స్‌లను కొన్ని ఏఐ మోడళ్లు గుర్తించాయి.

పౌరులు, పాఠశాలలపై టార్గెట్.. ఏఐ మోడళ్ల తీరుపై ఆందోళన

ఇంటర్నెట్ డెస్క్: తాజాగా కృ‌త్రిమ మేధ మోడళ్లపై నిర్వహించిన పరిశోధనలో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి. సైనిక లక్ష్యాలుగా సాధారణ పౌరులను, పాఠశాలలను, అంబులెన్స్‌లను కొన్ని ఏఐ మోడళ్లు గుర్తించాయి. దీంతో పరిశోధకులు ఆశ్చర్యపోయారు. ఇటీవలి కాలంలో యుద్ధరంగంలోనూ ఏఐ పాగా వేస్తోంది. క్షిపణుల ప్రయోగంలో దీన్ని విరివిగా వాడాలని చాలా దేశాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సైనిక లక్ష్యాలను కృత్రిమ మేధ తప్పుగా గుర్తిస్తోందని వెలువడుతున్న అధ్యయనాలు కలవరపెడుతున్నాయి. ఈ సాంకేతిక లోపాల కారణంగా అమాయక పౌరుల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.


అమెరికాకు చెందిన వాల్స్ ఏఐ అనే సంస్థ కృత్రిమ మేధకున్న వస్తువులు గుర్తించే సామర్థ్యాలపై పరిశోధన నిర్వహించింది. కొంతకాలంగా ఏఐ కట్టుతప్పుతున్న ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో ఆ సంస్థ ఇందుకు పూనుకుంది. ఆంథ్రోపిక్‌, ఓపెన్ ఏఐ సహా ఎనిమిది దిగ్గజ కంపెనీలకు సంబంధించిన మోడళ్లను పరీక్షించింది. సైనిక లక్ష్యాలను గుర్తించే అంశంలో మాత్రం ఆ మోడళ్లు పెద్ద పెద్ద తప్పులు చేశాయి. పౌరులను, పిల్లలను, లొంగిపోయిన సైనికులను అవి లక్ష్యాలుగా చూపించాయి. ఇరాన్‌లోని మినాబ్‌లో ఉన్న పాఠశాలను సైనిక లక్ష్యంగా ఏఐ గుర్తించడం మరింత ఆందోళనకు దారి తీసింది. 32 సార్లు పరీక్ష నిర్వహిస్తే.. ఆంథ్రోపిక్‌ మోడల్ (Claude Opus 5.5) 22 సార్లు మినాబ్ పాఠశాలను సైనిక లక్ష్యంగా పేర్కొందని పరిశోధన వెల్లడించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆ పాఠశాలపై జరిగిన దాడిలో వందమందికి పైగా చిన్నారులు మరణించిన విషయం తెలిసిందే.

యుద్ధరంగంలో ఏఐ వాడకం పెరుగుతున్న నేపథ్యంలో ఈ పరిశోధన ఆందోళనలకు దారి ఇస్తోంది. కృత్రిమ మేధలో తలెత్తే సాంకేతిక లోపాలు సామాన్యుల ప్రాణాలతో చెలగాటమాడనున్నాయనే భయం వ్యక్తమవుతోంది. కాగా నిబంధనలను ఉల్లంఘిస్తున్న మోడళ్లను అరికట్టడానికి ఏఐని అభివృద్ధి చేస్తున్న సంస్థలు ప్రయత్నిస్తున్నాయి.


ఈ వార్తలూ చదవండి

వాలంటరీ ఎగ్జిట్‌లు అందుకే: మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల

ఓపెన్ ఏఐ నుంచి చాట్ జీపీటీ వాలెట్.. కొత్త ఫీచర్ అందుబాటులోకి

Updated Date - Nov 18 , 2026 | 12:02 PM