Share News

వాలంటరీ ఎగ్జిట్‌లు అందుకే: మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల

ABN , Publish Date - Nov 17 , 2026 | 02:58 PM

మైక్రోసాఫ్ట్‌లో 60 వేల మంది ఉద్యోగులకు వాలంటరీ ఎగ్జిట్‌ ఆఫర్‌లు ఎందుకు ప్రకటించవలసి వచ్చిందో సంస్థ సీఈఓ సత్య నాదెళ్ల తాజాగా వెల్లడించారు.

వాలంటరీ ఎగ్జిట్‌లు అందుకే: మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల
Microsoft CEO Satya nadella on Voluntary Exits

ఇంటర్నెట్ డెస్క్: మైక్రోసాఫ్ట్‌లో 60 వేల మంది ఉద్యోగులకు వాలంటరీ ఎగ్జిట్‌ ఆఫర్‌లు ఎందుకు ప్రకటించవలసి వచ్చిందో సంస్థ సీఈఓ సత్య నాదెళ్ల తాజాగా వెల్లడించారు. ఉద్యోగులకు తమ కెరీర్‌పై మరింత నియంత్రణ కల్పించడమే వాలంటరీ ఎగ్జిట్‌ల లక్ష్యమని అన్నారు. ఉద్యోగాల్లో భారీ మార్పులు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో సంస్థలో మిగిలిన ఉద్యోగులకు కొత్త అవకాశాలను సృష్టించడం మరో ప్రధాన కారణమని చెప్పారు. అమెరికాతో పాటు కెనడా, భారత్, యూకేల్లోని మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు ఈ ఆప్షన్ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా 27 శాతం మంది ఉద్యోగులు స్వచ్ఛదంగా తప్పుకునేందుకు సంస్థ ఈ ఆఫర్ ఇచ్చింది.


వాలంటరీ ఎగ్జిట్‌ ఆఫర్‌ కారణంగా సంస్థ పునర్ వ్యవస్థీకరణపై పలు సందేహాలు, ఆందోళనలు వ్యక్తమైన నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల తాజాగా స్పందించారు. ఓ పాడ్‌కాస్ట్‌లో ఈ అంశాలపై ఆయన సోమవారం మాట్లాడారు. ఏఐ కారణంగా ఉద్యోగాల్లో పెను మార్పులు వస్తున్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్‌లో కూడా రానున్న ఏళ్లల్లో పలు మార్పులు జరుగుతాయని చెప్పారు. సిబ్బంది సంఖ్య, పని నిర్వహణలో మార్పులు చోటుచేసుకుంటాయని తెలిపారు. ‘రాబోయే రోజుల్లో అనేక కొత్త అవకాశాలు ఉంటాయన్న విషయం మనం అందరం అంగీకరించాల్సిందే. అయితే, వాటి తీరుతెన్నులు భిన్నంగా ఉంటాయి’ అని అన్నారు.


ఉద్యోగులు కొత్త నైపుణ్యాలు అందిపుచ్చుకోవడంలో సహాయం చేయడమే సంస్థ లక్ష్యమని చెప్పారు. మైక్రోసాఫ్ట్‌తో పాటు బయటి జాబ్ మార్కెట్‌లో కూడా ఎన్నో అవకాశాలు అందుబాటులోకి రానున్నాయని అన్నారు. మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు అభివృద్ధి సాధించాలని తాము ఆకాంక్షిస్తున్నామని చెప్పారు. మైక్రోసాఫ్ట్‌లో సాధారణ ఉద్యోగిగా మొదలు పెట్టి సీఈఓ స్థాయికి చేరుకోవడంతో తనకు ఓ ఉద్యోగి అభివృద్ధి, అవకాశాలుపై స్పష్టమైన అభిప్రాయాలు వచ్చాయని అన్నారు.


ఓ ఉద్యోగిగా తాను ఎలాంటి మార్పూ లేని చోట చిక్కుకుపోవాలని అనుకోనని చెప్పారు. కెరీర్ పరంగా ఒకే స్థాయిలో మిగిలిపోయామని భావిస్తున్న వారు స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకునేందుకు వాలంటర్జీ ఎగ్జిట్‌ ఆఫర్‌ను ప్రకటించామని అన్నారు. ‘మా కంపెనీకి ఆవల భవిష్యత్తుపై దృష్టిసారించిన ఉద్యోగులకు అన్ని రకాలుగా మద్దతుగా ఉండేలా ఈ ఆఫర్ ప్రకటించాము’ అని చెప్పారు. ఏఐపై భారీగా పెట్టుబడి పెడుతున్న టెక్ దిగ్గజాలు ఉద్యోగులను తొలగిస్తున్న విషయం తెలిసిందే.


ఈ వార్తలనూ చదవండి:

మరో పదేళ్లలో క్యాన్సర్ కనుమరుగు: ఆంథ్రోపిక్ సీఈఓ

భర్త హత్యకు చాట్‌జీపీటీ సాయంతో ప్లాన్

Updated Date - Nov 17 , 2026 | 03:12 PM