Share News

భర్త హత్యకు చాట్‌జీపీటీ సాయంతో ప్లాన్

ABN , Publish Date - Nov 06 , 2026 | 04:08 PM

చాట్‌జీపీటీ మాతృసంస్థ ఓపెన్‌ఏఐపై అమెరికాలో మరో వ్యక్తి కోర్టుకెక్కారు. తనను హత్య చేసేందుకు కుట్ర పన్నిన భార్యకు చాట్‌జీపీటీ సాయం చేసిందని ఆరోపించారు.

భర్త హత్యకు చాట్‌జీపీటీ సాయంతో ప్లాన్
US Man Sues OpenAI

ఇంటర్నెట్ డెస్క్: చాట్‌జీపీటీ మాతృసంస్థ ఓపెన్‌ఏఐపై అమెరికాలో మరో వ్యక్తి కోర్టుకెక్కారు. భార్య తన హత్యకు కుట్ర పన్నిందంటూ నార్త్ కెరొలీనాకు (యూఎస్ఏ) చెందిన జేమ్స్ గేట్స్ ఆరోపించారు. ఈ కుట్ర పన్నేందుకు తన భార్య షెరిల్ గేట్స్‌‌కు చాట్‌జీపీటీ సహకరించిందని ఆరోపిస్తూ చాట్‌బాట్ మాతృసంస్థ ఓపెన్ ఏఐపై కేసు వేశారు. హత్యకు కుట్ర పన్నేలా షెరిల్‌ను ప్రోత్సహించింది చాట్‌జీపీటీ అని మండిపడ్డారు.

ఫిర్యాదులో జేమ్స్ పేర్కొన్న వివరాల ప్రకారం, జేమ్స్, షెరిల్ దంపతులకు 10 ఏళ్ల లోపు వయసున్న ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇంటిపట్టునే ఉండి పిల్లల్ని చూసుకునే షెరిల్‌ను జేమ్స్ గతేడాది ఉద్యోగం చేయాలని కోరారు. అప్పటి నుంచీ తమ మధ్య వివాదాలు మొదలయ్యాయని చెప్పారు. ఈ క్రమంలో ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయిందని అన్నారు. ఆ తరువాత తాను అనారోగ్యం పాలయ్యానని పేర్కొన్నారు. ఆ తరువాత కొన్ని రోజులకు షెరిల్ కొన్ని వస్తువులను తీసుకెళ్లేందుకు మళ్లీ తిరిగి వచ్చిందన్నారు. ఆ సమయంలో ఆమె టేబుల్‌పై పెట్టిన ఓ చీటీ చూశాక తనకు కాళ్ల కింద భూమి కదిలిపోతున్నట్టు అనిపించిందని చెప్పారు.


చీటీలో విషపూరిత పదార్థాల పేర్లు రాసున్నాయని చెప్పారు. తరువాత పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పారు. దర్యాప్తులో ఆమె గురించి పలు విషయాలు వెలుగులోకి వచ్చాయని చెప్పారు. ఆమె పన్నిన కుట్ర, చాట్‌జీపీటీ‌తో చాటింగ్‌లు, బయటపడ్డాయని తెలిపారు. భర్త తనను హత్య చేసే అవకాశం ఉందని చాట్‌జీపీటీతో చాటింగ్ మొదలెట్టిన ఆమె ఆ తరువాత స్వీయరక్షణ పేరిట చాట్‌బాట్ నుంచి పలు సమాచారాన్ని సేకరించి కుట్రకు తెరతీసిందని ఆరోపించారు. భర్త విషయంలో మహిళకు ఉన్న భ్రమలన్నీ నిజమనిపించేనేలా చాట్‌జీపీటీ ఆమెకు సమాధానం చెప్పిందని అన్నారు. చివరకు తాను అనారోగ్యం బారిన పడ్డానని చెప్పారు.


ఈ ఉదంతానికి సంబంధించి 2025లోనే స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, ఆమెకు వ్యతిరేకంగా పటిష్ఠమైన ఆధారాలు లేక హత్యాయత్నం అభియోగాలను తొలగించారు. ఈ నేపథ్యంలో చాటింగ్‌ల స్క్రీన్ షాట్స్‌తో మరోసారి కోర్టును ఆశ్రయించిన జేమ్స్ ఓపెన్ఏఐపై న్యాయపోరాటం ప్రారంభించారు. భర్తతో వివాదాలు మొదలు హత్య వరకూ చాటింగ్ తీరుతెన్నులూ మారుతున్నా చాట్‌బాట్ ఎవరినీ అలర్ట్ చేయలేదని ఆరోపించారు. చాట్‌జీపీటీ డిజైన్‌లో లోపాలే ఈ పరిస్థితికి కారణమని మండిపడ్డారు. ఓపెన్‌ఏఐ సంస్థ మాత్రం ఈ ఆరోపణలను కొట్టిపారేసింది.


ఈ వార్తలనూ చదవండి:

మైక్రోసాఫ్ట్, గూగుల్ తరువాత మెటా.. ఉద్యోగులకు వాలంటరీ ఎగ్జిట్

కృత్రిమ మేధతో త్వరలోనే మానవాళికి పెను ముప్పు.. ఏఐ గాడ్ ఫాదర్ హెచ్చరిక

Updated Date - Nov 06 , 2026 | 05:45 PM