మరో పదేళ్లలో క్యాన్సర్ కనుమరుగు: ఆంథ్రోపిక్ సీఈఓ
ABN , Publish Date - Nov 11 , 2026 | 03:05 PM
మరో పదేళ్లలో ఏఐతో వైద్య రంగంలో అద్భుతాలు జరుగుతాయని ఆంథ్రోపిక్ సంస్థ సీఈఓ డారియో తాజాగా తెలిపారు.
ఇంటర్నెట్ డెస్క్: ఏఐ అదుపు తప్పితే మానవాళికే ముప్పని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, టెక్ సంస్థల అధినేతలు కొందరు మాత్రం ఏఐతో అద్భుతాలు జరగనున్నాయని అంటున్నారు. మరో పదేళ్లలో ఏఐతో వైద్య రంగంలో అద్భుతాలు జరుగుతాయని ఆంథ్రోపిక్ సంస్థ సీఈఓ డారియో తాజాగా తెలిపారు. ‘క్యాన్సర్, ఆల్జైమర్స్, గుండె జబ్బులు, మానసిక రుగ్మతలు వంటివన్నీ కనుమరుగవుతాయి’ అని డారియో చెప్పారు. ‘ఏఐతో కరెక్ట్‌గా ప్లాన్ చేసుకుంటే అద్భుతాల శకానికి ఆహ్వానం పలకవచ్చు. వందల సంవత్సరాలుగా ఇబ్బంది పెడుతున్న సమస్యలను పరిష్కరించవచ్చు’ అని అన్నారు.
గతంలో గూగుల్ ఏఐ విభాగం బాస్ డెమిస్ హసాబిస్ కూడా ఇదే కామెంట్ చేశారు. కొత్త ఔషధాలను వారాల్లోనే గుర్తించే శకం వస్తుందని చెప్పారు. రాబోయే పదేళ్లలో అన్ని రోగాలు కనుమరుగవుతాయని చెప్పారు. జీవపరిశోధనలు గణనీయంగా వేగం పుంజుకుంటాయని ధీమా వ్యక్తం చేశారు. ఏఐ అభివృద్ధి చెందాక ప్రపంచంలోని ప్రజలందరికీ అమెరికా అధ్యక్షుడి స్థాయి వైద్య సౌకర్యాలు ఉంటాయని మస్క్ కూడా గతంలో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
అన్నీ ఉత్తమాటలే..
ఈ వాదనలను ఫార్మా రంగంలోని వారు తోసిపుచ్చారు. అవన్నీ నిరర్థక వ్యాఖ్యలేనని వర్టెక్స్ ఫార్మాసుటికల్స్ సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జెఫ్ లీడెన్ కుండబద్దలు కొట్టారు. ఏఐ సాయంతో తాము 10 వేల రకాల డ్రగ్స్‌ను గుర్తించినా వాటిలో ఒక్కటి కూడా ఔషధాల అభివృద్ధికి అనుగుణంగా లేదని చెప్పారు. ఔషధ గుణాలన్న నూతున రసాయనాలను వెనువెంటనే గుర్తించినా క్లీనికల్ ట్రయల్స్‌కు కనీసం 12 ఏళ్లు పడుతుందని చెప్పారు. కాబట్టి 10 ఏళ్లలోనే రోగాలు కనుమరుగవడం అసాధ్యమని అన్నారు. నూతన ఔషధాల గుర్తింపు కోసం అవసరమైన లోతైన కార్యాకారణ జ్ఞానం, బయాలజీపై అవగాహన ఏఐకి ప్రస్తుతానికైతే లేదని అంటున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
వాట్సాప్‌లో మీ చాటింగ్ సేఫ్.. నిరూపించిన గూగుల్ డీప్‌మైండ్
వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. బ్లూ టిక్స్ పడకుండానే మెసేజ్‌లు చదవొచ్చు!