డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు: భారత్ ఆశలు సజీవంగా ఉండాలంటే..?
ABN , Publish Date - Nov 01 , 2026 | 11:20 AM
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ చేరాలన్న టీమిండియా ఆశలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా మధ్య కేప్‌టౌన్ వేదికగా జరిగిన మూడో టెస్టు ఫలితం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికను పూర్తిగా మార్చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) 2025-27 ఫైనల్ చేరాలన్న టీమిండియా ఆశలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా మధ్య కేప్‌టౌన్ వేదికగా జరిగిన మూడో టెస్టు ఫలితం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికను పూర్తిగా మార్చేసింది. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించడంతో భారత్ ఫైనల్ రేసు మరింత క్లిష్టంగా మారింది. శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని టీమిండియా ఇకపై ఆడాల్సిన ఏడు టెస్టుల్లోనూ అత్యుత్తమ ప్రదర్శన చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
ఈ సైకిల్లో భారత్ 11 టెస్టులు ఆడి 68 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. పాయింట్ల శాతం 51.52గా ఉంది. భారత్ ఇంకా న్యూజిలాండ్‌తో విదేశాల్లో రెండు టెస్టులు, స్వదేశంలో ఆస్ట్రేలియాతో ఐదు టెస్టులు ఆడాల్సి ఉంది. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు టాప్-2 జట్లు మాత్రమే అర్హత సాధిస్తాయి. దీంతో మిగిలిన ఏడు మ్యాచ్‌లు టీమిండియాకు అత్యంత కీలకంగా మారాయి.
కివీస్‌తో సిరీస్‌లో గెలిస్తేనే..
నవంబర్ 19 నుంచి భారత్- న్యూజిలాండ్ మధ్య రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. ఇందులో గెలిస్తే టీమిండియా పాయింట్ల శాతం 58.97కు చేరుతుంది. అదే రెండు టెస్టుల్లోనూ ఓడిపోతే పీసీటీ 43.59కు పడిపోతుంది. అప్పుడు ఫైనల్ చేరాలంటే ఆసీస్‌తో జరిగే ఐదు టెస్టుల్లో అసాధారణ ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. ఒకవేళ న్యూజిలాండ్‌తో రెండు టెస్టుల్లో ఓడిపోయి.. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో జరిగే ఐదు టెస్టులనూ గెలిచినా భారత్ పీసీటీ 59.26 శాతానికి మాత్రమే చేరుకుంటుంది. దీంతో ఇతర జట్ల మ్యాచ్‌ల ఫలితాలపైనా ఆధారపడాల్సి వస్తుంది. అదే మిగిలిన ఏడు టెస్టుల్లోనూ భారత్ విజయం సాధిస్తే పీసీటీ ఏకంగా 70.37 శాతానికి చేరుతుంది. ఆరు విజయాలు సాధించినా 64.81 శాతం నమోదవుతుంది. అయితే రెండు లేదా అంతకంటే ఎక్కువ ఓటములు ఎదురైతే ఫైనల్ అవకాశాలు మరింత క్లిష్టంగా మారతాయి.
అగ్రస్థానంలో న్యూజిలాండ్.. రెండో స్థానానికి దక్షిణాఫ్రికా!
కేప్‌టౌన్ టెస్టులో ఆస్ట్రేలియాపై 176 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా విజయం సాధించడంతో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. టెంబా బవుమా సారథ్యంలోని ప్రొటీస్ జట్టు సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుని 71.43 పీసీటీతో రెండో స్థానానికి చేరుకుంది. మరోవైపు ఈ ఓటమితో ఆస్ట్రేలియా అగ్రస్థానం నుంచి మూడో స్థానానికి పడిపోయింది. ఆ జట్టు పీసీటీ 75 నుంచి 69.23 శాతానికి తగ్గింది. దీంతో ఆరు టెస్టుల్లో 52 పాయింట్లు సాధించిన న్యూజిలాండ్ 72.22 శాతంతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. బంగ్లాదేశ్‌పై వెస్టిండీస్ విజయం సాధించడంతో భారత్ నాలుగో స్థానానికి చేరగా.. బంగ్లాదేశ్ ఐదో స్థానానికి పడిపోయింది.
ఇవి కూడా చదవండి:
భువీని జట్టు నుంచి తప్పించడం సరైన నిర్ణయం కాదు: మహ్మద్ కైఫ్
ఇది ఆస్ట్రేలియా జట్టు ఆడే క్రికెట్ కాదు.. డేవిడ్ వార్నర్ ఫైర్