Share News

WPL 2026: నా కల నిజమైంది.. అరంగేట్రంలోనే అదరగొట్టిన సయాలీ

ABN , Publish Date - Jan 18 , 2026 | 04:39 PM

సయాలీ సత్ఘరే.. డబ్ల్యూపీఎల్ 2026లో రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరఫున అరంగేట్రం చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో కీలకమైన మూడు వికెట్లను తీసి డెబ్యూలోనే అదరగొట్టింది. ఆర్సీబీకి ఆడాలన్న తన కోరిక నిజమైందంటూ ఈ సందర్భంగా ఆనందం వ్యక్తం చేసింది.

WPL 2026: నా కల నిజమైంది.. అరంగేట్రంలోనే అదరగొట్టిన సయాలీ
Sayali Satghare

ఇంటర్నెట్ డెస్క్: సయాలీ సత్ఘరే.. డబ్ల్యూపీఎల్ 2026లో రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరఫున అరంగేట్రం చేసింది. స్టార్ ఆల్‌రౌండర్ ఎలీస్ పెర్రీ.. ఈ సీజన్ నుంచి అనూహ్యంగా తప్పుకోవడంతో సయాలీకి అవకాశం దక్కింది. పెర్రీ స్థానంలో వేరొకరిని ఊహించుకోవడమే కష్టం.. అలాంటిది దేశవాళీల్లో తప్ప అంతర్జాతీయ మ్యాచుల్లో అస్సలు రాణించని సయాలీని తీసుకోవడంతో అభిమానుల్లో కాస్తంత ఆందోళనే మొదలైంది. పటిష్ఠమైన ఆర్సీబీ జట్టులో ప్రతి ప్లేయర్ డేంజరస్‌గా మారి జట్టు గెలుపులో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు. వరుస విజయాలే దీనికి ఉదాహరణ. ఇలాంటి సమయాల్లో సయాలీ(Sayali Satghare)కి తొలి మూడు మ్యాచులో ఆడే అవకాశమే దొరకలేదు. ఎట్టకేలకు ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచుతో డబ్ల్యూపీఎల్‌లో అరంగేట్రం చేసింది. అభిమానుల్లో నెలకొన్న సందేహాలన్నీ పటాపంచలు చేస్తూ.. ఎవరూ ఊహించని విధంగా రాణించింది.


మహిళల ప్రీమియర్ లీగ్ 2026లో భాగంగా శనివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-ఢిల్లీ క్యాపిటల్స్ తలపడ్డాయి. ఇందులో ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచుతో అరంగేట్రం చేసిన ఆల్‌రౌండర్ సయాలీ సత్ఘరే.. ఏకంగా 3 వికెట్లు పడగొట్టి తన కలను నిజం చేసుకుంది. రెండో ఓవర్లో బౌలింగ్‌కు వచ్చిన సయాలీ.. మూడో బంతికే ఢిల్లీ కెప్టెన్ జెమీమా రోడ్రిగ్స్‌ను ఔట్ చేసింది. ఆ తదుపరి బంతికే స్టార్ ఆల్‌రౌండర్ మారిజాన్ కాప్‌ను క్లీన్ బౌల్డ్ చేసి సంచలనం సృష్టించింది. చివరికి 3/27 గణాంకాలతో తన డెబ్యూను మరపురాని జ్ఞాపకంగా మలుచుకుంది.


నా డ్రీమ్ డెబ్యూ..

‘ఇంకా నాకే నమ్మకం కలగడం లేదు. కానీ ఇది కచ్చితంగా నా డ్రీమ్ డెబ్యూ. ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచే నేను ఆర్సీబీ అభిమానిని. డబ్ల్యూపీఎల్ మొదలైనప్పటి నుంచి ఏదో ఒకరోజు ఆర్సీబీకి ఆడాలని కలలు కంటూ వస్తున్నాను. ఈ రోజు ఆ కల నిజమైంది. జట్టులోని ప్రతి ఒక్కరూ నాకు సపోర్ట్ చేశారు. యంగ్ టీమ్ కావడంతో అందరూ బాగా కలిసిపోయారు. ఒక్కొక్కరి విజయాన్ని అందరూ ఆనందంగా పంచుకుంటున్నారు’ అని సయాలీ ఆనందం వ్యక్తం చేసింది.


అన్‌సోల్డ్ నుంచి స్టార్ వరకు…

డబ్ల్యూపీఎల్ 2026 మెగా వేలంలో సయాలీ తొలుత అన్‌సోల్డ్‌గా మిగిలిపోయింది. అయితే.. వ్యక్తిగత కారణాలతో టోర్నీ నుంచి తప్పుకున్న స్టార్ ఆల్‌రౌండర్ ఎలీస్ పెర్రీ స్థానంలో ఆర్సీబీ ఆమెకు అవకాశం ఇచ్చింది. ఆ అవకాశాన్ని సయాలీ పూర్తిగా సద్వినియోగం చేసుకుంది. దేశవాళీ క్రికెట్‌లో ముంబై తరఫున 2024 లిస్ట్-ఏ వన్డే టోర్నీలో ఏడు మ్యాచ్‌ల్లో 260 పరుగులు, సగటు 52తో రాణించింది. ఇందులో 77 బంతుల్లో ఓ సెంచరీ కూడా చేసింది.


ఇవి కూడా చదవండి:

రికార్డు సృష్టించిన స్మృతి మంధాన

వైభవ్ సూర్యవంశీ స్టన్నింగ్ క్యాచ్.. వీడియో వైరల్

Updated Date - Jan 18 , 2026 | 04:59 PM