Share News

WPL 2026: ఆ మూడు రోజులు ఫ్యాన్స్‌కు నో ఎంట్రీ.. ఎందుకంటే?

ABN , Publish Date - Jan 12 , 2026 | 04:47 PM

మహిళల ప్రీమియర్ లీగ్ 2026కి ఎన్నికల ఎఫెక్ట్ తగలనుంది. మ్యాచులు జరుగుతున్న నవీ ముంబైలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉండటంతో భద్రతా బలగాలు సరిపోవని పోలీసులు బీసీసీఐకి చెప్పినట్టు సమాచారం. ఇదే జరిగితే మూడు రోజులు ఫ్యాన్స్ లేకుండానే మ్యాచులు నిర్వహిస్తారు.

WPL 2026: ఆ మూడు రోజులు ఫ్యాన్స్‌కు నో ఎంట్రీ.. ఎందుకంటే?
WPL 2026

ఇంటర్నెట్ డెస్క్: మహిళల ప్రీమియర్ లీగ్ 2026కి ఎన్నికల ఎఫెక్ట్ తగలనుంది. డబ్ల్యూపీఎల్‌(WPL 2026)లోభాగంగా జనవరి 17 వరకు మ్యాచులన్నీ నవీ ముంబై వేదికగానే జరుగనున్నాయి. అయితే అక్కడ(Navi Mumbai) జనవరి 15న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. ఆ స్థానిక ఎన్నికల నేపథ్యంలో భద్రతా బలగాలు సరిపోవని.. డబ్ల్యూపీఎల్ మ్యాచులకు భద్రత ఏర్పాటు చేయలేమని పోలీసులు బీసీసీఐకి స్పష్టం చేశారు. దీంతో మూడు రోజుల పాటు డబ్ల్యూపీఎల్ మ్యాచ్‌లకు ప్రేక్షకులకు అనుమతి లేనట్టు తెలుస్తోంది.


ఎన్నికల ప్రక్రియతో పాటు డబ్ల్యూపీఎల్ మ్యాచ్‌లు ఒకేసారి జరగడం వల్ల భద్రతా ఏర్పాట్లపై తీవ్ర ఒత్తిడి ఏర్పడుతుందని పోలీసులు బీసీసీఐ(BCCI)కి వెల్లడించినట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో పోలింగ్ రోజు జరిగే మ్యాచ్‌ను ఫ్యాన్స్ లేకుండానే నిర్వహించనున్నారు. అయితే కేవలం జనవరి 14, 15, 16 తేదీల్లో జరిగే మ్యాచ్‌లకు మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుందా? లేదా మిగతా అన్ని మ్యాచులకు ఈ నిర్ణయాన్ని కొనసాగిస్తారా? అనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.


టికెట్లపై అనిశ్చితి..

ఈ ఎన్నికల ప్రభావం ఇప్పటికే టికెట్ విక్రయాల్లో కనిపిస్తోంది. అధికారిక ఆన్‌లైన్ టికెటింగ్ ప్లాట్‌ఫామ్‌లో జనవరి 14 నుంచి 16 వరకు జరిగే మ్యాచ్‌లకు టికెట్లు అందుబాటులో లేవు. ఇదే పరిస్థితి కొనసాగితే మూడు మ్యాచ్‌లు ప్రేక్షకులు లేకుండానే జరగనున్నాయి. జనవరి 14న ఢిల్లీ క్యాపిటల్స్- యూపీ వారియర్స్, జనవరి 15న ముంబై ఇండియన్స్- యూపీ వారియర్స్, జనవరి 16న గుజరాత్ జెయింట్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి.


బీసీసీఐ మౌనం..

డబ్ల్యూపీఎల్ పూర్తి షెడ్యూల్‌ను బీసీసీఐ నవంబర్ 29న విడుదల చేయగా.. ఎన్నికల తేదీలు మాత్రం డిసెంబర్ 15న ప్రకటించారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన వెంటనే డబ్ల్యూపీఎల్ కమిటీకి సమాచారం అందినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ స్టేడియానికి ఫ్యాన్స్ ఎంట్రీపై బీసీసీఐ ఇప్పటివరకు అధికారిక ప్రకటన విడుదల చేయకపోవడంతో అభిమానుల్లో గందరగోళం నెలకొంది. టోర్నమెంట్ ఆరంభంలో మాత్రం స్టేడియాలు కళకళలాడాయి. ప్రారంభ మ్యాచ్‌కు దాదాపు పూర్తి స్థాయి ప్రేక్షకులు హాజరుకాగా.. వీకెండ్ డబుల్ హెడ్డర్లకు కూడా మంచి స్పందన లభించింది. మహిళల క్రికెట్‌పై అభిమానుల ఆసక్తి పెరుగుతున్న వేళ ఈ నిర్ణయం నిరాశ కలిగిస్తోంది.


ఇవి కూడా చదవండి:

సిరీస్ నుంచి వాషింగ్టన్ సుందర్ ఔట్.. ఆ స్థానంలో ఆడేది ఎవరంటే?

నన్ను ఆల్‌రౌండర్‌గా మార్చాలనుకుంటున్నారు.. హర్షిత్ రాణా

Updated Date - Jan 12 , 2026 | 04:47 PM