Share News

ఐపీఎల్ నయా సంచలనం.. అసలెవరీ మాధవ్ తివారీ!

ABN , Publish Date - May 12 , 2026 | 03:53 PM

పంజాబ్ కింగ్స్‌పై జరిగిన కీలక మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఉత్కంఠ పోరులో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో డీసీ యువ ఆల్‌రౌండర్ మాధవ్ తివారీ అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ సీజన్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లోనే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. అసలు ఇంతకీ ఎవరీ మాధవ్ తివారీ...!

ఐపీఎల్ నయా సంచలనం.. అసలెవరీ మాధవ్ తివారీ!
Madhav Tiwari

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు కొత్త యువ హీరో దొరికాడు. పంజాబ్ కింగ్స్‌పై జరిగిన కీలక మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఉత్కంఠ పోరులో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో డీసీ యువ ఆల్‌రౌండర్ మాధవ్ తివారీ అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. బంతితో రెండు కీలక వికెట్లు తీయడమే కాకుండా.. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఈ సీజన్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లోనే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. అసలు ఇంతకీ ఎవరీ మాధవ్ తివారీ...!


ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్రయాణం అంత గొప్పగా సాగలేదు. పంజాబ్ కింగ్స్‌పై మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన పరిస్థితి. ఇలాంటి దశలో జట్టులోకి యువ ఆల్‌రౌండర్‌ను తీసుకుని డీసీ షాకిచ్చింది. అతడికి ఇదే తొలి ఐపీఎల్ మ్యాచ్. అయితేనేమీ.. ఆ యువ పేస్ ఆల్‌రౌండర్ ఏ మాత్రం భయం లేకుండా ఉత్తమ ప్రదర్శన చేశాడు. అప్పటికే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని దూకుడుగా ఆడుతున్న పంజాబ్ ఓపెనర్ ప్రియాంశ్ ఆర్యను మాధవ్ తివారీ పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత సూపర్ ఫామ్‌లో ఉన్న కూపర్ కనోలీ(38; 27 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు)ని ఔట్ చేసి.. పంజాబ్ పరుగుల జాతరకు బ్రేక్ వేశాడు.


బ్యాటింగ్‌లోనూ..

తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్.. 211 పరుగుల భారీ లక్ష్యాన్ని ఢిల్లీ ముందు ఉంచింది. ఛేదనలో వరుసగా 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన జట్టును.. కెప్టెన్ అక్షర్ పటేల్(56), డేవిడ్ మిల్లర్(51) హాఫ్ సెంచరీలతో గట్టెక్కించారు. కీలక దశలో వీరిద్దరూ ఔట్ అవ్వడంతో డీసీకి ఓటమి కాస్త దరి చేరినట్టు అనిపించింది. ఇలాంటి సమయంలో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు మాధవ్ తివారీ. ఎదుర్కొన్న మొదటి బంతికే బౌండరీ బాదేశాడు. మొత్తంగా రెండు ఫోర్లు, ఒక సిక్స్‌తో 8 బంతుల్లో 18 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అటు బంతితోనూ, ఇటు బ్యాట్‌తోనూ రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ‘నేను 100 శాతం బ్యాటర్, 100 శాతం బౌలర్ అని చెప్పగలను’ అంటూ తన మీద తాను పెట్టుకున్న నమ్మకాన్ని బలంగా చెప్పుకొచ్చాడు.


అసలెవరీ మాధవ్ తివారీ..?

మధ్యప్రదేశ్‌లోని మౌగంజ్ గ్రామానికి చెందిన మాధవ్ తివారీ 2003 సెప్టెంబర్‌ 28న జన్మించాడు. ఇప్పటివరకు ఫస్ట్‌క్లాస్ లేదా లిస్ట్-ఏ క్రికెట్ ఆడకపోయినా.. ఏజ్ గ్రూప్ టోర్నీలు, దేశవాళీ టీ20ల్లో రాణించి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఐపీఎల్‌ 2025 మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ అతడిని రూ.40 లక్షలకు కొనుగోలు చేసింది. అదే సీజన్‌లో ముంబై ఇండియన్స్‌పై వాంఖడేలో ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. మాధవ్ మధ్యప్రదేశ్ అండర్-19, అండర్-23 జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. 2024-25 సీకే నాయుడు ట్రోఫీలో కూడా ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ముంబైపై ఫాలో ఆన్ పరిస్థితుల్లో 83 పరుగులు చేసి అందరి ప్రశంసలు అందుకున్నాడు. మధ్యప్రదేశ్ టీ20 లీగ్‌లో భోపాల్ లిపార్డ్స్ తరఫున ఆడి బ్యాట్‌, బాల్‌తో రాణించాడు. సెమీఫైనల్లో 31 బంతుల్లో 65 పరుగులు చేసి జట్టు ఫైనల్‌కు చేరుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ ప్రదర్శన చూసిన తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ అతడిని కొనుగోలు చేసింది.


ఇవి కూడా చదవండి:

నేను స్వయంగా రిటైర్ అవ్వాలనేదే వారి కోరిక: వినేశ్ ఫొగాట్

ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్‌కు భారీ జరిమానా

Updated Date - May 12 , 2026 | 03:53 PM