Share News

శతక సిక్సర్ల జాబితాలోకి.. కీలక మైలురాయికి అడుగు దూరంలో వైభవ్ సూర్యవంశీ

ABN , Publish Date - May 01 , 2026 | 05:10 PM

సిక్సర్ల పిడుగు వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం ఓ కీలక మైలురాయికి అత్యంత చేరువలో ఉన్నాడు. మరొక్క సిక్స్ బాదితే టీ20 క్రికెట్‌లో వంద సిక్సర్ల జాబితాలోకి చేరిపోతాడు. వైభవ్ ఈ ఘనత సాధిస్తే.. ప్రపంచంలోనే ఈ ఫీట్ అందుకున్న తొలి టీనేజర్‌గా చరిత్ర సృష్టిస్తాడు.

శతక సిక్సర్ల జాబితాలోకి.. కీలక మైలురాయికి అడుగు దూరంలో వైభవ్ సూర్యవంశీ
Vaibhav Suryavanshi

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అద్భుత ప్రదర్శనలతో అదరగొడుతున్నాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే అసాధారణ ప్రతిభతో ఎవ్వరికీ సాధ్యం కాని రికార్డులను కొల్లగొడుతున్నాడు. గతేడాది రాజస్థాన్ రాయల్స్ తరఫున అరంగేట్రం చేసిన వైభవ్.. ఆడిన మూడో మ్యాచ్‌లోనే 35 బంతుల్లో సెంచరీ చేసి ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. ఈ సీజన్‌లోనూ 36 బంతుల్లోనే శతకం బాదేసి ఔరా అనిపించాడు. అయితే సిక్సర్ల పిడుగు వైభవ్ ప్రస్తుతం ఓ కీలక మైలురాయికి అత్యంత చేరువలో ఉన్నాడు. మరొక్క సిక్స్ బాదితే టీ20 క్రికెట్‌లో వంద సిక్సర్ల జాబితాలోకి చేరిపోతాడు. వైభవ్ ఈ ఘనత సాధిస్తే.. ప్రపంచంలోనే ఈ ఫీట్ అందుకున్న తొలి టీనేజర్‌గా చరిత్ర సృష్టిస్తాడు.


రాజస్థాన్ రాయల్స్ జట్టు నేడు జైపూర్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. ప్రపంచ మేటి బౌలర్లు వేసిన తొలి బంతినే సిక్స్‌గా మలిచే అలవాటు ఉన్న వైభవ్.. ఈ ఫీట్‌ను ఈరోజే అందుకునే అవకాశం ఉంది. అయితే మరొక రికార్డు కూడా వైభవ్ కోసం వేచి చూస్తోంది. ఐపీఎల్‌లో ఒకే సీజన్‌లో అత్యధిక సిక్సులు (42) కొట్టిన భారత ఆటగాళ్ల జాబితాలో అభిషేక్ శర్మ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఈ రికార్డును కూడా వైభవ్ దాటే దిశగా దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం అతని ఖాతాలో 37 సిక్సులు ఉన్నాయి. మరో ఐదు సిక్సర్లు బాదితే అభిషేక్ రికార్డు కూడా బ్రేక్ అవ్వనుంది. ఈ సీజన్‌లో వైభవ్ 9 మ్యాచ్‌లు ఆడి 400 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.


ఈ సీజన్‌లో వైభవ్ రికార్డులివి:

  • ఒక ఐపీఎల్ సీజన్‌లో కేవలం 167 బంతుల్లోనే 400 పరుగులు పూర్తి చేసి రస్సెల్ రికార్డును బద్దలు కొట్టాడు.

  • అతి చిన్న వయసులో వేగంగా 1,000 టీ20 పరుగులు చేసిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. ఎస్ఆర్‌హెచ్‌పై 37 బంతుల్లో 103 పరుగులతో ఈ ఘనత సాధించాడు.

  • ఐపీఎల్‌లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సులు(12) బాదిన భారత ఆటగాడిగా కొత్త రికార్డు.

  • ఎస్ఆర్‌హెచ్‌పై 36 బంతుల్లో శతకం సాధించి మూడో వేగవంతమైన ఐపీఎల్ సెంచరీ చేసిన ప్లేయర్‌గా రికార్డు

  • 15 ఏళ్ల వయసులోనే రెండు సెంచరీలు. ఆ రెండూ 40 బంతుల్లోపే సాధించడం విశేషం.


ఇవి కూడా చదవండి:

రజత్ పాటిదార్ ఔట్ వివాదం.. స్పందించిన జేసన్ హోల్డర్

మహిళలు స్నానం చేస్తుండగా వీడియో.. శ్రీలంక క్రికెటర్ల అరెస్ట్!

Updated Date - May 01 , 2026 | 05:11 PM