టీ20ల్లోనే కాదు.. వన్డే ఫార్మాట్‌లో కూడా దూకుడుగా ఆడగలను: వైభవ్ సూర్యవంశీ
ABN , Publish Date - Jun 22 , 2026 | 06:50 AM
ముక్కోణపు వన్డే సిరీస్ విజేతగా భారత్-ఎ జట్టు నిలిచిన సంగతి తెలిసిందే. శ్రీలంక-ఎతో జరిగిన ఫైనల్ పోరులో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ రికార్డు ఇన్నింగ్స్ ఆడాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: ముక్కోణపు వన్డే సిరీస్ విజేతగా భారత్-ఎ జట్టు నిలిచిన సంగతి తెలిసిందే. శ్రీలంక-ఎతో జరిగిన ఫైనల్ పోరులో భారత్.. 66 పరుగులు తేడాతో ఘన విజయం సాధించి ట్రోఫీని ముద్దాడింది. ఈ మ్యాచ్‌లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ రికార్డు ఇన్నింగ్స్ ఆడాడు. 29 బంతుల్లోనే 94 పరుగులు చేసి లంక బౌలర్లకు చుక్కలు చూపించాడు. 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి.. లిస్ట్-ఎ క్రికెట్‌లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ ప్రపంచ రికార్డు సాధించాడు. లీగ్ మ్యాచ్‌లో లంక ప్లేయర్లు రెచ్చగొట్టడంతో వైభవ్ ఆగ్రహానికి గురైన సంగతి తెలిసిందే. వాటన్నింటికీ వైభవ్ బ్యాట్‌తో ప్రతీకారం తీర్చుకున్నాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత వైభవ్ తన ఇన్నింగ్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
‘నాపై ఎలాంటి ఒత్తిడి లేదు. నేను దేని గురించి ఆలోచించకుండా అనుకున్న ప్రణాళికలను మైదానంలో పక్కాగా అమలు చేశా. ఫైనల్‌లో జట్టుకు భారీ స్కోర్ అందించాలనుకున్నా. ఆ ప్రకారమే బ్యాటింగ్ చేశాను. అయితే ఈ టోర్నీలో నేను అనుకున్న విధంగా ఆడలేకపోయాను. కోచ్‌లతో చర్చించిన తర్వాత ఆఖరి మ్యాచ్‌లో నా ప్రణాళికలను సరిగ్గా అమలు చేశాను. ఈ సిరీస్‌లో నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. నేను టీ20 బ్యాటర్‌ని అని.. 50 ఓవర్ల ఫార్మాట్‌కు సరిపోనంటూ విమర్శలు వచ్చాయి. కానీ వన్డే ఫార్మాట్‌లో కూడా నేను చాలా మ్యాచ్‌లు ఆడాను. ఇదే దూకుడును ప్రదర్శించాను. ఈ విషయం చాలామందికి తెలియకపోవచ్చు. భిన్నమైన పరిస్థితులకు తగ్గట్టు ఆడటం నాకు సవాలుగా అనిపిస్తుంది’ అని వైభవ్ సూర్యవంశీ తెలిపాడు. అండర్ 19 ప్రపంచ కప్ ఫైనల్ పోరులో వైభవ్ 175 పరుగుల భారీ ఇన్నింగ్స్ ఆడి జట్టును ట్రోఫీ అందించిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
ముక్కోణపు సిరీస్ విజేతగా భారత్-ఎ
33 మ్యాచుల్లో 100 గోల్స్ .. 68 ఏళ్ల తర్వాత అత్యంత వేగంగా...