వైభవ్ వేట కుర్రాళ్ల కేక
ABN , Publish Date - Jun 22 , 2026 | 06:02 AM
టీనేజ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ (29 బంతుల్లో 10 ఫోర్లు, 8 సిక్స్‌లతో 94) వేగవంతమైన అర్ధ శతకంతో చెలరేగడంతో.. యువ భారత్ ముక్కోణపు సిరీస్ విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో భారత్-ఎ ...
11 బంతుల్లోనే అర్ధ శతకంతో ప్రపంచ రికార్డు
ముక్కోణపు సిరీస్ విజేత భారత్-ఎ
ఫైనల్లో లంక-ఎ చిత్తు
క్రికెట్ చిన్నోడు వైభవ్ సూర్యవంశీ మళ్లీ చితక్కొట్టాడు. బ్యాటు విరిగేలా, బంతి పగిలేలా కసిదీరా బాదాడు. ముక్కోణపు వన్డే సిరీస్ ఫైనల్లో శ్రీలంక ‘ఎ’ జట్టుపై పెను విధ్వంసం సృష్టించిన 15 ఏళ్ల వైభవ్.. కేవలం 11 బంతుల్లోనే 50 పరుగులు సాధించాడు. లిస్ట్ ‘ఎ’ క్రికెట్‌లో వేగవంతమైన అర్ధ సెంచరీ చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 29 బంతుల్లో 8 సిక్స్‌లు, 10 ఫోర్లతో 94 పరుగులు కొల్లగొట్టాడు. వైభవ్ పవర్ హిట్టింగ్‌తో భారీ స్కోరు చేసిన భారత్ ‘ఎ’ తర్వాత లంకను పడగొట్టి విజేతగా నిలిచింది.
దంబుల్లా: టీనేజ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ (29 బంతుల్లో 10 ఫోర్లు, 8 సిక్స్‌లతో 94) వేగవంతమైన అర్ధ శతకంతో చెలరేగడంతో.. యువ భారత్ ముక్కోణపు సిరీస్ విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో భారత్-ఎ 66 పరుగుల తేడాతో శ్రీలంక-ఎను చిత్తు చేసింది. తొలుత భారత్-ఎ 50 ఓవర్లలో 377/9 స్కోరు చేసింది. తిలక్ వర్మ (67), రుతురాజ్ గైక్వాడ్ (40), ప్రియాన్ష్ ఆర్య (39), అనుకూల్ రాయ్ (39) రాణించారు. వనుజ సహన్, రవీందు ఫెర్నాండో, కుగాథస్ మథులాన్ తలో రెండు వికెట్లు దక్కించుకొన్నారు. ఛేదనలో శ్రీలంక-ఎ 47.1 ఓవర్లలో 311 పరుగులకు ఆలౌటైంది. వనుజ సహన్ (62), సమరవిక్రమ (52) అర్ధ శతకాలు వృథా అయ్యాయి. యశ్ ఠాకూర్, విప్రజ్ నిగమ్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. వైభవ్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ నిలిచాడు.
భరతం పట్టాడు..: భారత ఇన్నింగ్స్‌లో ఓపెనర్ వైభవ్ ఆటే హైలైట్. ఈ టోర్నీలో చెప్పుకోదగ్గ స్కోర్లు చేయని సూర్యవంశీ కసిగా చెలరేగాడు. దీంతో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకొన్న లంక తలపట్టుకోవాల్సి వచ్చింది. పవర్‌ప్లేలో సుడిగాలిలా చెలరేగిన వైభవ్.. భారీ షాట్లతో లంక బౌలర్ల భరతం పట్టాడు. ఎదుర్కొన్న తొలి 11 బంతుల్లో 4, 4, 4, 6, 6, 0, 6, 4, 4, 6, 6తో లిస్ట్-ఎ క్రికెట్‌లోనే వేగవంతమైన అర్ధ శతకాన్ని నమోదు చేశాడు. ఆరంభంలో లెగ్‌సైడ్‌లో ఎక్కువ షాట్లు ఆడిన వైభవ్.. ఆ తర్వాత ఆఫ్‌సైడ్ కూడా చూడముచ్చటైన స్ట్రోక్‌లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో మరో ఓపెనర్ ఆర్యతో కలసి తొలి వికెట్‌కు 132 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. వైభవ్ వీరబాదుడు చూస్తుంటే వేగవంతమైన సెంచరీ రికార్డును కూడా బద్దలు కొడతాడని భావించారు. కానీ, 9వ ఓవర్‌లో అరాచిచిగే బౌలింగ్‌లో క్యాచవుటైన వైభవ్.. త్రుటిలో శతకాన్ని చేజార్చుకొన్నాడు. ఆర్యను సముదిత అవుట్ చేయడంతో.. లంక మ్యాచ్‌లోకి వచ్చే ప్రయత్నం చేసింది. మధ్య ఓవర్లలో రుతురాజ్, కెప్టెన్ తిలక్ స్ట్రయిక్ రొటేట్ చేస్తూ మూడో వికెట్‌కు 63 పరుగులు జోడించారు. దూకుడుగా ఆడే ప్రయత్నంలో భారత్-ఎ క్రమం తప్పకుండా వికెట్ల చేజార్చుకొన్నా.. కుమార్ కుశాగ్ర (36), విప్రజ్ నిగమ్ (27), రాయ్ బ్యాట్లు ఝుళిపించడంతో స్కోరు 370 మార్క్ దాటింది.

స్కోరుబోర్డు
భారత్-ఎ: ప్రియాన్ష్ (సి) వియస్కాంత్ (బి) సముదిత 39, వైభవ్ (సి) వియస్కాంత్(బి) అరాచిచిగే 94, రుతురాజ్ (బి) షిరాజ్ 40, తిలక్ (సి) అవిష్క (బి) సహన్ 67, కుమార్ కుశాగ్ర (సి) డిక్‌వెలా (బి) రవీందు 36, సూర్యాంశ్ (బి) రవీందు 2, నిషాంత్ (సి) రవీందు (బి) సహన్ 16, విప్రజ్ (సి) షిరాజ్ (బి) మాథులాన్ 27, అనుకూల్ (ఎల్బీ) మాథులాన్ 39, యశ్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు: 15; మొత్తం: 50 ఓవర్లలో 377/9; వికెట్ల పతనం: 1-132, 2-136, 3-220, 4-283, 5-285, 6-289, 7-330, 8-334, 9-377; బౌలింగ్: షిరాజ్ 6-1-56-1, అరాచిచిగే 4-0-35-1, సముదిత 5-0-54-1, మథులాన్ 7-0-82-2, రవీందు ఫెర్నాండో 10-0-72-2, వియస్కాంత్ 8-0-36-0, వనుజ 10-0-39-2.
శ్రీలంక-ఎ: నిరోషన్ (బి) యశ్ 25, అవిష్క (సి) గైక్వాడ్ (బి) యశ్ 3, నువనిదు (సి) విప్రజ్ (బి) యశ్ 21, సమరవిక్రమ (సి) కుశాగ్ర (బి) అశోక్ 52, సహన్ (సి) యశ్ (బి) తిలక్ 38, రవీందు (సి) తిలక్ (బి) విప్రజ్ 19, వనుజ (సి) తిలక్ (బి) విప్రజ్ 62, వియస్కాకాంత్ (సి) వైభవ్ (బి) అనుకూల్ 39, షిరాజ్ (సి) అనుకూల్ (బి) విప్రజ్ 21, సముదిత (సి) విప్రజ్ (బి) అనుకూల్ 15, మథులాన్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు: 16; మొత్తం: 47.1 ఓవర్లలో 311 ఆలౌట్; వికెట్ల పతనం: 1-28, 2-33, 3-75, 4-128, 5-149, 6-177, 7-254, 8-284, 9-303; బౌలింగ్: యశ్ 7-0-45-3, అశోక్ 9-0-75-1, నిషాంత్ 5-0-32-0, సూర్యాంశ్ 6-0-37-0, విప్రజ్ 9.1-0-60-3, తిలక్ 2-0-11-1, అనుకూల్ 9-0-42-2.
1
లిస్ట్ ఏ క్రికెట్‌లో వేగవంతమై అర్ధ శతకం నమోదు చేసిన ఆటగాడిగా 21 ఏళ్ల రికార్డును వైభవ్ బద్దలుకొట్టాడు. 11 బంతుల్లోనే ఈ మార్క్‌ను అందుకొన్న సూర్యవంశీ.. 2005లో లంక బ్యాటర్ కౌశల్య వీరరత్నే సాధించిన 12 బంతుల్లో ఫిఫ్టీ రికార్డును అధిగమించాడు.
ఇవి కూడా చదవండి:
33 మ్యాచుల్లో 100 గోల్స్ .. 68 ఏళ్ల తర్వాత అత్యంత వేగంగా...