సత్తాచాటిన స్పెయిన్
ABN , Publish Date - Jun 22 , 2026 | 05:55 AM
మూడు నిమిషాల తేడాతో మైకేల్ ఒయర్జబల్ రెండు గోల్స్‌తో అదరగొట్టడంతో.. టైటిల్ ఫేవరెట్ స్పెయిన్ నాకౌట్ అవకాశాలను మెరుగుపర్చుకొంది. గ్రూప్-హెచ్‌లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో...
ఫిఫా కప్ మ్యాచ్‌లు
న్యూజిలాండ్ X ఈజిప్ట్
(ఉదయం 6.30 గం.)
అర్జెంటీనా X ఆస్ట్రియా
(రా. 10.30 గం.)
ఫ్రాన్స్ X ఇరాక్
(సోమవారం తెల్లవారుజాము 2.30 గం.)
ఒయర్జబల్ ‘డబుల్’ జూ0-4తో సౌదీ చిత్తు
అట్లాంటా: మూడు నిమిషాల తేడాతో మైకేల్ ఒయర్జబల్ రెండు గోల్స్‌తో అదరగొట్టడంతో.. టైటిల్ ఫేవరెట్ స్పెయిన్ నాకౌట్ అవకాశాలను మెరుగుపర్చుకొంది. గ్రూప్-హెచ్‌లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో స్పెయిన్ 4-0తో సౌదీ అరేబియాను చిత్తు చేసింది. వరల్డ్‌క్‌పలో తొలి విజయాన్ని నమోదు చేసింది. లామినె యామల్ (10వ నిమిషం), ఒయర్జబల్ (21వ, 24వ) స్పెయిన్ తరఫున గోల్స్ చేశారు. 49వ నిమిషంలో సౌదీ ప్లేయర్ హసన్ అల్టామ్‌బకి ఓన్‌గోల్‌తో ప్రత్యర్థి ఆధిక్యాన్ని మరింతగా పెంచాడు. పసికూన కేప్ వెర్డెతో మ్యాచ్‌ను డ్రా చేసుకొని తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న స్పెయిన్.. రెండో మ్యాచ్‌లో జూలు విదిల్చింది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతూ సౌదీ డిఫెన్స్‌ను తీవ్ర ఒత్తిడిలో పడేసింది. ఈ క్రమంలో ఫస్టాఫ్ 10వ నిమిషంలో గోల్‌పోస్ట్‌కు ముందు మైకేల్ ఇచ్చిన పాస్‌ను.. యామల్ జారుతూ గోల్‌లోకి పంపాడు. ఇక, 21వ నిమిషంలో కార్నర్ కిక్‌ను ఒయర్జబల్ గోల్‌గా మలచడంతో స్పెయిన్ 2-0 ఆధిక్యంలో నిలిచింది. మరో మూడు నిమిషాలకు మరో గోల్ చేసి ఒయర్జబల్ జట్టుకు మూడో గోల్‌ను అందించాడు. ఇక, సెకండాఫ్ 49వ నిమిషంలో సౌదీ ప్లేయర్ హసన్ అల్టామ్‌బక్తి సెల్ఫ్ గోల్‌తో స్పెయిన్ ఆధిక్యాన్ని మరింతగా పెంచాడు. కానీ, సబ్‌స్టిట్యూట్‌లు ఎక్కువగా చేయడంతో ఆటలో వేగం మందగించింది. స్టాపేజ్ టైమ్‌లో ఫెర్రన్ టోరెస్ గోల్ చేసినా.. రివ్యూలో ఆఫ్‌సైడ్‌గా తేలింది.
డెనిజ్ డబుల్ గోల్.. జర్మనీ నాకౌట్‌కు
టొరంటో: నాలుగుసార్లు చాంపియన్ జర్మనీ ప్రపంచక్‌పలో నాకౌట్ బెర్త్ ఖాయం చేసుకుంది. గ్రూప్-ఈలో జరిగిన పోరులో జర్మనీ 2-1తో ఐవరీ కోస్ట్‌ను ఓడించింది. ఫార్వర్డ్ ఆటగాడు డెనిజ్ ఉన్‌దవ్ (68వ, 90+4వ నిమిషంలో) రెండు గోల్స్ సాధించి జర్మన్‌కు విజయాన్ని కట్టబెట్టాడు. ఐవరీ జట్టు తరఫున ఏకైక గోల్‌ను ఫ్రాంక్ కెస్సీ (30వ) చేశాడు. తన గ్రూప్‌లో వరుసగా రెండో గెలుపుతో ఆరు పాయింట్లను ఖాతాలో వేసుకున్న జర్మనీ రౌండ్ ఆఫ్ 32కు అర్హత సాధించింది. గత రెండు పర్యాయాలు (2018, 2022) గ్రూప్ దశలోనే నిష్క్రమించిన జర్మనీ.. 12 ఏళ్ల తర్వాత నాకౌట్ చేరింది. చివరిగా 2014లో నాకౌట్‌లో ప్రవేశించింది.
ఈక్వెడార్‌ను నిలువరించిన కురకావో: గ్రూప్-ఈలోనే జరిగిన పోరులో అతిచిన్న జట్టు కురకావో తమకంటే ఎన్నోరెట్లు మెరుగైన, బలమైన ఈక్వెడార్‌ను నిలువరించింది. నిర్ణీత సమయానికి ఇరుజట్లు గోల్ చేయడంలో విఫలమయ్యాయి. దీంతో మ్యాచ్ 0-0తో డ్రాగా ముగిసింది. కురకావో గోల్‌కీపర్ ఎలోయ్ రూమ్ ప్రత్యర్థి దాడులను సమర్ధవంతంగా తిప్పికొట్టి మ్యాచ్ డ్రా కావడంలో కీలకపాత్ర పోషించాడు. చెరో ఓటమి, డ్రాలతో ఒక్కో పాయింట్ మాత్రమే కలిగిన ఈక్వెడార్, కురకావో జట్లు టోర్నీ నుంచి నిష్క్రమించినట్టే.
జపాన్ చేతిలో చిత్తు.. ట్యునీషియా ఇంటికి: ప్రపంచక్‌పలో ఆసియా జట్టు జపాన్ బోణీ కొట్టింది. గ్రూప్-ఎ్‌ఫలో ఆదివారం జరిగిన పోరులో జపాన్ 4-0తో ట్యునీషియాను చిత్తు చేసింది. జపాన్ తరఫున అయాసె ఉయెదా (31వ, 83వ నిమిషంలో) రెండు గోల్స్ కొట్టగా.. డైచి కమడా (4వ), జున్యా ఇటో (69వ) చెరో గోల్ చేశారు. జపాన్, ట్యునీషియా మధ్య జరిగిన పోరు ఫిఫా ప్రపంచకప్ చరిత్రలో 1000వ మ్యాచ్ కావడం విశేషం. ఇక, వరుసగా రెండో ఓటమితో ట్యునీషియా టోర్నీ నుంచి నిష్క్రమించింది.
ఇవి కూడా చదవండి:
ముక్కోణపు సిరీస్ విజేతగా భారత్-ఎ
33 మ్యాచుల్లో 100 గోల్స్ .. 68 ఏళ్ల తర్వాత అత్యంత వేగంగా...