Share News

టీమిండియాను వెంటాడుతున్న గాయాలు.. సమన్వయ లోపమే కారణమా?

ABN , Publish Date - Jul 22 , 2026 | 04:48 PM

భారత జట్టును కొంతకాలంగా గాయాల బెడద వెంటాడుతోంది. ఆటగాళ్ల ఫిట్‌నెస్, వర్క్ ‌లోడ్ మేనేజ్‌మెంట్ విషయంలో బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE), జట్టు యాజమాన్యం, సపోర్ట్ స్టాఫ్ మధ్య సరైన సమన్వయం లేకపోవడమే దీనికి కారణమని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నట్లు సమాచారం.

టీమిండియాను వెంటాడుతున్న గాయాలు.. సమన్వయ లోపమే కారణమా?
Team India injuries

ఇంటర్నెట్ డెస్క్: భారత జట్టును కొంతకాలంగా గాయాల బెడద వెంటాడుతోంది. ఇటీవల ఇంగ్లండ్ పర్యటన నిరాశాజనకంగా ముగిసిన అనంతరం వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కూడా ప్లేయర్ల గాయాలపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆటగాళ్ల ఫిట్‌నెస్, వర్క్ ‌లోడ్ మేనేజ్‌మెంట్ విషయంలో బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE), జట్టు యాజమాన్యం, సపోర్ట్ స్టాఫ్ మధ్య సరైన సమన్వయం లేకపోవడమే దీనికి కారణమని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నట్లు సమాచారం.


‘ఇటీవల ప్లేయర్లు తరచూ గాయాల పాలవుతున్నారు. ఇది చూస్తుంటే కొందరు ఆటగాళ్లు పూర్తిస్థాయి ఫిట్‌నెస్ సాధించక ముందే బరిలోకి దిగుతున్నట్లు కనిపిస్తోంది. ఆటగాడి ఫిట్‌నెస్ స్థితి, వర్క్ ‌లోడ్‌కు సంబంధించిన విషయాల్లో సమన్వయం లోపించింది’ అని బీసీసీఐకి చెందిన ఓ అధికారి వెల్లడించారు. మెడికల్ మాజీ హెడ్ నితిన్ పటేల్ వెళ్లిపోయిన తర్వాత సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు ఇప్పటికీ పూర్తి స్థాయి మెడికల్ హెడ్‌ను నియమించలేదని తెలుస్తోంది. 2023లో రూపొందించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (SOPs)లోనూ ఎలాంటి మార్పులు చేయలేదని సమాచారం.


తరచూ గాయపడుతున్న ప్లేయర్లు..

వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా వంటి యువ ఆటగాళ్లు తరచూ గాయాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా నితీశ్ రెడ్డి ఇంగ్లండ్‌కు చెందిన బౌలింగ్ కోచ్ స్టెఫాన్ జోన్స్ పర్యవేక్షణలో తన బౌలింగ్ వేగాన్ని పెంచుకునేందుకు ప్రయత్నించడం కూడా చర్చనీయాంశమైంది. జట్టు అవసరాల దృష్ట్యా ప్రతిసారీ మరింత వేగంగా బౌలింగ్ చేయాలనే ప్రయత్నం చేయడం వల్ల శరీరంపై అదనపు ఒత్తిడి పడుతోందని బీసీసీఐ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. వేగం పెంచే ప్రక్రియను దశలవారీగా అమలు చేయాల్సి ఉండగా, తొందరపాటు వల్ల గాయాల ప్రమాదం పెరిగిందని పేర్కొన్నాయి.


వాషింగ్టన్ సుందర్‌ను తొందరపెట్టారా?

ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన టీ20 ప్రపంచ కప్‌‌నకు ముందు వాషింగ్టన్ సుందర్‌ను కూడా పూర్తిస్థాయి ఫిట్‌నెస్ లేకుండానే జట్టులోకి తీసుకొచ్చినట్లు సమాచారం. జట్టుతో చేరిన తర్వాత మ్యాచ్ ఆడే స్థాయికి చేరుకోవడానికి అతనికి దాదాపు పది రోజులు పట్టిందని, టోర్నీ మధ్యలోనే త్వరగా సిద్ధం కావాలని ఒత్తిడి రావడం అతని ఆరోగ్యంపై ప్రభావం చూపి ఉండొచ్చని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. జాతీయ జట్టుతో ప్రయాణించని సమయంలో బీసీసీఐ వైద్య బృందం నుంచి సరైన మార్గదర్శకత్వం, నిరంతర సమాచార లోపం ఉందనే భావన పలువురు భారత ఆటగాళ్లలో నెలకొన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అన్ని ఫార్మాట్లలో ఆడే ప్లేయర్లు చాలా తక్కువగా ఉన్నందున అంతర్జాతీయ సిరీస్‌ల మధ్య వారికి విరామం లభిస్తోంది. అయితే పునరావాసం కోసం CoEలో లేకపోతే ఆటగాళ్లు తమంతట తామే ఫిట్‌నెస్ చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని, దీనిపై మరింత సమన్వయం అవసరమని బీసీసీఐ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.


ఇవి కూడా చదవండి:

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్: రోహిత్ శర్మ జోరు.. అగ్రస్థానానికి అడుగు దూరంలో గిల్

డ్రంకెన్ డ్రైవ్ కేసు.. డేవిడ్ వార్నర్‌ను దోషిగా తేల్చిన కోర్టు

Updated Date - Jul 22 , 2026 | 04:48 PM