Share News

డ్రంకెన్ డ్రైవ్ కేసు.. డేవిడ్ వార్నర్‌ను దోషిగా తేల్చిన కోర్టు

ABN , Publish Date - Jul 22 , 2026 | 02:29 PM

ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ డేవిడ్ వార్నర్‌కు షాక్ తగిలింది. మద్యం తాగి వాహనం నడిపిన కేసులో సిడ్నీ న్యాయస్థానం అతడిని దోషిగా తేల్చింది. వచ్చే నెల 18న శిక్ష ఖరారు చేయనున్నట్లు తెలిపింది.

డ్రంకెన్ డ్రైవ్ కేసు.. డేవిడ్ వార్నర్‌ను దోషిగా తేల్చిన కోర్టు
David Warner

ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ డేవిడ్ వార్నర్‌కు షాక్ తగిలింది. మద్యం తాగి వాహనం నడిపిన కేసులో సిడ్నీ న్యాయస్థానం అతడిని దోషిగా తేల్చింది. వచ్చే నెల 18న శిక్ష ఖరారు చేయనున్నట్లు తెలిపింది. గరిష్ఠంగా 9 నెలల జైలు శిక్ష పడనున్నట్లు తెలుస్తోంది. గత ఏప్రిల్‌లో మద్యం తాగి వాహనం నడిపిన కేసులో సిడ్నీ పోలీసులు వార్నర్‌ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బెయిల్‌పై అతడు బయటికి వచ్చాడు. తాజాగా ఈ కేసును బుధవారం సిడ్నీ న్యాయస్థానం విచారించింది. బిగ్ బాష్ లీగ్‌లో సిడ్నీ థండర్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తోన్న వార్నర్ కోర్టుకు నేరుగా హాజరు కాలేకపోయాడు. దీంతో వార్నర్ తన తప్పును అంగీకరించినట్లు అతడి తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపాడు. వాదనలు విన్న న్యాయస్థానం శిక్ష ఖరారు చేయనున్నట్లు తెలిపింది.


ఏప్రిల్ 5న సిడ్నీలోని మరౌబ్రా ప్రాంతంలో పోలీసులు ర్యాండమ్ బ్రీత్ టెస్టింగ్ నిర్వహించారు. అది గమనించిన వార్నర్ తన వాహనాన్ని ఆపి పక్కనే పార్క్ చేశాడు. అనుమానం వచ్చిన పోలీసులు బ్రీత్ అనలైజర్‌తో అతడిని టెస్టు చేశారు. చట్టబద్ధంగా అనుమతించిన పరిమితికి కంటే అతడు రెండింతలకు పైగా మద్యం తాగినట్లు తేలడంతో అరెస్టు చేశారు. ఈ కేసులో శిక్షను ఆగస్టు 18న కోర్టు ఖరారు చేయనుంది. న్యూసౌత్ వేల్స్ చట్టాల ప్రకారం తొలిసారి డ్రైవింగ్ కేసులో దోషిగా తేలితే గరిష్ఠంగా తొమ్మిది నెలల జైలు శిక్ష, 2,200 ఆస్ట్రేలియన్ డాలర్ల వరకు జరిమానా, ఆరు నుంచి 12 నెలల వరకు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసే అవకాశం ఉంది.


కెప్టెన్సీపై నీలినీడలు

వార్నర్ దోషిగా తేలడంతో సిడ్నీ థండర్ కెప్టెన్‌గా అతడి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. రోడ్డు భద్రతపై న్యూసౌత్ వేల్స్ ప్రభుత్వంతో కలిసి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న క్రికెట్ ఎన్ఎస్‌డబ్ల్యూ ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తోంది. ‘ఈ ఆరోపణలు ఆందోళనకరమైనవి. మద్యం తాగి డ్రైవింగ్ చేయడాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించము’ అని క్రికెట్ ఎన్ఎస్‌డబ్ల్యూ చీఫ్ ఎగ్జిక్యూటివ్ లీ జెర్మన్ స్పష్టం చేశారు. ఇప్పటికే 2018 కేప్‌టౌన్ బాల్ టాంపరింగ్ వివాదం కారణంగా నాయకత్వ బాధ్యతలపై వార్నర్ జీవితకాల నిషేధాన్ని ఎదుర్కొన్నాడు. అయితే విచారణ అనంతరం 2024లో ఆ నిషేధాన్ని ఎత్తేశారు. అలాంటి సమయంలో మరో క్రమశిక్షణా ఉల్లంఘన వెలుగులోకి రావడంతో అతని కెప్టెన్సీ కొనసాగుతుందా లేదా అన్నది సందేహంగా మారింది. ఆగస్టు 18న కోర్టు తీర్పు వెలువడిన అనంతరం క్రికెట్ ఎన్ఎస్‌డబ్ల్యూ, సిడ్నీ థండర్ యాజమాన్యం వార్నర్ కెప్టెన్సీపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.


ఇవి కూడా చదవండి:

భారత్‌తో టీ20 సిరీస్.. జట్టును ప్రకటించి జింబాబ్వే

అఫ్గానిస్థాన్ వన్డే కెప్టెన్‌ పదవికి హష్మతుల్లా షాహిది రాజీనామా

Updated Date - Jul 22 , 2026 | 02:40 PM