Share News

ఫిఫా అధ్యక్షుడు గియానికి ఐరాస చీఫ్‌ పదవి!

ABN , Publish Date - Jul 22 , 2026 | 11:01 AM

ఫిఫా అధ్యక్షుడు గియాని ఇన్‌ఫాంటినో పనితీరును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ మెచ్చుకున్నారు. ఈ క్రమంలో ఆయనకు ప్రమోషన్‌ ఇచ్చే ఉద్దేశంలో ఉన్నట్లు తాజాగా కథనాలు వస్తున్నాయి.

ఫిఫా అధ్యక్షుడు గియానికి ఐరాస చీఫ్‌ పదవి!
FIFA President Gianni

స్పోర్ట్స్ డెస్క్: 39 రోజుల పాటు104 మ్యాచులతో సాగిన సాకర్ సమరం అందరినీ ఎంతో ఆకట్టుకుంది. చిన్న చిన్న గొడవలు మినహా ఫిఫా ప్రపంచం కప్ విజయవంతంగా జరిగింది. ఈ టోర్నీని అద్భుతంగా నిర్వహించడంపై ఫిఫా అధ్యక్షుడు గియాని ఇన్‌ఫాంటినోను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ (Donald Trump USA) మెచ్చుకున్నారు. ప్రపంచ దేశాలను ఏకం చేయడంలో గియాని అద్భుతంగా పనిచేసినట్లు ట్రంప్ అభినందించారు. ఈ క్రమంలో గియానికి ప్రమోషన్‌ ఇచ్చే ఉద్దేశంలో ఉన్నట్లు తాజాగా కథనాలు వస్తున్నాయి. ఈ మేరకు ట్రంప్ ప్రత్యేక ప్రతినిధి పౌలో జంపోలి కీలక వ్యాఖ్యలు చేశారు.


పౌలో జంపోలి మీడియాతో మాట్లాడుతూ..'ప్రపంచవ్యాప్తంగా గియాని (Gianni Infantino) గౌరవం సంపాదించుకున్నారు. ప్రపంచ దేశాలను, ప్రజలను ఒక్కతాటిపైకి తెచ్చే సత్తా ఆయనకుంది. 211 మంది సభ్యులు ఉండే ఫిఫా ప్రపంచ కప్‌ను అద్భుతంగా నిర్వహించారు. 193 దేశాల సమాఖ్య ఐక్యరాజ్య సమితి(యుఎన్‌వో)ని నడిపించే బాధ్యతను గియానికి అప్పగించాలనే ఆలోచన ట్రంప్‌నకు వచ్చింది. గియానికి యూఎన్‌ జనరల్ సెక్రటరీ పదవి ఇవ్వాలనేది ట్రంప్‌ అభిప్రాయము’ అని జంపోలి వెల్లడించారు.


మెక్సికో, కెనడాతో పాటు ఫుట్‌బాల్ ప్రపంచ కప్‌నకు యూఎస్‌ఏ ఆతిథ్యం ఇచ్చిన సంగతి తెలిసిందే. న్యూజెర్సీ వేదికగా జరిగిన ఫైనల్‌లో అర్జెంటీనాపై 1-0 తేడాతో స్పెయిన్ విజయం సాధించి కప్పును సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌ను గియానితోపాటు యూఎస్ అధ్యక్షుడు ట్రంప్‌ వీక్షించారు. మరోవైపు యూఎస్ జనరల్ సెక్రటరీ పదవికి పోటీ కూడా భారీగానే ఉంటుంది. ప్రస్తుత ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్‌ పదవీకాలం డిసెంబర్‌ చివరి వరకూ ఉంది. కొత్తగా పోటీపడాలనుకునేవారు 15 మందితో కూడిన యూఎన్ భద్రతామండలి మద్దతు కూడగట్టుకోవాలి.


ఇక ఐదు శాశ్వత సభ్య దేశాలైన యూఎస్‌ఏ, యూకే, ఫ్రాన్స్, రష్యా, చైనా నుంచి వీటోను తప్పించుకోవాలి. ప్రాంతాలవారీగా రొటేషన్‌ కూడా ఇక్కడ కీలక పాత్ర పోషిస్తుంది. గియాని స్విట్జర్లాండ్‌కు చెందిన ఫుట్‌బాల్ అసోసియేషన్ అడ్మినిస్ట్రేటర్. ప్రస్తుతం ఫిఫా అధ్యక్షుడిగా ఉన్న గియానికి ఏడాదికి దాదాపు 6 మిలియన్‌ డాలర్ల (భారత కరెన్సీలో దాదాపు రూ. 58 కోట్లు) ఆదాయం వస్తోంది. కానీ, యూఎన్‌వో చీఫ్‌గా వస్తే 4.18 లక్షల డాలర్లు (సుమారుగా రూ. 4 కోట్లు) మాత్రమే అందుతాయి.


ఇవి కూడా చదవండి:

క్రికెట్‌ చరిత్రలో తొలిసారి.. అరుదైన ఘనత సాధించిన ముంబై, సన్‌రైజర్స్‌!

ఫిఫా ప్రపంచకప్ 2026 రగడ: పరేడెస్‌పై చర్యలు వద్దన్న ఎరిక్

Updated Date - Jul 22 , 2026 | 11:25 AM