Share News

క్రికెట్‌ చరిత్రలో తొలిసారి.. అరుదైన ఘనత సాధించిన ముంబై, సన్‌రైజర్స్‌!

ABN , Publish Date - Jul 22 , 2026 | 10:22 AM

ఇంగ్లండ్ వేదిక‌గా హండ్రెడ్ లీగ్ ప్రారంభ‌మైంది. ఈ టోర్నీలో ముంబై ఇండియ‌న్స్, స‌న్‌రైజ‌ర్స్ ఫ్రాంచైజీలు శుభారంభం చేశాయి.

క్రికెట్‌ చరిత్రలో తొలిసారి.. అరుదైన ఘనత సాధించిన ముంబై, సన్‌రైజర్స్‌!
The Hundred 2026

స్పోర్ట్స్ డెస్క్: క్రికెట్ ప్రియులను ఎంతగానో అలరించే లీగ్స్‌లో 'ది హండ్రెడ్ లీగ్' ఒకటి. ఇంగ్లండ్ వేదికగా జరిగే ఈ లీగ్‌కు ఎంతో ఆదరణ ఉంది. మంగళవారం ప్రారంభమైన 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ ఫ్రాంచైజీలు శుభారంభం చేశాయి. ఒకేసారి ప్రారంభ‌మైన హండ్రెడ్ మెన్స్‌, హండ్రెడ్ ఉమెన్స్ టోర్నీల్లో ఈ జట్లు విజ‌యాలను అందుకున్నాయి. పురుషుల హండ్రెడ్ లీగ్‌లో స‌న్‌రైజ‌ర్స్ లీడ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్ లండ‌న్ జ‌ట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మరోవైపు మ‌హిళ‌ల విభాగంలో మెన్స్ విభాగానికి భిన్నమైన ఫలితం వచ్చింది. ముంబై ఇండియ‌న్స్ లండ‌న్‌పై స‌న్‌రైజ‌ర్స్ లీడ్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇలా ఏకకాలంలో రెండు జ‌ట్లు వేరేవేరు విభాగాల్లో ఒకదానిపై మరొకటి విజ‌యాలు న‌మోదు చేయ‌డం క్రికెట్ చ‌రిత్రలో ఇదే తొలిసారి.


పురుషుల హండ్రెడ్ లీగ్ మ్యాచ్ విష‌యానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన స‌న్‌రైజ‌ర్స్ లీడ్స్ 99 బంతుల్లో 143 ప‌రుగుల‌కు ఆలౌటైంది. ఓపెన‌ర్ మిచెల్ మార్ష్ (41 పరుగులు), టామ్ అల్సోప్ (31 పరుగులు) దూకుడుగా ఆడారు. ముంబై బౌల‌ర్లలో రిచ‌ర్డ్ గ్లెస‌న్ 4 వికెట్లు తీయ‌గా, సామ్ క‌ర‌న్ రెండు వికెట్లు సాధించాడు. అనంత‌రం 144 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియ‌న్స్ లండ‌న్ జ‌ట్టు 84 బంతుల్లోనే 3 వికెట్లు కోల్పోయి విజ‌యాన్ని అందుకుంది. కెప్టెన్ సామ్ క‌ర‌న్ (60 నాటౌట్‌), నికోల‌స్ పూర‌న్ (58 నాటౌట్‌) అర్ధ సెంచరీలతో రాణించారు.


ఇక మ‌హిళ‌ల హండ్రెడ్ టోర్నీ విష‌యానికొస్తే.. ఓవల్ వేదికగా ఎంఐ, ఎస్ఆర్ మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ ఓడిన ముంబై ఇండియ‌న్స్ లండ‌న్ జ‌ట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో నిర్ణీత 100 బంతుల్లో 8 వికెట్ల న‌ష్టానికి 107 ప‌రుగులు చేసింది. హేలీ మాథ్యూస్ (33), డానీ వ్యాట్ (29) రాణించారు. ఆల్‌రౌండ‌ర్ దీప్తి శ‌ర్మ, డానియెల్లి గిబ్సన్‌లు చెరో రెండు వికెట్లు సాధించారు. అనంత‌రం స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగి స‌న్‌రైజ‌ర్స్ 69 బంతుల్లోనే 3 వికెట్లు కోల్పోయి 109 ప‌రుగులు చేసి విజ‌యాన్ని అందుకుంది. ఫోబె లిచ్‌ఫీల్డ్ (43), అనాబెల్ స‌ద‌ర్లాండ్ (30) విజ‌యంలో కీల‌క‌పాత్ర పోషించారు. సన్‌రైజర్స్ లీడ్స్ తదుపరి మ్యాచ్ ఈ నెల 25న సదరన్ బ్రేవ్ జట్టుతో తలపడనుంది.


ఇవి కూడా చదవండి:

ఫిఫా ప్రపంచకప్ 2026 రగడ: పరేడెస్‌పై చర్యలు వద్దన్న ఎరిక్

ప్రపంచం ముందు విలన్‌గా అర్జెంటీనా! ఎందుకంటే..

Updated Date - Jul 22 , 2026 | 10:26 AM