అఫ్గానిస్థాన్ వన్డే కెప్టెన్ పదవికి హష్మతుల్లా షాహిది రాజీనామా
ABN , Publish Date - Jul 22 , 2026 | 11:54 AM
అఫ్గానిస్థాన్ వన్డే జట్టు కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ తన పదవికి రాజీనామా చేశాడు. వ్యక్తిగత కారణాల వల్ల షాహిది కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నాడు.
స్పోర్ట్స్ డెస్క్: అఫ్గానిస్థాన్ సీనియర్ బ్యాటర్ హష్మతుల్లా షాహిది వన్డే కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. అయితే ఆటగాడిగా మాత్రం జట్టులో కొనసాగనున్నాడు. వ్యక్తిగత కారణాల వల్లే అతడు కెప్టెన్ పదవికి రాజీనామా చేసినట్లు అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు(ACB) ఓ ప్రకటనలో వెల్లడించింది. 31 ఏళ్ల షాహిది 2022 ప్రారంభంలో వన్డే కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించాడు. 2023 వన్డే ప్రపంచ కప్, 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో షాహిది అఫ్గానిస్థాన్ జట్టుకు నాయకత్వం వహించాడు. అతడు అఫ్గాన్ టెస్ట్ జట్టుకు కూడా కెప్టెన్‌గా ఉన్నాడు.
ఈ ఎడమ చేతి బ్యాటర్ అత్యుత్తమ ఇన్నింగ్స్ రికార్డు భారత్‌పైనే ఉంది. 2023 ప్రపంచ కప్ సమయంలో ఇండియాపై అతడు 88 బంతుల్లో 80 పరుగులు చేశాడు. అయితే ఆ మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌పై భారత్ సునాయసంగా విజయం సాధించింది. ఇదే టోర్నీలో ఇంగ్లండ్, పాకిస్థాన్, శ్రీలంక, నెదర్లాండ్స్‌పై అఫ్గానిస్థాన్ విజయం సాధించింది. దీంతో 2023 ప్రపంచ కప్ హష్మతుల్లా షాహిది జీవితంలో చిరస్మరణీయమైన టోర్నీగా మిగిలింది. అతను ఇప్పటివరకు 96 వన్డేలలో ఒక సెంచరీతో 2,600కు పైగా పరుగులు సాధించాడు.
ఇక కెప్టెన్సీకి రాజీనామా చేయడంపై షాహిది సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. 'నా వ్యక్తిగత కారణాలతోనే కెప్టెన్ పదవికి రాజీనామా చేస్తున్నాను. ఇది పూర్తిగా నా గౌవరంతో, నా అంగీకారంతో తీసుకున్న నిర్ణయం. కెప్టెన్‌గా ఈ బాధ్యతను నిర్వర్తించడం నాకు దక్కిన గొప్ప గౌరవం. నా జట్టుతో కలిసి నిజాయితీ, ఐక్యత, నిబద్ధతతో పనిచేసినందుకు నేను గర్వపడుతున్నాను' అని షాహిది సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు.
'ప్రతి విజయంలోనూ, ప్రతి సవాలులోనూ నాకు అండగా నిలిచి, మద్దతు ఇచ్చిన సహచర ఆటగాళ్లందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నన్ను నమ్మి, ఎల్లప్పుడూ నాకు మద్దతుగా నిలిచిన జట్టు అధికారులు, మేనేజ్‌మెంట్ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మీ నమ్మకం, సహకారం ఎల్లప్పుడూ నాకు గౌరవంగా ఉంటాయి' అని షాహిది వెల్లడించాడు. ఇటీవల టెస్టు జట్టుకు రషీద్ ఖాన్‌ను కెప్టెన్‌గా నియమించిన అఫ్గానిస్థాన్ బోర్డు, ఇప్పుడు వన్డే జట్టుకు కూడా కొత్త నాయకుడిని ఎంపిక చేసే ప్రక్రియను వేగవంతం చేసింది.
ఇవి కూడా చదవండి:
ఫిఫా అధ్యక్షుడు గియానికి ఐరాస చీఫ్ పదవి!
క్రికెట్ చరిత్రలో తొలిసారి.. అరుదైన ఘనత సాధించిన ముంబై, సన్‌రైజర్స్!