Share News

జింబాబ్వే సిరీస్.. టీమిండియాలో అవకాశం కోసం ఎదురుచూస్తున్నా: అశోక్ శర్మ

ABN , Publish Date - Jul 22 , 2026 | 04:14 PM

భారత టీ20 జట్టులో చోటు దక్కడంతో తన జీవితకాల కల నెరవేరిందని యువ పేసర్ అశోక్ శర్మ వెల్లడించాడు. జులై 23 నుంచి 26 వరకు టీమిండియా.. జింబాబ్వేతో మూడు టీ20ల సిరీస్ ఆడనున్న సంగతి తెలిసిందే.

జింబాబ్వే సిరీస్.. టీమిండియాలో అవకాశం కోసం ఎదురుచూస్తున్నా: అశోక్ శర్మ
Ashok Sharma

ఇంటర్నెట్ డెస్క్: భారత టీ20 జట్టులో చోటు దక్కడంతో తన జీవితకాల కల నెరవేరిందని యువ పేసర్ అశోక్ శర్మ వెల్లడించాడు. జులై 23 నుంచి 26 వరకు టీమిండియా.. జింబాబ్వేతో మూడు టీ20ల సిరీస్ ఆడనున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌కు ఎంపికైన అన్‌క్యాప్‌డ్ ప్లేయర్లలో అశోక్ శర్మ కూడా ఉన్నాడు. హరారే వేదికగా గురువారం తొలి మ్యాచ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో.. అశోక్ శర్మ మాట్లాడాడు. భారత జెర్సీ ధరించి దేశానికి ప్రాతినిధ్యం చేయాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు.


‘భారత జెర్సీ ధరించి దేశానికి ప్రాతినిధ్యం వహించడమే నా తొలి లక్ష్యం. ఆ క్షణం కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాను. దేశవాళీ క్రికెట్‌లో ఇప్పటివరకు ఎలా కష్టపడ్డానో, అదే విధంగా నా ప్రణాళికలు, సాధనను కొనసాగిస్తాను. నా బలాలపైనే దృష్టి పెడతాను. అనవసరంగా కొత్త ప్రయోగాలు చేయను. జింబాబ్వే సిరీస్‌లో నాకు అవకాశం వస్తే దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటాను. ఎక్కువ మ్యాచ్‌లు ఆడి ఎక్కువ వికెట్లు తీయాలని ఉంది. ఆ తర్వాత వీలైనంత త్వరగా భారత టెస్టు జట్టుకు ఆడాలనేది నా తదుపరి లక్ష్యం’ అని అశోక్ శర్మ పేర్కొన్నాడు.


ఇండియా-ఎ నుంచి జాతీయ జట్టుకు..

గత జూన్‌లో శ్రీలంక పర్యటనకు వెళ్లిన ఇండియా-ఎ జట్టులో అశోక్ శర్మకు అవకాశం లభించింది. ఫీల్డింగ్ సమయంలో గాయపడిన యుధ్వీర్ సింగ్ స్థానంలో అతడిని జట్టులోకి తీసుకున్నారు. ఆ పర్యటనలో లభించిన అనుభవమే ఇప్పుడు జాతీయ జట్టులో చోటు దక్కడానికి ఉపయోగపడిందని భావిస్తున్నారు. తన బౌలింగ్‌కు అతిపెద్ద స్ఫూర్తి దక్షిణాఫ్రికా దిగ్గజ పేసర్ డేల్ స్టెయిన్ అని అశోక్ వెల్లడించాడు. స్టెయిన్ ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని మార్చగల బౌలర్ అని ప్రశంసించాడు. ‘డేల్ స్టెయిన్ బౌలింగ్ అంటే నాకు చాలా ఇష్టం. అతని దూకుడు, రన్‌అప్, బ్యాటర్లను ఉచ్చులోకి దించే విధానం అన్నీ నాకు స్ఫూర్తినిస్తాయి. ఫాస్ట్ బౌలర్‌గా నేను అతడినే ఆదర్శంగా తీసుకుంటాను’ అని అశోక్ శర్మ చెప్పుకొచ్చాడు.


ఐపీఎల్‌లోనూ నిలకడ..

ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్ తరఫున ప్రాతినిధ్యం వహించిన అశోక్ శర్మ.. పలు కీలక వికెట్లు తీసి వెలుగులోకి వచ్చాడు. సీజన్‌లో ఫాస్టెస్ట్ బాల్(154.2కిలో మీటర్ల వేగం) వేసి చరిత్ర సృష్టించాడు. కాగా గతంలో కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ తరఫున కూడా అతడు ప్రాతినిధ్యం వహించాడు.


ఇవి కూడా చదవండి:

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్: రోహిత్ శర్మ జోరు.. అగ్రస్థానానికి అడుగు దూరంలో గిల్

డ్రంకెన్ డ్రైవ్ కేసు.. డేవిడ్ వార్నర్‌ను దోషిగా తేల్చిన కోర్టు

Updated Date - Jul 22 , 2026 | 04:37 PM