సౌతాఫ్రికాపై ఓటమి.. ఈ మ్యాచ్ నిజంగా సిగ్గు చేటు: కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Feb 23 , 2026 | 03:48 PM
టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్ 8లో ఆదివారం సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 76 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఈ ఓటమిపై క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్ 8లో ఆదివారం సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 76 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో సఫారీ బౌలర్ల ధాటికి భారత బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. 188 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన టీమిండియా.. 111 పరుగులకే ఆలౌటైంది. హోం గ్రౌండ్‌లో ఇంతటి ఘోర పరాభవంపై క్రికెట్ మాజీల నుంచి అభిమానుల వరకు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కీలక పోరులో టీమిండియా తడబాటుపై ఆందోళన పడుతున్నారు. ఈ ఓటమిపై క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
‘హోం గ్రౌండ్‌లో ఇంత భారీ తేడాతో ఓడిపోవడం నిజంగా చాలా అవమానకరం. గెలుపు-ఓటములు ఆటలో భాగమే. కానీ పూర్తిగా మ్యాచ్ వన్ సైడ్ అవ్వడమేంటి? కీలక పోరులో టీమిండియా బ్యాటర్లు ఇలా చేతులెత్తేయడం పద్ధతి కాదు. సూపర్ 8 లాంటి మ్యాచ్‌లో వైస్ కెప్టెన్‌ను పక్కన పెడతారా? అక్షర్ పటేల్‌ను తప్పించడం ఏ విధంగానూ సమర్థించలేం. ఈ నిర్ణయాలు ఎవరు తీసుకుంటున్నారు? ఎలా తీసుకుంటున్నారు? అనేది అర్థం కావడం లేదు. ఈ మ్యాచ్ మనకు నిజంగా సిగ్గు చేటు. ఇలాంటి ప్రయోగాలు ఇకనైనా ఆపితే మంచిది’ అని కపిల్ దేవ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
సౌతాఫ్రికాతో ఓటమి తర్వాత టీమిండియా -3.800 నెట్ రన్‌రేట్‌తో అట్టడుగు స్థానానికి పడిపోయింది. దీంతో సెమీస్ ఆశలు సంక్లిష్టంగా మారాయి. వెస్టిండీస్, జింబాబ్వే జట్లతో జరిగే మ్యాచ్‌లో భారీ తేడాతో భారత్ కచ్చితంగా గెలిచి తీరాల్సిందే. లేదంటే.. సూపర్ 8 దశ నుంచే టీమిండియా ఇంటిముఖం పట్టాల్సి వస్తుంది.
ఇవి కూడా చదవండి:
టీ20 ప్రపంచ కప్: దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి.. సంక్లిష్టంగా మారిన భారత్ సెమీస్ ఆశలు!
టీ20 ప్రపంచ కప్: టీమిండియా ఘోర పరాజయం.. హెడ్ కోచ్ గంభీర్‌పై విమర్శలు