Share News

టీ20 ప్రపంచ కప్: టీమిండియా తడబాటు.. కోహ్లీ విలువ తెలుస్తోందా?

ABN , Publish Date - Feb 23 , 2026 | 02:54 PM

టీ20 ప్రపంచ కప్.. టీమిండియా విషయంలో సజావుగా సాగుతుందనే అనుకున్నారంతా! కానీ ఆదివారం సౌతాఫ్రికాపై 188 పరుగుల ఛేదనలో టీమిండియా 111 పరుగులకే ఆలౌటైంది. ఈ నేపథ్యంలో టీమిండియా స్టార్ బ్యాటర్ కోహ్లీ గురించి ఓ సరికొత్త చర్చ మొదలైంది.

టీ20 ప్రపంచ కప్: టీమిండియా తడబాటు.. కోహ్లీ విలువ తెలుస్తోందా?
T20 World Cup 2026

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్.. టీమిండియా విషయంలో సజావుగా సాగుతుందనే అనుకున్నారంతా! కానీ.. గ్రూప్ స్టేజీలో అమెరికాపై ఆపసోపాలు పడ్డారు. పాకిస్థాన్‌పై తడిబడినా తర్వాత పుంజుకుని గెలిచారు. నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లోనూ ఇబ్బంది తప్పలేదు. అయితేనేం ప్రతి మ్యాచ్‌లో గెలిచేశారని.. గ్రూప్ దశలో అజేయంగా నిలిచి అగ్రస్థానం సాధించారని సంబరపడిపోయాం! సూపర్ 8లో అయినా కాస్త ఆధిపత్యం ప్రదర్శించి.. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాకు న్యాయం చేస్తారని.. టైటిల్‌కు హాట్ ఫెవరెట్‌గా మారతారని ఆశపడ్డాం! కానీ ఏం జరిగింది.. బలమైన జట్టు ఎదురయ్యేసరికి టీమిండియా డొల్లతనమంతా బయటపడింది. 188 పరుగుల ఛేదనలో టీమిండియా 111 పరుగులకే ఆలౌటైంది. సౌతాఫ్రికాపై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.


ఇక్కడే ఓ సరికొత్త చర్చ మొదలైంది.. అదే విరాట్ కోహ్లీ ఛేజింగ్ గురించి! రన్ మెషీన్, ఛేజింగ్ మాస్టర్, కింగ్.. ఈ పేర్లన్నీ పిలిచేసుకుంటే వచ్చేసేవి కాదు కదా. విరాట్ ఆడిన మ్యాచ్‌లు, అతడు సృష్టించిన రికార్డులు.. వీటన్నింటికి నిదర్శనం. అయితే టీ20 ప్రపంచ కప్ చరిత్రలో.. టీమిండియా మూడు సార్లు మాత్రమే 150 పరుగులకు పైగా స్కోర్‌ను ఛేదించింది. అదీనూ.. విరాట్ కోహ్లీ పరుగుల ప్రవాహం వల్ల గట్టెక్కింది. ఆ మూడు మ్యాచ్‌ల్లోనూ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు అందుకున్నాడు కింగ్ కోహ్లీ.


ఆ మూడు మ్యాచ్‌లు ఎప్పుడంటే..?

  • టీ20 ప్రపంచ కప్ 2014: సౌతాఫ్రికాపై 44 బంతుల్లో 72* పరుగులు

  • టీ20 ప్రపంచ కప్ 2016: బలమైన ఆస్ట్రేలియాపై 51 బంతుల్లో 82* పరుగులు

  • టీ20 ప్రపంచ కప్ 2022: పాకిస్థాన్‌పై 53 బంతుల్లో 82* పరుగులు


2024 ప్రపంచ కప్ తర్వాత కోహ్లీ టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. హెడ్ కోచ్ గంభీర్ వల్లే రిటైర్‌మెంట్ ప్రకటించాడని వార్తలు వచ్చాయి. ఏదేమైనప్పటికీ తిరుగే లేని జట్టుగా భావించిన టీమిండియా.. ప్రస్తుతం సెమీస్‌కు వెళ్తుందా? అన్న సందేహం మొదలైంది. కోహ్లీ విలువ అటు అభిమానులకు ఇటు ఆటగాళ్లకు ఇలాంటి పరిస్థితుల్లోనే తెలుసొస్తుంది. జట్టులో అనుభవజ్ఞులు మాత్రమే ఉంటే సరిపోదు.. జట్టును గెలిపించాలన్న తపన ఉండే ప్లేయర్ ఉండాలి. కోహ్లీ ఉంటే కచ్చితంగా విజయం మనదే! అని అభిమానులు అనుకునే పరిస్థితి ఏర్పడిందంటేనే అర్థం చేసుకోవచ్చు.. జట్టు గెలుపులో కోహ్లీ పాత్ర ఎలాంటిది అని! కారణాలేమైనా విరాట్ ఈ ఫార్మాట్‌కు వీడ్కోలు చెప్పకుండా ఉండాల్సింది!


ఇవి కూడా చదవండి:

టీ20 ప్రపంచ కప్: దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి.. సంక్లిష్టంగా మారిన భారత్ సెమీస్ ఆశలు!

టీ20 ప్రపంచ కప్: టీమిండియా ఘోర పరాజయం.. హెడ్ కోచ్ గంభీర్‌పై విమర్శలు

Updated Date - Feb 23 , 2026 | 02:54 PM