సౌతాఫ్రికా బౌలర్లు తెలివిగా వ్యూహరచన చేశారు: సునీల్ గావస్కర్
ABN , Publish Date - Feb 23 , 2026 | 12:36 PM
టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్ 8లో భాగంగా సౌతాఫ్రికాపై టీమిండియా 76 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో అభిషేక్ శర్మ బ్యాటింగ్‌పై టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ స్పందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్ 8లో భాగంగా సౌతాఫ్రికాపై టీమిండియా 76 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైంది. ప్రస్తుతం చర్చ అంతా.. విధ్వంసకర బ్యాటర్ అభిషేర్ శర్మ ఫామ్ గురించే! బౌలర్లపై విరుచుకుపడే అభిషేక్.. ఈ టోర్నీ ఆరంభం నుంచి పరుగులు రాబట్టేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. వరుసగా మూడు డకౌట్లు.. ఆదివారం సౌతాఫ్రికాపై 15 పరుగులు చేసి మరోసారి అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేశాడు. అభిషేక్ బ్యాటింగ్‌పై టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ స్పందించాడు.
‘ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా నెట్స్‌లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మొదటి బంతికే ఔటైనా.. తర్వాత బంతినీ ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కానీ మ్యాచ్‌లో పరిస్థితి వేరు. ఒత్తిడి మిమ్మల్ని స్తంభింపచేస్తుంది. పెద్ద షాట్లు కొట్టనీయకుండా చేతులను కట్టిపడేస్తుంది. అభిషేక్ శర్మ ఒత్తిడి వల్లే స్వేచ్ఛగా ఆడలేకపోయాడు. దానికి తోడు సౌతాఫ్రికా బౌలర్లు చాలా తెలివిగా వ్యూహరచన చేశారు. రబాడ సిక్స్ ఇచ్చిన తర్వాత కూడా ఆపకుండా అభిషేక్ శర్మ ప్యాడ్లనే టార్గెట్ చేస్తూ బౌలింగ్ చేశాడు.
భారత బ్యాటర్ల షాట్ సెలక్షన్ పేలవంగా ఉంది. డేవిడ్ మిల్లర్, బ్రెవిస్‌ను చూడండి.. బ్యాట్ మీదకు బంతి రాకున్నా వారు పరిస్థితులకు తగ్గట్లు చక్కగా ఆడారు. చక్కగా పరుగులు రాబట్టారు. ఈ విషయంలో భారత బ్యాటర్లు విఫలమయ్యారు. అయితే తిలక్ వర్మ బ్యాటింగ్ నన్ను నిరాశకు గురి చేసింది. అతడు క్రీజులోకి వచ్చే సమయానికి ఓ వికెట్ పడి పోయింది.క్రీజులో కుదురుకోవడానికి కాస్త సమయం తీసుకోవాల్సి ఉండేది. ముఖ్యంగా అభిషేక్ శర్మ ఫామ్‌లో లేడు. అలాంటి సమయాల్లో బాధ్యతగా బ్యాటింగ్ చేయాలి. భాగస్వామ్యం నెలకొల్పడానికి ప్రయత్నించి ఉండాల్సింది’ అని సునీల్ గావస్కర్ విశ్లేషించాడు.
ఇవి కూడా చదవండి:
టీ20 ప్రపంచ కప్: దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి.. సంక్లిష్టంగా మారిన భారత్ సెమీస్ ఆశలు!
టీ20 ప్రపంచ కప్: టీమిండియా ఘోర పరాజయం.. హెడ్ కోచ్ గంభీర్‌పై విమర్శలు