Share News

నేలకు దించారు!

ABN , Publish Date - Feb 23 , 2026 | 05:13 AM

టీ20 వరల్డ్‌క్‌పలో అజేయంగా దూసుకెళుతున్న భారత జట్టుకు దక్షిణాఫ్రికా షాక్‌ ఇచ్చింది. ఆదివారం జరిగిన సూపర్‌-8 గ్రూప్‌ 1 మ్యాచ్‌లో చెలరేగిన సఫారీ బౌలర్లు మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చేశారు....

నేలకు దించారు!

నేటి మ్యాచ్‌

జింబాబ్వే X వెస్టిండీస్‌

(రా. 7 గం. నుంచి)

భారత్‌ జైత్రయాత్రకు బ్రేక్‌

ఒకటి కాదు.. రెండు కాదు.. ఐసీసీ ఈవెంట్లలో వరుసగా 18 మ్యాచ్‌ల్లో టీమిండియాకు ఓటమనేదే లేదు. 2023 వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్‌ పరాభవం తర్వాత అప్రతిహతంగా సాగుతున్న ఈ విజయ పరంపరకు బ్రేక్‌ పడింది. ఎట్టకేలకు దక్షిణాఫ్రికా జట్టు భారత్‌పై ప్రతీకారం తీర్చుకుంది. రెండేళ్ల క్రితం టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్లో ఆఖరి క్షణాల్లో టైటిల్‌ను దూరం చేసిన టీమిండియాకు గట్టిగానే ఝలక్‌ ఇచ్చింది. మిల్లర్‌, బ్రెవిస్‌, స్టబ్స్‌ బ్యాటింగ్‌లో చెలరేగగా.. ఆ తర్వాత బౌలర్లు విసిరిన పంజాకు భారత బ్యాటర్లు విలవిల్లాడారు. వీరిని కట్టడి చేసేందుకు పకడ్బందీ వ్యూహంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా అద్భుత విజయాన్నందుకుంది.

76 రన్స్‌తో దక్షిణాఫ్రికా ఘనవిజయం

మిల్లర్‌ హాఫ్‌ సెంచరీ

యాన్సెన్‌కు 4 వికెట్లు

అహ్మదాబాద్‌: టీ20 వరల్డ్‌క్‌పలో అజేయంగా దూసుకెళుతున్న భారత జట్టుకు దక్షిణాఫ్రికా షాక్‌ ఇచ్చింది. ఆదివారం జరిగిన సూపర్‌-8 గ్రూప్‌ 1 మ్యాచ్‌లో చెలరేగిన సఫారీ బౌలర్లు మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చేశారు. చెత్త బ్యాటింగ్‌తో నిరాశపర్చిన భారత జట్టులో శివమ్‌ దూబే (37 బంతుల్లో 1 ఫోర్‌, 3 సిక్సర్లతో 42) ఒక్కడే ఆకట్టుకున్నాడు. దీంతో ఏకంగా 76 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా ఘనవిజయాన్నందుకుంది. ముందుగా సౌతాఫ్రికా 20 ఓవర్లలో 7 వికెట్లకు 187 పరుగులు చేసింది. మిల్లర్‌ (35 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 63), బ్రెవిస్‌ (29 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 45), స్టబ్స్‌ (24 బంతుల్లో 1 ఫోర్‌, 3 సిక్సర్లతో 44 నాటౌట్‌) రాణించారు. పేసర్‌ బుమ్రాకు 3, అర్ష్‌దీ్‌పనకు 2 వికెట్లు లభించాయి. ఛేదనలో భారత్‌ 18.5 ఓవర్లలో 111 పరుగులకే కుప్పకూలింది. దూబే తర్వాత హార్దిక్‌ పాండ్యా (18), సూర్యకుమార్‌ (18)లదే అత్యధిక స్కోరు. పేసర్‌ యాన్సెన్‌కు 4, స్పిన్నర్‌ కేశవ్‌కు 3, బాష్‌కు 2 వికెట్లు దక్కాయి. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా మిల్లర్‌ నిలిచాడు.


దూబే ఒక్కడే..: ఛేదనలో భారత్‌ను సఫారీ బౌలర్లు కుదురుకోనీయలేదు. దూబే మినహా మరే బ్యాటరూ కనీసం 20 పరుగులైనా చేయకపోవడం గమనార్హం. ఈసారి ఓపెనర్‌ ఇషాన్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. తొలి ఓవర్‌లోనే ఇషాన్‌ వికెట్‌ను మార్‌క్రమ్‌ తీశాడు. ఇక రెండో ఓవర్‌లో తిలక్‌ (1)ను యాన్సెన్‌ అవుట్‌ చేయగా.. అటు అభిషేక్‌ (15) హ్యాట్రిక్‌ డకౌట్ల నుంచి తప్పించుకుని క్రీజులో నిలిచేలా కనిపించాడు. కానీ అతడిని కూడా యాన్సెన్‌ వెనక్కి పంపడంతో 26 రన్స్‌కే జట్టు 3 వికెట్లు కోల్పోయింది. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందుగా వచ్చిన వాషింగ్టన్‌ సుందర్‌ (11) సైతం నిరాశపర్చగా.. కెప్టెన్‌ సూర్య ఆదుకునే ప్రయత్నం చేసినా, తన ఇన్నింగ్స్‌లో వేగం కనిపించలేదు. పేసర్‌ బాష్‌ వరుస ఓవర్లలో ఈ ఇద్దరినీ అవుట్‌ చేశాడు. అయితే క్రీజులో దూబే-హార్దిక్‌ ఉండడంతో భారత్‌ విజయంపై ఆశలు వదులుకోలేదు. కానీ కట్టుదిట్టమైన బౌలింగ్‌ కారణంగా వీరికీ పరుగులు రాబట్టడం కష్టమైంది. ఇక ఆరు ఓవర్లలో 102 పరుగులు కావాల్సిన వేళ భారత్‌కు ఓటమి తప్పదనిపించింది. పైగా స్పిన్నర్‌ కేశవ్‌ 15వ ఓవర్‌లో హార్దిక్‌, రింకూ (0), అర్ష్‌దీప్‌ (1)ల వికెట్లు తీయడంతో జట్టు కోలుకోలేకపోయింది. చివర్లో దూబే మెరుపులు ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించగలిగాయి. 19వ ఓవర్‌లో యాన్సెన్‌ 2 వికెట్లు తీయడంతో భారత్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది.

11-Sports.jpg

ఆదుకున్న మిల్లర్‌-బ్రెవిస్‌: 4, 6, 7.. భారత పేసర్ల జోరుకు దక్షిణాఫ్రికా టాప్‌-3 బ్యాటర్ల స్కోర్లివి. టాస్‌ గెలిచిన వెంటనే బ్యాటింగ్‌ ఎంచుకుని కెప్టెన్‌ మార్‌క్రమ్‌ తప్పు చేశాడా? అనిపించేలా వీరి ఆట సాగింది. తొలి ఓవర్‌లోనే స్వింగ్‌ రాబట్టిన అర్ష్‌దీ్‌పతో పాటు బుమ్రా లెంగ్త్‌ బంతులతో సఫారీలను కట్టడి చేశారు. అయితే మిడిలార్డర్‌లో మిల్లర్‌, బ్రెవిస్‌, స్టబ్స్‌ మాత్రం భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొని సవాల్‌ విసిరే స్కోరందించారు. ఆరంభంలో పిచ్‌ను అర్థం చేసుకోకుండా భారీ షాట్లకు వెళ్లిన డికాక్‌ (6), మార్‌క్రమ్‌ (4), రికెల్టన్‌ (7) తొలి నాలుగు ఓవర్లలోనే పెవిలియన్‌ చేరారు. బుమ్రా ఒకే ఓవర్‌లో రెండు వికెట్లతో ఝలకిచ్చాడు. పరిస్థితి ఇబ్బందికరంగా మారిన వేళ మిల్లర్‌-బ్రెవిస్‌ జోడీ కాస్త ఊరటనిచ్చింది. చక్కటి టచ్‌లో ఉన్నట్టు కనిపించిన మిల్లర్‌ ఐదు, ఆరో ఓవర్లలో రెండేసి ఫోర్లు బాదగా పవర్‌ప్లేలో జట్టు స్కోరు 41/3కి చేరింది. ఇక వరుణ్‌ను లక్ష్యంగా చేసుకుంటూ మిల్లర్‌ 6, బ్రెవిస్‌ 4, 6తో తొమ్మిదో ఓవర్‌లో 17 రన్స్‌ రాబట్టారు.


దూబే ఓవర్‌లో బ్రెవిస్‌ 4,6తో 15 రన్స్‌తో స్కోరును వేగాన్ని మరింతగా పెంచాడు. అయితే చివరికి బ్రెవి్‌సను దూబేనే అవుట్‌ చేయడంతో నాలుగో వికెట్‌కు 97 పరుగుల కీలక భాగస్వామ్యం ముగిసింది. అటు మిల్లర్‌ మాత్రం ఓ సిక్సర్‌తో 26 బంతుల్లోనే ఫిఫ్టీని పూర్తి చేశాడు. డెత్‌ ఓవర్లలో సఫారీలు ఒక్కసారిగా తడబడ్డారు. 14-19 ఓవర్ల మధ్య 39 పరుగులే సాధించారు. 16వ ఓవర్‌లో మిల్లర్‌ను స్పిన్నర్‌ వరుణ్‌ అవుట్‌ చేయంతో అతడి తుఫాన్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. ఆ తర్వాత పేసర్లు అర్ష్‌దీప్‌, బుమ్రా టపటపా వికెట్లు తీశారు. కానీ ఆఖరి ఓవర్‌లో స్టబ్స్‌ ఓ ఫోర్‌, రెండు భారీ సిక్సర్లతో 20 రన్స్‌ రాబట్టడంతో సఫారీల స్కోరు 180 దాటింది.

12-Sports.jpg

మ్యాచ్‌కు ముందు మైదానంలో

వరల్డ్‌ కప్‌ ట్రోఫీతో సునీల్‌ గవాస్కర్‌,

గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌.

స్కోరుబోర్డు

దక్షిణాఫ్రికా: మార్‌క్రమ్‌ (సి) హార్దిక్‌ (బి) అర్ష్‌దీప్‌ 4, డికాక్‌ (బి) బుమ్రా 6, రికెల్టన్‌ (సి) దూబే (బి) బుమ్రా 7, బ్రెవిస్‌ (సి) అభిషేక్‌ (బి) దూబే 45, మిల్లర్‌ (సి) తిలక్‌ (బి) వరుణ్‌ 63, స్టబ్స్‌ (నాటౌట్‌) 44, యాన్సెన్‌ (సి) రింకూ (బి) అర్ష్‌దీప్‌ 2, బాష్‌ (సి అండ్‌ బి) బుమ్రా 5, రబాడ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు: 11; మొత్తం: 20 ఓవర్లలో 187/7. వికెట్ల పతనం: 1-10, 2-12, 3-20, 4-117, 5-152, 6-158, 7-167; బౌలింగ్‌: అర్ష్‌దీప్‌ 4-0-28-2, బుమ్రా 4-0-15-3, వరుణ్‌ 4-0-47-1, సుందర్‌ 2-0-17-0, హార్దిక్‌ 4-0-45-0, దూబే 2-0-32-1.

భారత్‌: ఇషాన్‌ (సి) రికెల్టన్‌ (బి) మార్‌క్రమ్‌ 0, అభిషేక్‌ (సి) బాష్‌ (బి) యాన్సెన్‌ 15, తిలక్‌ (సి) డికాక్‌ (బి) యాన్సెన్‌ 1, సూర్యకుమార్‌ (సి) బ్రెవిస్‌ (బి) బాష్‌ 18, సుందర్‌ (సి) డికాక్‌ (బి) బాష్‌ 11, దూబే (సి) ఎన్‌గిడి (బి) యాన్సెన్‌ 42, హార్దిక్‌ (సి) స్టబ్స్‌ (బి) కేశవ్‌ 18, రింకూ (సి) స్టబ్స్‌ (బి) కేశవ్‌ 0, అర్ష్‌దీప్‌ (సి) స్టబ్స్‌ (బి) కేశవ్‌ 1, వరుణ్‌ (నాటౌట్‌) 0, బుమ్రా (సి) మార్‌క్రమ్‌ (బి) యాన్సెన్‌ 0; ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: 18.5 ఓవర్లలో 111 ఆలౌట్‌. వికెట్ల పతనం: 1-0, 2-5, 3-26, 4-43, 5-51, 6-86, 7-86, 8-88, 9-111, 10-111; బౌలింగ్‌: మార్‌క్రమ్‌ 1-0-5-1, యాన్సెన్‌ 3.5-0-22-4, రబాడ 4-0-32-0, ఎన్‌గిడి 4-0-15-0, కేశవ్‌ 3-0-24-3, బాష్‌ 3-0-12-2.


పాయింట్ల పట్టిక

గ్రూప్‌-1

జట్టు మ్యా గె ఓ ర పా ర.రే

దక్షిణాఫ్రికా 1 1 0 0 2 3.800

భారత్‌ 1 0 1 0 0 -3.800

వెస్టిండీస్‌ 0 0 0 0 0 0.000

జింబాబ్వే 0 0 0 0 0 0.000

గ్రూప్‌-2

జట్టు మ్యా గె ఓ ర పా ర.రే

ఇంగ్లండ్‌ 1 1 0 0 2 2.550

న్యూజిలాండ్‌ 1 0 0 1 1 0.000

పాకిస్థాన్‌ 1 0 0 1 1 0.000

శ్రీలంక 1 0 1 0 0 -2.550

మ్యా: మ్యాచ్‌లు; గె: గెలుపు; ఓ: ఓటమి;

ర: రద్దు; పా: పాయింట్లు; ర.రే: రన్‌రేట్‌

1

  • టీ20 వరల్డ్‌క్‌పలో అత్యధిక వికెట్లు (33) తీసిన భారత బౌలర్‌గా నిలిచిన బుమ్రా. అశ్విన్‌ (32)ను అధిగమించాడు.

  • టీ20ల్లో వరుసగా అత్యధిక ఇన్నింగ్స్‌లో (18) కనీసం ఓ వికెట్‌ అయినా తీసిన భారత బౌలర్‌గా వరుణ్‌. అర్ష్‌దీప్‌ (17)ను అధిగమించాడు.

  • అంతర్జాతీయ టీ20ల్లో ఒకే ఓవర్‌లో మూడు క్యాచ్‌లు అందుకున్న ఏకైక ఫీల్డర్‌గా స్టబ్స్‌.

ఇవి కూడా చదవండి:

సూపర్ 8: శ్రీలంకతో మ్యాచ్‌కు ముందే ఇంగ్లండ్‌కు గట్టి ఎదురు దెబ్బ

సౌతాఫ్రికాతో మ్యాచ్‌కు ముందు సూర్యకుమార్‌కు గుడ్‍న్యూస్

Updated Date - Feb 23 , 2026 | 05:14 AM