సూపర్ 8: శ్రీలంకతో మ్యాచ్‌కు ముందే ఇంగ్లండ్‌కు గట్టి ఎదురు దెబ్బ
ABN , Publish Date - Feb 22 , 2026 | 10:39 AM
టీ20 ప్రపంచకప్ 2026లో సూపర్-8లో భాగంగా ఇవాళ శ్రీలంక, ఇంగ్లండ్ జట్లు తలపడనున్నాయి. కీలక పోరుకు ముందే ఇంగ్లండ్ జట్టుకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది.
స్పోర్ట్స్ డెస్క్: టీ20 ప్రపంచ కప్(T20 World Cup-2026)లో భాగంగా నిన్నటి నుంచి సూపర్-8 ప్రారంభమైంది. అయితే తొలి రోజు పాకిస్థాన్-న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షార్పణం అయింది. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. సూపర్-8లో జరిగే ప్రతి మ్యాచ్ ఎంతో కీలకమైనది. మ్యాచ్ రద్దు అనేది సెమీస్ అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కాగా.. సూపర్-8లో ఇవాళ(ఆదివారం) మరో రెండు ఆసక్తికర సమరాలు జరగనున్నాయి.
ఆదివారం మధ్యాహ్నం 3:00 గంటలకు పల్లెకెలె వేదికగా శ్రీలంక, ఇంగ్లండ్(Srilanka Vs England)తలపడనున్నాయి. అలానే రాత్రి 7:00 గంటలకు అహ్మదాబాద్ వేదికగా భారత్, సౌతాఫ్రికా మ్యాచ్ జరగనుంది. అయితే శ్రీలంకతో జరగనున్న ఈ కీలక మ్యాచ్‌కు ముందు ఇంగ్లండ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ జాకబ్ బేతెల్‌కు గాయమైంది. గ్రూప్ స్టేజీలో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా ఫీల్డింగ్ చేస్తూ జాకబ్ గాయపడ్డాడు. అతని ఎడమచేతి వేళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ప్రస్తుతం అతను వేళ్లకు బ్యాండెడ్ ప్లాస్టర్ వేసుకున్నాడు. ఈ పరిస్థితుల్లో అతను శ్రీలంక మ్యాచ్‌లో బౌలింగ్‌కు అందుబాటులో ఉండకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఐసీసీ నిబంధనల ప్రకారం.. బౌలర్ చేతికి ఏదైనా రక్షణ కవచం వేసుకుని మైదానంలోకి దిగాలంటే అంపైర్ల ఆమోదం పొందాల్సి ఉంటుంది. కాగా బేతెల్‌కు అనుమతి లభిస్తుందా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
జాకబ్ గాయంపై ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్(Harry Brook) స్పందించాడు. 'బేతెల్ చేతికి తగిలిన గాయం తీవ్రమైనది. అతడి చేతికి పట్టీ వేయాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంటుంది. మేము అతడిని బౌలింగ్ చేయించాలి అనుకుంటున్నాం. కానీ ప్రస్తుతానికి, అది సాధ్యం కాదనిపిస్తోంది. ప్రత్యమ్నాయం చూస్తున్నాం' అని తెలిపాడు. ఇవాళ పల్లెకెలెలో జరిగే పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడే జాకబ్.. గతంలో శ్రీలంకపై 4/11తో అద్భుత బౌలింగ్ ప్రదర్శన చేశాడు. ఇప్పుడు అదే జట్టుతో మళ్లీ తలపడనున్న నేపథ్యంలో బేతెల్ బౌలింగ్ సేవలు అందుబాటులో లేకపోతే ఇంగ్లండ్ స్పిన్ విభాగం బలహీనపడే అవకాశముంది. మొత్తంగా ఇవాళ శ్రీలంకతో జరిగే మ్యాచ్‌కు ముందు అంపైర్లు ఏ నిర్ణయం తీసుకుంటారోనని ఇంగ్లండ్ మేనేజ్మెంట్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
ఇవీ చదవండి:
'ప్రతి ఒక్కరూ కనీసం ఒక్కసారైనా భారత్‌ను సందర్శించాల్సిందే'
ట్రంప్ సంచలన నిర్ణయం.. ప్రపంచం ముందుకు ఏలియన్స్ సీక్రెట్ ఫైల్స్