Share News

టీ20 ప్రపంచ కప్: ఆస్ట్రేలియా కథ ముగిసినట్లేనా?

ABN , Publish Date - Feb 17 , 2026 | 04:22 PM

టీ20 ప్రపంచ కప్ 2026లో ఆస్ట్రేలియా జట్టు తీవ్రంగా విఫలమైంది. ఐదు సార్లు కప్‌ను ముద్దాడిన ఆసీస్.. ఈసారి గ్రూప్ స్టేజిలోనే నిష్క్రమించే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడి కేవలం ఒకదాంట్లోనే విజయం సాధించింది.

టీ20 ప్రపంచ కప్: ఆస్ట్రేలియా కథ ముగిసినట్లేనా?
T20 World Cup 2026

ఇంటర్నెట్ డెస్క్: ఐదు సార్లు టీ20 ప్రపంచ కప్ విజేత.. క్రికెట్‌లోనే బలమైన జట్టుగా గుర్తింపు.. టోర్నీ ఏదైనా, ఫార్మాట్ ఏదైనా.. ఆ జట్టుతో పోరు అంటే కాస్త జాగ్రత్తగా ఆడాలన్నట్లు ఉండే ప్రత్యర్థులు.. నిలబడి సెంచరీలు బాదే బ్యాటర్లు.. బంతితో ప్రత్యర్థి బ్యాటర్లను బెంబేలెత్తించే బౌలర్లు.. ఇప్పటికే అర్థమై ఉంటుందిగా.. అదే ఆస్ట్రేలియా జట్టు. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచ కప్‌లో మాత్రం తీవ్రంగా విఫలమై.. గ్రూప్ స్టేజిలోనే నిష్క్రమించాల్సిన పరిస్థితి ఏర్పడింది.


జింబాబ్వే-ఐర్లాండ్ మ్యాచ్ రద్దైతే..?

టోర్నీలో భాగంగా ఇప్పటికే మూడు మ్యాచ్‌లు ఆడేసింది ఆస్ట్రేలియా. ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 67 పరుగులతో విజయం సాధించింది. దాని తర్వాత పసికూన జింబాబ్వే చేతిలో చిత్తు.. సోమవారం శ్రీలంకపై ఘోర పరాజయాన్ని చవి చూసింది. టైటిల్ ఫేవరెట్లలో ఒకటైన ఆసీస్.. ఇప్పుడు కనీసం సూపర్ 8లో అడుగు పెట్టడమూ కష్టంగా మారింది. తన చివరి పోరులో ఒమన్‌తో ఫిబ్రవరి 20న తలపడనుంది. అందులో గెలిచినా.. సూపర్ 8కి అర్హత సాధిస్తుందనే నమ్మకం లేదు. మరోవైపు జింబాబ్వే ఇప్పటికే రెండు విజయాలు సాధించి రేసులో ముందుంది. ఆఖరి రెండు మ్యాచుల్లో ఒక్క విజయం నమోదు చేసినా జింబాబ్వే తదుపరి దశకు చేరుకుంటుంది. అయితే జింబాబ్వే.. ఐర్లాండ్‌తో నేడు తలపడాల్సి ఉండగా వర్షం కారణంగా ఆట ఆలస్యమైంది. ఒకవేళ మ్యాచ్ రద్దు అయితే ఇరు జట్లకు చెరొక పాయింట్ లభిస్తుంది. దీని బట్టి చూస్తే జింబాబ్వే సూపర్ 8కి చేరడం ఖాయం. దీంతో ఆసీస్ టోర్నీ నుంచి నిష్ర్కమించాల్సిందే.


ఇప్పటికే భారత్, శ్రీలంక, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, వెస్టిండీస్, న్యూజిలాండ్ జట్లు సూపర్ 8కి చేరుకున్నాయి. గ్రూప్ ఏలో యూఎస్ఏ, పాకిస్థాన్ జట్లు రెండో స్థానం కోసం పోటీ పడుతున్నాయి. బుధవారం నమీబియాపై గెలిస్తే పాక్ అర్హత సాధిస్తుంది. లేదా యూఎస్ఏ సూపర్ 8కి చేరుకుంటుంది. తాజా పరిణామంతో జింబాబ్వే సూపర్ 8కి క్వాలిఫై అవ్వడం ఖాయం అనిపిస్తోంది. ఒకవేళ ఆస్ట్రేలియా రెండో స్థానాన్ని దక్కించుకోవాలంటే.. ఐర్లాండ్, శ్రీలంకతో జరిగే మ్యాచుల్లో జింబాబ్వే ఓడిపోవాలి. ఒమన్‌పై ఆసీస్ మంచి నెట్ రన్ రేట్‌తో గెలవాలి. ఇవన్నీ సాధ్యం కాదు కాబట్టి.. ఆసీస్ ఈ టీ20 ప్రపంచ కప్ టోర్నీ నుంచి గ్రూప్ స్టేజిలోనే నిష్క్రమించనుందని విశ్లేషకుల అభిప్రాయం.


ఇవి కూడా చదవండి:

నేను నఖ్వీని అలా అనలేదు: షోయబ్‌ అక్తర్‌

రషీద్ ఖాన్ సరికొత్త చరిత్ర.. ప్రపంచంలో తొలి బౌలర్‌గా రికార్డ్

Updated Date - Feb 17 , 2026 | 04:28 PM