Share News

రూ.కోట్లు కుమ్మరించి డమ్మీ ప్లేయర్లను కొంటున్నారు: సునీల్ గావస్కర్

ABN , Publish Date - Jun 02 , 2026 | 10:59 AM

ఐపీఎల్‌లో కొన్ని ఫ్రాంచైజీలు రూ.కోట్లు కుమ్మరించి డమ్మీ ప్లేయర్లను కొనుగోలు చేస్తున్నాయనంటూ గావస్కర్ విమర్శించాడు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి.

రూ.కోట్లు కుమ్మరించి డమ్మీ ప్లేయర్లను కొంటున్నారు: సునీల్ గావస్కర్
Sunil Gavaskar

ఇంటర్నెట్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 ముగిసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు వరుసగా రెండోసారి ట్రోఫీని ముద్దాడింది. అయితే వేలంలో అత్యధిక ధర పలికిన ప్లేయర్లు మైదానంలో అంతగా ఆకట్టుకోలేదు. ఈ విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. ఐపీఎల్‌లో కొన్ని ఫ్రాంచైజీలు రూ.కోట్లు కుమ్మరించి డమ్మీ ప్లేయర్లను కొనుగోలు చేస్తున్నాయనంటూ గావస్కర్ విమర్శించాడు.


‘భారత క్రికెట్‌కు ఐపీఎల్ ఎంతోమంది ప్రతిభావంతులను అందించింది. రవిచంద్రన్ అశ్విన్, బుమ్రా, రింకు సింగ్ వంటి ప్లేయర్లు ఐపీఎల్ ద్వారానే వెలుగులోకి వచ్చారు. ఇదే సమయంలో పలువురు ఆటగాళ్లు మాత్రం వేలంలో భారీ ధర పలికి.. మైదానంలో అంచనాలను అందుకోలేకపోతున్నారు. రాష్ట్ర, నగర స్థాయి లీగ్‌ల్లో భారీ షాట్లు ఆడి ఐపీఎల్‌లోకి వచ్చే ప్లేయర్లు.. ఇక్కడ అంతర్జాతీయ స్థాయిలో బౌలింగ్‌ను ఎదుర్కోలేకపోతున్నారు. ఆ లీగ్‌ల్లో బ్యాటింగ్, బౌలింగ్ ప్రమాణాలు ఐపీఎల్‌కు దగ్గరగా కూడా ఉండవు. అలాంటి ప్లేయర్ల కోసం ఫ్రాంచైజీలు డబ్బును వృథా చేసుకుంటున్నాయి’ అని గావస్కర్ వివరించాడు.


ఐపీఎల్ స్పెషాలిటీ అదే..

‘ఒక ఫ్రాంచైజీ కోట్ల రూపాయలు పెట్టి ఆటగాడిని కొనుగోలు చేసి.. అతడిని కేవలం రెండు మ్యాచ్‌లకే పరిమితం చేయడంలో అర్థం లేదు. అలా చేస్తే ఆ ప్లేయర్ డమ్మీ అన్నట్లే. ఐపీఎల్ చాలా త్వరగా ఓ ఆటగాడి అసలు సామర్థ్యాన్ని బయటపెడుతుంది. అది ఐపీఎల్ స్పెషాలిటీ. ప్లేయర్‌పై అతిగా అంచనాలు పెట్టుకున్నారా? నిజంగానే భారీ ఇన్నింగ్స్ ఆడే సామర్థ్యం ఉందా? అనేది వెంటనే తెలిసిపోతుంది. ఒక సీజన్‌లో పెద్దగా ప్రాధాన్యం లేని మ్యాచ్‌లో ఒక్కసారి రాణించినా.. అదే ప్రదర్శన ఆధారంగా వచ్చే ఏడాది మళ్లీ జట్టులో చోటు దక్కించుకునే ఆటగాళ్లు చాలామంది ఉన్నారు. అలాంటి ‘వన్-మ్యాచ్ హీరో’లతో కనీసం నాలుగు జట్లు ఏర్పాటు చేయొచ్చు. అయినప్పటికీ వారు మళ్లీ మళ్లీ ఐపీఎల్‌లో అవకాశాలు పొందుతూనే ఉంటారు’ అని గావస్కర్ వెల్లడించాడు. గావస్కర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఐపీఎల్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అతడు ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశాడనే దానిపై అభిమానులు, విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.


ఇవి కూడా చదవండి:

కోల్‌కతాలో మెస్సి విగ్రహం తొలగింపు.. ఎందుకంటే?

ఆర్సీబీ హిట్టర్ టిమ్ డేవిడ్‌పై సస్పెన్షన్ వేటు

Updated Date - Jun 02 , 2026 | 10:59 AM