టీ20 ఆడాల్సిన పద్ధతి ఇది కాదు: సునీల్ గావస్కర్ ఫైర్
ABN , Publish Date - Feb 24 , 2026 | 05:45 PM
టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్ 8 తొలి మ్యాచ్‌లోనే సౌతాఫ్రికాపై టీమిండియా 76 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో టీమిండియా పరాజయానికి గల కారణాలను మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ విశ్లేషించాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్ 8 తొలి మ్యాచ్‌లోనే సౌతాఫ్రికాపై టీమిండియా 76 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. లీగ్ స్టేజ్‌ను అజేయంగా ముగించిన భారత జట్టు.. కీలక పోరులో బోల్తా పడింది. ఈ నేపథ్యంలో టీమిండియా పరాజయానికి గల కారణాలను మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ విశ్లేషించాడు. భారత్ అతి ఆత్మవిశ్వాసమే ఓటమికి కారణమని వెల్లడించాడు.
‘భారత బ్యాటర్లు అతి ఆత్మవిశ్వాసంతో ఆడారు. అలా చేయకుండా ఉండాల్సింది. వచ్చీ రాగానే భారీ షాట్లు ఆడేందుకు ప్రయత్నించి, తేలిగ్గా వికెట్లు సమర్పించుకున్నారు. దక్షిణాఫ్రికా బ్యాటర్లు తెలివిగా వ్యవహరించారు. అందుకే విజయం సాధించారు. త్వరత్వరగా వికెట్లు కోల్పోయినా సఫారీల బ్యాటర్లు బాగా రాణించారు. కనీసం వారిని చూసైనా టీమిండియా నేర్చుకోలేదు. మన బ్యాటర్లు ప్రతి బంతిని బౌండరీకి బాదాలని చూసి వికెట్లు కోల్పోయారు. టీ20 ఆడాల్సిన పద్ధతి ఇది కాదు. మనం ప్రత్యర్థుల నుంచి పాఠాలు నేర్చుకోవాలి. పవర్ ప్లేలో ప్రతిసారీ 70 పరుగులు చేయాలని చూడొద్దు. 50 నుంచి 60 రన్స్ సాధించినా సరిపోతుంది’ అని సునీల్ గావస్కర్ అన్నాడు.
ఆ మార్పు చేయాల్సిందే..
గురువారం చెన్నై వేదికగా భారత్-జింబాబ్వే మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో గావస్కర్ పలు సూచనలు చేశాడు. ‘జింబాబ్వే బ్యాటింగ్ లైనప్‌లో చాలా మంది లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్లున్నారు. అందుకే అక్షర్ పటేల్‌ను తీసుకోవాలి. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో వాషింగ్టన్ సుందర్‌ను సరిగా ఉపయోగించుకోలేదు. అతడితో కేవలం రెండు ఓవర్లు మాత్రమే బౌలింగ్ వేయించారు. అయితే నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సుందర్ నాలుగు ఓవర్లు వేసినప్పటికీ వికెట్లు తీసుకోలేదు. వాషింగ్టన్‌ను తప్పించి, అతడి స్థానంలో అక్షర్‌ను కచ్చితంగా ఆడించాలి’ అని సన్నీ సూచించాడు.
ఇవి కూడా చదవండి:
రూ.7.18కోట్ల విలువైన ఫ్లాట్ కొనుగోలు చేసిన సూర్య కుమార్ యాదవ్ భార్య
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. మళ్లీ ఇండియా, పాక్ మ్యాచ్