Share News

ఐపీఎల్‌ మ్యాచ్‌ల నిర్వహణలో మార్పులు అవసరం.. బీసీసీఐకి సునీల్ గావస్కర్ లేఖ

ABN , Publish Date - Apr 27 , 2026 | 05:23 PM

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఏకంగా నాలుగు గంటల 22 నిమిషాలు సాగింది. ఇదే అంశంపై టీమిండియా దిగ్గజం సునీల్ గావస్కర్ బీసీసీఐకి లేఖ రాశాడు. ఐపీఎల్‌ నిర్వహణలో పలు కీలక మార్పులు అవసరమంటూ లేఖలో పేర్కొన్నాడు.

ఐపీఎల్‌ మ్యాచ్‌ల నిర్వహణలో మార్పులు అవసరం.. బీసీసీఐకి సునీల్ గావస్కర్ లేఖ
Sunil Gavaskar

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 సీజన్ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. ఇప్పటికే సగానికి పైగా మ్యాచ్‌లు ముగిశాయి. అయితే ఐపీఎల్ మ్యాచ్‌ల వ్యవధిపై ఇప్పటికే సోషల్ మీడియాలో విమర్శలు వస్తోన్న సంగతి తెలిసిందే. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఏకంగా నాలుగు గంటల 22 నిమిషాలు సాగింది. ఇదే అంశంపై టీమిండియా దిగ్గజం సునీల్ గావస్కర్ బీసీసీఐకి లేఖ రాశాడు. ఐపీఎల్‌ మ్యాచ్‌ల నిర్వహణలో పలు కీలక మార్పులు అవసరమంటూ లేఖలో పేర్కొన్నాడు. ఒక్క మ్యాచ్‌ నాలుగు గంటలకు పైగా సాగడంపై సన్నీ అసహనం వ్యక్తం చేశాడు.


‘ఐపీఎల్ నిర్వహణలో పలు కీలక మార్పులు కచ్చితంగా అవసరం. మైదానంలోకి అవసరానికి మించి సపోర్ట్ స్టాఫ్, రిజర్వ్ ప్లేయర్లు రావడం వల్ల ఆట ఆలస్యం అవుతోంది. డ్రింక్స్ ఇచ్చే పేరుతో అనవసరంగా ఎక్కువ మంది ప్లేయర్లు మైదానంలోకి వస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఇద్దరు రిజర్వ్ ప్లేయర్లు, మరో ఇద్దరు కోచింగ్ స్టాఫ్‌ను మాత్రమే మైదానంలోకి అనుమతించాలి. గ్రౌండ్ కేవలం ఆడే వాళ్లకు మాత్రమే పరిమితం కావాలి. ఇక వికెట్ల మధ్య గ్యాప్ కూడా తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలి. ప్రస్తుతం బ్యాటర్లు డగౌట్‌లోనే ఉంటున్నారు. కొత్త బ్యాటర్ క్రీజులోకి వచ్చి సెట్ అయ్యేందుకు రెండు నిమిషాల సమయాన్ని ఇస్తున్నారు. దాన్ని ఒక నిమిషానికి కుదించాలి. ఆలస్యం చేస్తే పెనాల్టీ రన్స్ ఇవ్వాలి. ఒక్క మ్యాచ్ నాలుగు గంటలకి పైగా సమయం తీసుకోవడం వల్ల అభిమానుల్లో ఆసక్తి తగ్గే ప్రమాదం ఉంది’ అని బీసీసీఐకి రాసిన లేఖలో గావస్కర్ పేర్కొన్నాడు.


ఇవి కూడా చదవండి:

అతడిని ల్యాబ్‌కు తీసుకెళ్లి పరీక్షించాలి.. వైభవ్‌పై పాక్ క్రికెట్ అనలిస్ట్ ప్రశంసలు

మూడేళ్ల నాటి సెహ్వాగ్‌ సవాల్‌.. బ్యాట్‌తోనే సమాధానం ఇచ్చిన రింకు సింగ్!

Updated Date - Apr 27 , 2026 | 05:23 PM