ఐపీఎల్ అభివృద్ధిని చూస్తే ఆశ్చర్యమేస్తోంది: సౌరభ్ గంగూలీ
ABN , Publish Date - Mar 25 , 2026 | 09:43 AM
ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ జట్లు భారీ ధరకు అమ్ముడైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా క్రికెట్ దిగ్గజం సౌరభ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్‌లో రెండు ఫ్రాంచైజీల యజమానులు మారిన సంగతి తెలిసిందే. లీగ్‌లో అత్యంత ఆకర్షణీయ జట్లలో ఒకటైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో పాటు రాజస్థాన్ రాయల్స్ జట్లు భారీ ధరకు అమ్ముడయ్యాయి. ఈ నేపథ్యంలో టీమిండియా క్రికెట్ దిగ్గజం సౌరభ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2008లో ప్రారంభమైన ఐపీఎల్.. అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లీగ్‌గా పేరు పొందిన ఎన్‌బీఏకి సమానంగా నిలిచిందని వ్యాఖ్యానించారు.
‘2008లో తొలిసారి నేను ఐపీఎల్ మ్యాచ్ ఆడేటప్పుడు రానున్న కాలంలో ఈ లీగ్ అత్యంత ఖరీదైనదిగా మారుతుందని చెప్పాను. ఇప్పుడు అదే నిజమైంది. 18 సీజన్‌లు ముగించుకుని 19న సీజన్‌కు విజయవంతంగా అడుగుపెట్టిన ఐపీఎల్.. ఈ స్థాయికి చేరుకోవడం గొప్ప విషయం. ఐపీఎల్ ఇప్పుడు ఎన్‌బీఏ స్థాయిలో ఉంది. ఇది ఈ లీగ్‌కు దక్కిన గౌరవం. ఐపీఎల్ ప్రసార హక్కులు ఇప్పుడు ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్(ఈపీఎల్)ను దాటేశాయి. కేవలం మూడు నెలలు జరిగే ఈ టోర్నీ.. ఇంత భారీ స్థాయికి చేరుకోవడాన్ని చూస్తే ఆశ్చర్యమేస్తోంది. అమెరికా వంటి దేశాల నుంచి పెట్టుబడులు రావడం భారత క్రికెట్‌కు ఉన్న గ్లోబల్ డిమాండ్‌ను చూపుతుంది’ అని గంగూలీ పేర్కొన్నాడు.
లీగ్‌లో అత్యంత ఆకర్షణీయ జట్లలో ఒకటైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో పాటు రాజస్థాన్ రాయల్స్ జట్లు వేరే యాజమాన్యాల ఆధీనంలోకి వెళ్లబోతున్నాయి. లీగ్ ఆరంభం నుంచి ఆర్సీబీని నడిపిస్తోన్న యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్(యుఎస్ఎల్) సంస్థ.. ఏకంగా రూ.16,706 కోట్ల ధరకు ఆర్సీబీని అమ్మేసింది. ఆదిత్య బిర్లా గ్రూప్, టైమ్స్ ఆఫ్ ఇండియా, బోల్ట్ వెంచర్స్, బీఎక్స్‌పీఈ-బ్లాక్‌స్టోన్ సంస్థలు కలిసి ఈ ఫ్రాంచైజీని దక్కించుకున్నాయి. మరోవైపు అమెరికాకు చెందిన ప్రముఖ టెక్ వ్యాపారవేత్త కల్ సోమని నేతృత్వంలోని కన్సార్షియం సుమారు రూ.15,300 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీని కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
ఆర్సీబీ కొత్త ఛైర్మన్‌గా ఐపీఎల్ మాజీ ప్లేయర్.. అసలెవరీ ఆర్యమాన్ బిర్లా?
ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి.. కోల్‌కతా నైట్ రైడర్స్ సంచలన నిర్ణయం