నా జీవితంలోనే అత్యుత్తమ పుట్టినరోజు కానుక ఇది: సౌరభ్ గంగూలీ
ABN , Publish Date - Jul 08 , 2026 | 12:51 PM
భారత మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ 54వ పుట్టినరోజు నేడు. ఆయన జీవిత కథ ఆధారంగా తెరుక్కుతున్న చిత్రం ‘దాదా: ది సౌరభ్ గంగూలీ స్టోరీ’. గంగూలీ పుట్టినరోజు సందర్భంగా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పోస్టర్‌పై గంగూలీ స్పందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: భారత మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ 54వ పుట్టినరోజు నేడు. ఆయన జీవిత కథ ఆధారంగా తెరుక్కుతున్న చిత్రం ‘దాదా: ది సౌరభ్ గంగూలీ స్టోరీ’. గంగూలీ పుట్టినరోజు సందర్భంగా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానం బాల్కనీలో చొక్క విప్పి ఊపుతూ చేసుకున్న ఐకానిక్ సెలబ్రేషన్స్ ఫొటోను రీక్రియేట్ చేశారు. ఈ పోస్టర్‌పై గంగూలీ స్పందించాడు. తన జీవితంలోనే ఇది అత్యుత్తమ పుట్టిన రోజు కానుక అంటూ ఆనందం వ్యక్తం చేశాడు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టాడు.
జాతీయ అవార్డు గ్రహీత రాజ్‌కుమార్ రావు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ బయోపిక్ వచ్చే ఏడాది మే 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఫస్ట్ లుక్ పోస్టర్ ఆవిష్కరణ అనంతరం గంగూలీ మాట్లాడాడు. ‘పుట్టినరోజు ఎప్పుడూ ప్రత్యేకమే. కానీ నా బయోపిక్ ఫస్ట్ లుక్‌ను ఇదే రోజున విడుదల చేయడం ఈ రోజును మరింత చిరస్మరణీయంగా మార్చింది. ఇంతకంటే గొప్ప బహుమతి ఇంకొకటి ఉండదు. ఈ పోస్టర్ చూసిన వెంటనే నా కెరీర్‌లోని ఓ అద్భుతమైన క్షణం కళ్ల ముందు మెదిలింది. రాజ్‌కుమార్ రావు ఈ పాత్ర కోసం ఎంతో నిబద్ధతతో సిద్ధమయ్యాడు. అతను నా ప్రయాణాన్ని అద్భుతంగా ఆవిష్కరిస్తాడనే నమ్మకం ఉంది. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. అభిమానులంతా థియేటర్లలో చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాను’ అని గంగూలీ వెల్లడించాడు.
గంగూలీ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోస్టర్‌లో లార్డ్స్ బాల్కనీలో చొక్కా విప్పి గాల్లో ఊపుతున్న గంగూలీ ఐకానిక్ సెలబ్రేషన్‌ను రాజ్‌కుమార్ రావు అచ్చం అలాగే రీక్రియేట్ చేశాడు. బ్యాగౌండ్ర్‌లో త్రివర్ణ పతాకం కనిపించేలా పోస్టర్‌ను డిజైన్ చేశారు. 2002 నాట్‌వెస్ట్ ట్రోఫీ ఫైనల్లో ఇంగ్లండ్‌పై భారత్ సాధించిన చిరస్మరణీయ విజయానంతరం గంగూలీ లార్డ్స్ బాల్కనీలో చొక్కా విప్పి సంబరాలు జరుపుకోవడం భారత క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన ఘట్టం. అదే సన్నివేశాన్ని ఈ బయోపిక్ ఫస్ట్ లుక్‌కు కేంద్ర బిందువుగా మలిచారు.
భారత క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరిగా గుర్తింపు పొందిన గంగూలీ నాయకత్వంలో టీమిండియా విదేశాల్లోనూ అద్భుత విజయాలు నమోదు చేసింది. 2001లో ఆస్ట్రేలియాపై చరిత్రాత్మక టెస్టు సిరీస్ విజయం, 2002 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ సంయుక్త విజేతగా నిలవడం, 2002 నాట్‌వెస్ట్ ట్రోఫీని గెలుచుకోవడం, 2003 ప్రపంచకప్ ఫైనల్‌కు భారత్‌ను చేర్చడం వంటి ఎన్నో చిరస్మరణీయ విజయాలు అతడి కెప్టెన్సీలోనే సాధ్యమయ్యాయి.
ఇవి కూడా చదవండి:
సంజు శాంసన్‌ను అందుకే తప్పించాం.. క్లారిటీ ఇచ్చిన గంభీర్
ప్రపంచ కప్ అర్జెంటీనాకే ఇవ్వాలని ఫిక్స్ చేశారు: ఈజిప్టు ప్లేయర్