Share News

సంజు శాంసన్‌ను అందుకే తప్పించాం.. క్లారిటీ ఇచ్చిన గంభీర్

ABN , Publish Date - Jul 08 , 2026 | 09:50 AM

స్టార్ ఓపెనర్ సంజు శాంసన్‌ను జట్టు నుంచి తప్పించడంపై విమర్శలు వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఎట్టకేలకు మౌనం వీడాడు.

సంజు శాంసన్‌ను అందుకే తప్పించాం.. క్లారిటీ ఇచ్చిన గంభీర్
Gautam Gambhi

ఇంటర్నెట్ డెస్క్: భారత టీ20 జట్టు వరుస పరాభవాలను ఎదుర్కొంటుంది. ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టీ20లో ఏకంగా 125 పరుగుల భారీ తేడాతో ఘోర ఓటమిని చవి చూసింది. అయితే స్టార్ ఓపెనర్ సంజు శాంసన్‌ను జట్టు నుంచి తప్పించడంపై విమర్శలు వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఎట్టకేలకు మౌనం వీడాడు. జట్టు ఎంపికపై వస్తున్న విమర్శల నేపథ్యంలో మూడో టీ20 మ్యాచ్ ముగిసిన తర్వాత అతడు మీడియా సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


‘సంజు శాంసన్‌ను జట్టు నుంచి తప్పించడానికే ముందే అతడితో నేను చర్చించాను. అతడి ప్రశ్నలు క్లారిటీ ఇచ్చాను. అయితే జట్టు ఎంపిక అనేది పూర్తిగా ఆటగాడు, ప్రధాన కోచ్ మధ్య జరిగే వ్యక్తిగత విషయం. దాన్ని బయటకు చెప్పడం సరైంది కాదు. భారత్ కోసం సంజు చేసిన సేవలు అద్భుతమైనవి. అయితే కొన్ని సందర్భాల్లో ప్లేయర్ ఫామ్‌ను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అతడు ఈ సిరీస్‌లో తిరిగి జట్టులోకి వచ్చే అవకాశాలను కూడా పూర్తిగా కొట్టిపారేయలేం’ అని గంభీర్ వెల్లడించాడు.


ఫలితాలే ముఖ్యం..

అంతర్జాతీయ క్రికెట్‌లో వ్యక్తుల కంటే జట్టు సమతుల్యతకే ప్రాధాన్యం ఉంటుందని గంభీర్ వివరించాడు. అభిషేక్ శర్మతో కలిసి ఓపెనింగ్‌లో వైభవ్ సూర్యవంశీ సరైన కాంబినేషన్ అవుతాడనే నమ్మకంతో అతడిని ఎంపిక చేశామని తెలిపాడు. ‘అంతర్జాతీయ క్రికెట్‌లో ఫలితాలే ముఖ్యం. జట్టుకు విజయాన్ని అందించే ఉత్తమ కాంబినేషన్ ఏదైతే ఉంటుందో, అదే ఆడిస్తాం. ప్రతి ప్లేయర్ తన ప్రదర్శనతోనే భారత్‌కు ఆడే అవకాశాన్ని సంపాదించుకోవాలి. ఇక్కడ ఎవరి స్థానం శాశ్వతం కాదు. అయితే మేం పరిస్థితులకు తగ్గట్లు ఆడలేకపోయాం. అందుకే అన్నీ ఓడిపోవాల్సి వచ్చింది’ అని గంభీర్ తెలిపాడు.


ఐర్లాండ్‌తో జరిగిన రెండు టీ20లతో పాటు ఇంగ్లండ్ సిరీస్‌లోనూ భారత బ్యాటింగ్ తీవ్రంగా నిరాశపరచడంతో జట్టు ఎంపికతో పాటు కోచింగ్ వ్యూహాలపై కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సంజు శాంసన్‌ను మళ్లీ జట్టులోకి తీసుకొస్తారా? లేక వైభవ్ సూర్యవంశీకే మరో అవకాశం ఇస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది.


ఇవి కూడా చదవండి:

అత్యంత దారుణమైన ప్రదర్శన చేశాం: శ్రేయస్ అయ్యర్

ఈజిప్టుపై అర్జెంటీనా అద్భుత విజయం.. కన్నీళ్లు పెట్టుకున్న మెస్సి!

Updated Date - Jul 08 , 2026 | 09:50 AM