Share News

ప్రపంచ కప్ అర్జెంటీనాకే ఇవ్వాలని ఫిక్స్ చేశారు: ఈజిప్టు ప్లేయర్

ABN , Publish Date - Jul 08 , 2026 | 07:59 AM

ఫిఫా ప్రపంచ కప్ 2026 ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో ఈజిప్టుపై అర్జెంటీనా 3-2 తేడాతో అద్భుత విజయం సాధించింది. అయితే మ్యాచ్‌లో రిఫరీ నిర్ణయాలపై ఈజిప్టు స్టార్ ప్లేయర్ మొస్తఫా జికో తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. ప్రపంచ కప్‌ను అర్జెంటీనాకే ఇవ్వాలని ఫిక్స్ చేశారని ఫిఫాపై సంచలన ఆరోపణలు చేశాడు.

ప్రపంచ కప్ అర్జెంటీనాకే ఇవ్వాలని ఫిక్స్ చేశారు: ఈజిప్టు ప్లేయర్
Moustafa Ziko

ఇంటర్నెట్ డెస్క్: ఫిఫా ప్రపంచ కప్ 2026 ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో ఈజిప్టుపై అర్జెంటీనా 3-2 తేడాతో అద్భుత విజయం సాధించింది. ఆది నుంచి దూకుడుగా ఆడుతూ 2-0తో ఆధిక్యంలో ఉన్న ఈజిప్టు జట్టును.. ఆఖరి 11 నిమిషాల్లో 3 గోల్స్ చేసిన మెస్సి జట్టు అనూహ్యంగా ఓడించింది. అయితే మ్యాచ్‌లో రిఫరీ నిర్ణయాలపై ఈజిప్టు స్టార్ ప్లేయర్ మొస్తఫా జికో తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. ప్రపంచ కప్‌ను అర్జెంటీనాకే ఇవ్వాలని ఫిక్స్ చేశారని ఫిఫాపై సంచలన ఆరోపణలు చేశాడు.


మ్యాచ్‌లో ఈజిప్ట్ 2-0 ఆధిక్యంలో ఉన్న సమయంలో జికో మరో గోల్ సాధించాడు. అయితే బిల్డ్‌అప్‌లో హైస్సెమ్ హసన్ అర్జెంటీనా డిఫెండర్ లిసాండ్రో మార్టినెజ్‌పై ఫౌల్ చేశాడని వీఏఆర్ సూచించడంతో రిఫరీ ఆ గోల్‌ను రద్దు చేశాడు. ఈ నిర్ణయం మ్యాచ్‌ను మలుపు తిప్పింది. మ్యాచ్ అనంతరం జికో ఆవేదన వ్యక్తం చేశాడు. ‘రిఫరీ మాకు పూర్తిగా అన్యాయం చేశాడు. మా దేశం మొత్తం పడిన కష్టాన్ని వృథా చేశాడు. దేవుడే అన్నీ చూస్తున్నాడు. మొదటి నుంచే అతని నిర్ణయాలు మాకు వ్యతిరేకంగా ఉన్నాయి. ప్రపంచ కప్‌ను అర్జెంటీనాకే ఇస్తున్నారు. వాళ్లే గెలుస్తారు. అర్జెంటీనాకే కప్ ఇవ్వాలని ఫిఫా ఫిక్స్ చేసింది. ఇది న్యాయం కాదు. మేము 2-0తో గెలిచే పరిస్థితిలో ఉండగా అలా వెళ్లనివ్వలేదు. ఈ టోర్నమెంట్ ఫిక్స్ అయింది’ అని జికో ఫిఫాపై తీవ్ర ఆరోపణలు చేశాడు.


మమ్మల్ని మోసం చేశారు: ఈజిప్టు కోచ్

మ్యాచ్ అనంతరం ఈజిప్టు ప్రధాన కోచ్ హొస్సామ్ హసన్.. రిఫరీలు, వీఏఆర్ నిర్ణయాలపై తీవ్ర స్థాయిలో మండిపడుతూ సంచలన ఆరోపణలు చేశాడు. ‘ఈరోజు మమ్మల్ని మోసం చేశారు. మాకు తీవ్ర అన్యాయం జరిగింది. మాకు రావాల్సిన పెనాల్టీని పట్టించుకోలేదు. మా రెండో గోల్‌ను వివాదాస్పదంగా రద్దు చేశారు. జెర్సీ లాగిన దృశ్యాలు స్పష్టంగా కనిపించినా వీఏఆర్ పరిశీలించలేదు. ఇది ఎలా న్యాయం అవుతుంది? ఈ టోర్నీలో జరిగిన అన్యాయానికి నిరసనగా ఇక మిగిలిన ప్రపంచ కప్ మ్యాచ్‌లను నేను చూడను. బహుశా ప్రపంచ ఛాంపియన్లను టోర్నీలో కొనసాగించాలని అనుకుని ఉండొచ్చు. మెస్సి పోటీలో ఉండాలని కోరుకుని ఉండొచ్చు. ప్రపంచ ఛాంపియన్లకు అన్ని విధాలుగా మద్దతు లభించినట్లుగా అనిపించింది. మ్యాచ్‌ల షెడ్యూల్ రూపొందించిన వ్యక్తి ఎప్పుడూ ఫుట్‌బాల్ ఆడినట్లు అనిపించడం లేదు. మధ్యాహ్నం 12 గంటలకు మ్యాచ్‌లు నిర్వహించడం సరైంది కాదు. ఆ సమయంలో ఆటగాళ్లు భోజనం చేయాలా? లేక మ్యాచ్ ఆడాలా? మైదానంలోనూ, మైదానం బయటా ప్రశ్నించాల్సిన అంశాలు చాలా ఉన్నాయి’ అని హసన్ విమర్శించాడు.


ఇవి కూడా చదవండి:

అత్యంత దారుణమైన ప్రదర్శన చేశాం: శ్రేయస్ అయ్యర్

ఈజిప్టుపై అర్జెంటీనా అద్భుత విజయం.. కన్నీళ్లు పెట్టుకున్న మెస్సి!

Updated Date - Jul 08 , 2026 | 08:00 AM