Share News

ఆఖర్లో అర్జెంటీనా అదరహో

ABN , Publish Date - Jul 08 , 2026 | 02:40 AM

కీలక నాకౌట్‌ పోరులో 78 నిమిషాలపాటు 0-2తో వెనుకంజ. మరో 12 నిమిషాల రెగ్యులర్‌ టైమ్‌ కరిగిపోతే.. డిఫెండింగ్‌ చాంప్‌ కథ కంచికే. ఇంతటి తీవ్ర ఒత్తిడి మధ్య మెస్సీ సేన...

ఆఖర్లో అర్జెంటీనా అదరహో

క్వార్టర్స్‌కు మెస్సీ సేన

3-2తో గెలుపు

పోరాడి ఓడిన ఈజిప్టు

కీలక నాకౌట్‌ పోరులో 78 నిమిషాలపాటు 0-2తో వెనుకంజ. మరో 12 నిమిషాల రెగ్యులర్‌ టైమ్‌ కరిగిపోతే.. డిఫెండింగ్‌ చాంప్‌ కథ కంచికే. ఇంతటి తీవ్ర ఒత్తిడి మధ్య మెస్సీ సేన మాయాజాలం చేసింది. నిమిషాల వ్యవధిలో ధనాధన్‌ మూడు గోల్స్‌తో..

ఓటమి అంచుల నుంచి బయటపడి క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. తొలి గోల్‌తో రొమెరో ఊరట అందిస్త్తే.. సారథి మెస్సీ గోల్‌తో స్కోరు సమం చేసి జట్టును మ్యాచ్‌లోకి పోటీలోకి తెచ్చాడు. ఇక.. స్టాపేజ్‌ టైమ్‌లో ఫెర్నాండెజ్‌ ఆఖరి పంచ్‌తో అర్జెంటీనాకు అద్భుత విజయాన్ని కట్టబెట్టాడు. ఇక, ఆరంభంలోనే రెండు గోల్స్‌ కొట్టి చాంపియన్‌ను భయపెట్టిన ఈజిప్టు.. ఆఖర్లో డీలా పడి సువర్ణావకాశాన్ని చేజార్చుకొంది.

అట్లాంటా: నరాలుతెగే ఉత్కంఠ మధ్య పదమూడు నిమిషాల వ్యవధిలో మూడు గోల్స్‌ చేసి మ్యాచ్‌ను మలుపు తిప్పిన డిఫెండింగ్‌ చాంప్‌ అర్జెంటీనా..ఫిఫా ప్రపంచకప్‌లో క్వార్టర్‌ఫైనల్‌కు దూసుకెళ్లింది. మంగళవారం రాత్రి హోరాహోరీగా సాగిన ప్రీక్వార్టర్స్‌ మ్యాచ్‌లో అర్జెంటీనా 3-2తో ఈజి్‌ప్టపై చిరస్మరణీయ విజయం సాధించింది. క్రిస్టియన్‌ రొమెరో (79వ నిమిషం), లియోనెల్‌ మెస్సీ (83వ), ఎన్‌జో ఫెర్నాండెజ్‌ (90+2వ) అర్జెంటీనా తరఫున గోల్స్‌ చేశారు. యాసిర్‌ ఇబ్రహీం (15వ), మొస్తఫా జికో (67వ) ఈజి్‌ప్టకు చెరో గోల్‌ అందించారు.


ఊహించని షాక్‌..: స్పాట్‌ కిక్‌ మిస్‌.. కొన్ని అవకాశాలు చేజారడంతో ఫస్టా్‌ఫలో అర్జెంటీనా తీవ్ర అసహనానికి గురైంది. మ్యాచ్‌ ఆరంభం నుంచే బంతిపై అర్జెంటీనా ఆధిపత్యం ప్రదర్శించినా.. 15వ నిమిషంలోనే ఈజిప్టు గోల్‌ చేసి అర్జెంటీనాకు షాకిచ్చింది. మార్వాన్‌ కార్నర్‌ కిక్‌ను యాసిర్‌ గోల్‌లోకి పంపాడు. అయితే, కొన్ని నిమిషాల తర్వాత పెనాల్టీ రూపంలో లభించిన సువర్ణావకాశాన్ని మెస్సీ చేజార్చాడు. పెనాల్టీ ఏరియాలో టాగ్లియాఫికోను హసన్‌ కిందపడేయడంతో అర్జెంటీనాకు స్పాట్‌ కిక్‌ లభించింది. అయితే, మెస్సీ కిక్‌ను ఈజిప్టు కీపర్‌ మొస్తఫా షోబిర్‌ ఎడమవైపునకు డైవ్‌చేస్తూ సేవ్‌ చేశాడు. 28వ నిమిషంలో స్కోరు సమం చేసే అవకాశం అర్జెంటీనాకు దక్కినా.. షోబిర్‌ మరోసారి అడ్డు నిలిచాడు. డీ పాల్‌ క్రాస్‌ను అలిస్టర్‌ హెడర్‌తో గోల్‌లో కొట్టే ప్రయత్నం చేయగా.. షోబిర్‌ చాకచక్యంగా అడ్డుకొన్నాడు. క్రమంగా దూకుడు పెంచిన అర్జెంటీనా.. ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టింది. ఈ నేపథ్యంలో 31వ నిమిషంలో ఫ్రీకిక్‌ను మెస్సీ గోల్‌గా మలచే ప్రయత్నం చేశాడు. కానీ, దురదృష్టవశాత్తూ బంతి గోల్‌పోస్టుకు తగిలి పక్కకు పోయింది. ఈ క్రమంలో ఈజిప్టు కూడా కౌంటర్‌ అటాక్‌ చేస్తూ ప్రత్యర్థి డిఫెన్స్‌ను కలవరపెట్టింది. కాగా, 39వ నిమిషంలో గోల్‌పోస్టు ముందు అల్వరెజ్‌ కిక్‌ను ఈజిప్టు కీపర్‌ మరోసారి అద్భుతంగా సేవ్‌ చేశాడు. దాడుల పరంపరను కొనసాగించినా.. ఈజిప్టు డిఫెన్స్‌ను మాత్రం అర్జెంటీనా బద్దలుకొట్టలేక పోయింది. ఇక, సెకండా్‌ఫలో కూడా ఇదే పరిస్థితి. రెండు ఫ్రీ కిక్‌లను మెస్సీ సేన వ్యర్థం చేసింది. అయితే, 58వ నిమిషంలో మొస్తఫా జికో గోల్‌ చేసినా.. సమీక్షలో ఫౌల్‌గా తేలడంతో ఆ గోల్‌ను రద్దు చేశారు. కానీ, 9 నిమిషాల తర్వాత జికో ఇంకో గోల్‌ చేయడంతో స్టేడియం మొత్తం ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. హసన్‌ క్రాస్‌ను జికో నేరుగా గోల్‌లోకి కొట్టి ఈజిప్టును 2-0తో తిరుగులేని స్థితిలో నిలిపాడు. ఆ తర్వాత ఈజిప్టు పూర్తిగా డిఫెన్స్‌కే పరిమితమవడంతో.. అర్జెంటీనా శిబిరంలో కలవరం మొదలైంది.


ఊపిరిలూదిన రొమెరో: కానీ, 79వ నిమిషంలో మెస్సీ క్రాస్‌ను రొమిరో హెడర్‌ ద్వారా గోల్‌లోకి పంపడంతో అర్జెంటీనా ఊపిరిపీల్చుకొంది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో సమం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. ఈ క్రమంలో 83వ నిమిషంలో లాటరో క్రాస్‌ను అందుకొన్న మెస్సీ.. పవర్‌ఫుల్‌ కిక్‌తో బంతిని గోల్‌ పోస్ట్‌లోకి పంపి 2-2తో స్కోరు సమం చేశాడు. ఆ తర్వాత ఇంజ్యూరీ టైమ్‌ మూడో నిమిషంలో మార్జినెజ్‌ కొట్టిన క్రాస్‌ను ఫెర్నాండెజ్‌ హెడర్‌తో గోల్‌ చేయడంతో.. అర్జెంటీనా సంబరాల్లో మునిగిపోయింది.

8

ఈ మ్యాచ్‌లో ఓ గోల్‌ చేసిన మెస్సీ మొత్తం 8 గోల్స్‌తో గోల్డెన్‌బూట్‌ రేసులో టాప్‌లో నిలిచాడు. ఎంబాపె, హాలాండ్‌ చెరో 7 గోల్స్‌తో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

ఇవి కూడా చదవండి:

45వ పడిలోకి ‘తలా’.. ప్రపంచకప్ వేదికగా ఫిఫా వినూత్న శుభాకాంక్షలు!

తప్పుడు వార్తలపై సూర్యకుమార్ యాదవ్ ఫైర్!

Updated Date - Jul 08 , 2026 | 02:40 AM