Share News

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్.. అగ్రస్థానంలోనే స్మృతి మంధాన

ABN , Publish Date - Mar 10 , 2026 | 08:33 PM

ఐసీసీ తాజాగా వన్డే ర్యాంకింగ్స్ జాబితాను విడుదల చేసింది. టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన తన అగ్రస్థానాన్ని మరోసారి నిలబెట్టుకుంది. ఆ తర్వాతి స్థానాల్లో సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్ట్(782), బెత్ మూనీ(749) ఉన్నారు.

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్.. అగ్రస్థానంలోనే స్మృతి మంధాన
Smriti Mandhana

ఇంటర్నెట్ డెస్క్: ఐసీసీ తాజాగా వన్డే ర్యాంకింగ్స్ జాబితాను విడుదల చేసింది. టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన తన అగ్రస్థానాన్ని మరోసారి నిలబెట్టుకుంది. ఇటీవలే భారత మహిళల జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించిన విషయం తెలిసిందే. టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా.. వన్డే, టెస్ట్ సిరీస్‌ను కోల్పోయింది. దీంతో తాజగా ర్యాంకింగ్స్ పలు కీలక మార్పులు చోటు చేసుకున్నాయి.


స్మృతి మంధాన 790 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. ఆ తర్వాతి స్థానాల్లో సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్ట్(782), బెత్ మూనీ(749) ఉన్నారు. టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 652 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో యథాతథంగా నిలిచింది. మరో స్టార్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ ఒక స్థానం కిందకి పడిపోయి 635 పాయింట్లతో 12వ స్థానానికి పరిమితమైంది. ఇక బౌలింగ్ విభాగంలో ఆసీస్ ప్లేయర్ అలానా కింగ్ 775 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.


కివీస్ ప్లేయర్ల దూకుడు

తాజా ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్ మహిళా ప్లేయర్లు చరిత్ర సృష్టించారు. ఆ జట్టు ప్రస్తుతం జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్ ఆడుతోంది. ఇప్పటికే 2-0తో ఆధిక్యంలో ఉంది. జట్టు కొత్త కెప్టెన్ అమేలీయా కెర్ బంతి, బ్యాట్ రెండింటితోనూ మెరిసింది. తొలి మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీసిన ఆమె.. రెండో మ్యాచ్‌లో ఏడు వికెట్లు తీసి చరిత్ర సృష్టించింది. మహిళల వన్డేల్లో ఏడు వికెట్లకు పైగా తీసిన ఏడో ప్లేయర్‌గా కెర్ నిలిచింది. ఈ ప్రదర్శనతో బౌలర్ల జాబితాలో ఆమె ఐదు స్థానాలు ఎగబాకి 600 పాయింట్లతో 11వ స్థానానికి చేరుకుంది. అలాగే వన్డే ఆల్‌రౌండర్ ర్యాంకింగ్స్‌లో ఒక స్థానం పెరిగి ఐదో స్థానంలో నిలిచింది. కివీస్ జట్టులోని బ్రూకీ హాలిడే ఎనిమిది స్థానాలు ఎగబాకి 11వ స్థానానికి చేరుకోగా, మాడీ గ్రీన్ నాలుగు స్థానాలు మెరుగుపరుచుకుని 22వ స్థానానికి చేరుకుంది.


టీ20 ర్యాంకింగ్స్‌లో..

ఇక తాజా మహిళల టీ20 ర్యాంకింగ్స్‌లో కూడా పలు మార్పులు చోటు చేసుకున్నాయి. శ్రీలంక బ్యాటర్ హాసిని పెరీరా అద్భుత ప్రదర్శనతో 15 స్థానాలు ఎగబాకి 28వ స్థానానికి చేరుకుంది. దులానీ17 స్థానాలు ఎగబాకి 72వ స్థానానికి చేరుకుంది. బౌలింగ్‌లో విభాగంలో పాకిస్థాన్ ప్లేయర్ సాదియా ఇక్బాల్ 743 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుంది. ఆ తర్వాతి స్థానాల్లో అన్నాబెల్ సదర్లాండ్(729), సోఫీ ఎకల్‌స్టన్(727) ఉన్నారు.


ఇవి కూడా చదవండి:

చిన్ననాటి స్నేహితురాలితో కుల్‌దీప్ యాదవ్ వివాహం.. ఎప్పుడంటే!

డారిల్ మిచెల్‌తో గొడవ.. అర్ష్‌దీప్ సింగ్‌పై చర్యలు తీసుకున్న ఐసీసీ

Updated Date - Mar 10 , 2026 | 08:57 PM