Share News

SMAT 2026: కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ రీఎంట్రీ..

ABN , Publish Date - Nov 09 , 2026 | 09:30 PM

టీమిండియా టీ20 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు మరో కీలక బాధ్యత దక్కింది. ప్రతిష్ఠాత్మక సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై జట్టుకు అతడిని కెప్టెన్‌గా నియమించారు.

SMAT 2026: కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ రీఎంట్రీ..
Suryakumar Yadav

ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా టీ20 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు మరో కీలక బాధ్యత దక్కింది. ప్రతిష్ఠాత్మక సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ(SMAT 2026)లో ముంబై జట్టుకు అతడిని కెప్టెన్‌గా నియమించారు. ఈ విషయాన్ని ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) సోమవారం అధికారికంగా ప్రకటించింది. సూర్యకుమార్‌కు అంతర్జాతీయ క్రికెట్‌లో ఉన్న అపార అనుభవం, నాయకత్వ లక్షణాలు, దూకుడైన బ్యాటింగ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎంసీఏ వెల్లడించింది.


సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్ 2026లో చివరిసారిగా ఆడాడు. అంతకుముందు అతడి కెప్టెన్సీలో టీమిండియా 2026 టీ20 ప్రపంచ కప్ గెలిచినప్పటికీ.. బ్యాటర్‌గా విఫలం కావడంతో జట్టులో చోటు కోల్పోయాడు. అప్పటి నుంచి రీఎంట్రీ కోసం సూర్య కష్టపడుతూనే ఉన్నాడు. కాగా ముంబై కెప్టెన్సీ రేసులో శ్రేయస్ అయ్యర్ పేరు కూడా వినిపించినప్పటికీ.. ప్రస్తుతం అతడు టీమిండియా తరఫున న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో బిజీగా ఉన్నాడు. అందువల్ల ఈ టోర్నీకి అందుబాటులో లేకపోవడంతో అతడిని కెప్టెన్‌గా పరిగణించలేదు. మరోవైపు రంజీ ట్రోఫీలో ముంబైకి నాయకత్వం వహిస్తున్న సిద్ధేశ్ లాడ్ కూడా ఈ టోర్నీకి దూరంగా ఉన్నాడు. దీంతో సూర్యకుమార్‌కు పగ్గాలు అప్పగించారు.


సూర్య రియాక్షన్ ఇదే..

‘ముంబై తరఫున ప్రాతినిధ్యం వహించడం ఎప్పుడూ గర్వకారణమే. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ప్రతిభావంతులైన ఆటగాళ్లతో కూడిన జట్టుకు నాయకత్వం వహించే అవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నాను. ముంబై క్రికెట్‌కు గొప్ప చరిత్ర, విజయవంతమైన సంప్రదాయం ఉన్నాయి. వాటిని కొనసాగించేందుకు ప్రయత్నిస్తాం. మా జట్టులో అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో పాటు యువ ప్రతిభావంతులు కూడా ఉన్నారు. ప్రతి మ్యాచ్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేస్తామనే నమ్మకం ఉంది. మా లక్ష్యం ఒక్కటే.. ట్రోఫీ గెలిచి ముంబైకి తీసుకురావడం’ అని సూర్య పేర్కొన్నాడు.


ముంబై జట్టు:

సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అథర్వ అంకోలేకర్, అంగ్‌క్రిష్ రఘువంశీ (వికెట్ కీపర్), శామ్స్ ములానీ, దివ్యాన్ష్ సక్సేనా, మ్యాక్స్‌వెల్ స్వామినాథన్, సువేద్ పార్కర్, తుషార్ దేశ్‌పాండే, ముషీర్ ఖాన్, శార్దూల్ ఠాకూర్, సర్ఫరాజ్ ఖాన్, మోహిత్ అవస్థి, సైరాజ్ పాటిల్, సిల్వెస్టర్ డిసౌజా, శివమ్ దూబే, హార్దిక్ తమోరే (వికెట్ కీపర్).


ఇవి కూడా చదవండి:

దక్షిణాఫ్రికా పర్యటన.. భారత మహిళా జట్ల ప్రకటన

ఎంఐతో ట్రేడ్ డీల్.. పంజాబ్‌కు చిక్కులు తప్పవు: భారత మాజీ క్రికెటర్

Updated Date - Nov 09 , 2026 | 09:30 PM