కోహ్లీతో మాట్లాడాకే రిటైర్‌మెంట్ నిర్ణయం తీసుకున్నా: కేన్ విలియమ్సన్
ABN , Publish Date - Nov 09 , 2026 | 08:15 PM
ఈ ఏడాది జూన్‌లో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు మధ్యలో న్యూజిలాండ్ దిగ్గజం కేన్ విలియమ్సన్ ఆటకు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయంపై విలియమ్సన్ స్పందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకడం అంత సులభమైన నిర్ణయం కాదు. ముఖ్యంగా 16 ఏళ్ల పాటు దేశానికి ప్రాతినిధ్యం వహించి, ఎన్నో విజయాల్లో భాగమైన ఆటగాడికి ఆటకు దూరమవ్వాలనే ఆలోచన రావడం కూడా కష్టమే. ఈ ఏడాది జూన్‌లో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు మధ్యలో న్యూజిలాండ్ దిగ్గజం కేన్ విలియమ్సన్ ఆటకు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఉన్నట్టుండి ఆ నిర్ణయం తీసుకోవడంతో క్రికెట్ ప్రపంచం ఆశ్చర్యపోయింది. తాజాగా ఈ విషయంపై విలియమ్సన్ స్పందించాడు. రిటైర్మెంట్ నిర్ణయం తీసుకోవడానికి టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీతో జరిగిన సంభాషణ ఎంతో ఉపయోగపడిందని వెల్లడించాడు.
‘నేను ఎంతో నమ్మే, నాకు చాలా దగ్గరగా ఉండే కొంతమందితో ఈ విషయంపై మాట్లాడాను. రిటైర్మెంట్ ప్రకటించడానికి ఒక రోజు ముందు విరాట్‌తో కూడా చాలా మంచి సంభాషణ జరిగింది. ఇన్నేళ్లుగా క్రికెట్‌లో మేమిద్దరం ఎదుర్కొన్న అనుభవాలను ఒకరితో ఒకరం పంచుకున్నాం. విరాట్‌ను చూస్తే నన్ను నేను అద్దంలో చూసుకున్నట్లు అనిపించింది. విరాట్ కూడా తన కెరీర్‌లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నాడు. నా పరిస్థితిని అర్థం చేసుకోగల వ్యక్తుల్లో విరాట్ ఒకడు. కొన్నిసార్లు సొంత జట్టులోని ఆటగాళ్లు కూడా మనం ఎదుర్కొంటున్న పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకోలేరు. కానీ మా ఇద్దరి ప్రయాణంలో చాలా పోలికలు ఉన్నాయి. ఇద్దరం కెప్టెన్లుగా పనిచేశాం. దాదాపు ఒకే సమయంలో పిల్లలకు తండ్రులమయ్యాం. మా జీవితాలు రెండు సమాంతర మార్గాల్లో సాగినట్లు అనిపించేది. ప్రపంచాలు వేరైనా మా మధ్య చాలా ప్రత్యేకమైన అనుబంధం ఉంది.
రిటైర్మెంట్ నిర్ణయం గురించి కోహ్లీతో మనసు విప్పి మాట్లాడటం నాకు ఎంతో ప్రశాంతతను ఇచ్చింది. మనసులో ఉన్న వ్యక్తిగత విషయాలను, భావోద్వేగాలను ఎలాంటి సంకోచం లేకుండా పంచుకోగలగడం చాలా గొప్ప విషయం. ఆ సంభాషణ తర్వాత నాకు ఎంతో స్పష్టత వచ్చింది. ఫోన్‌లో మాట్లాడటం ముగించుకుని బయటకు వచ్చిన తర్వాత హోటల్ గదిలోకి నా భార్య వచ్చింది. అప్పుడు నేను ఆమెతో.. ఇక ఇదే సరైన సమయం అని చెప్పాను. ఆ వెంటనే ఆటకు వీడ్కోలు పలికా’ అంటూ ఆ క్షణాలను గుర్తు చేసుకున్నాడు.
ఇవి కూడా చదవండి:
దక్షిణాఫ్రికా పర్యటన.. భారత మహిళా జట్ల ప్రకటన
ఎంఐతో ట్రేడ్ డీల్.. పంజాబ్‌కు చిక్కులు తప్పవు: భారత మాజీ క్రికెటర్