Share News

రెండో టెస్టులోనూ దక్కని చోటు.. సిరాజ్ ఏడుస్తున్నాడా?.. వీడియో వైరల్

ABN , Publish Date - Nov 27 , 2026 | 12:36 PM

భారత స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్‌కు న్యూజిలాండ్‌తో రెండు టెస్టుల్లోనూ అవకాశం దక్కలేదు. వరుసగా అవకాశాలు కోల్పోతున్న సిరాజ్.. డ్రెస్సింగ్ రూమ్‌లో తీవ్ర భావోద్వేగానికి గురైనట్లు కనిపించిన దృశ్యాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

రెండో టెస్టులోనూ దక్కని చోటు.. సిరాజ్ ఏడుస్తున్నాడా?.. వీడియో వైరల్
Mohammed Siraj

ఇంటర్నెట్ డెస్క్: భారత స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్‌కు న్యూజిలాండ్‌తో రెండు టెస్టుల్లోనూ అవకాశం దక్కలేదు. వరుసగా అవకాశాలు కోల్పోతున్న సిరాజ్.. డ్రెస్సింగ్ రూమ్‌లో తీవ్ర భావోద్వేగానికి గురైనట్లు కనిపించిన దృశ్యాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. సన్‌గ్లాసెస్ వెనుక తన భావోద్వేగాలను దాచుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా కనిపించడంతో మాజీ క్రికెటర్లు మురళీ కార్తీక్, అజింక్య రహానె స్పందించారు.


భారత మాజీ క్రికెటర్లు మురళీ కార్తీక్, రహానె రెండో టెస్టు మ్యాచ్ విశ్లేషణ చేస్తున్నారు. ఈ సందర్భంగా కెమెరాలో సిరాజ్‌కు సంబంధించిన ఒక క్లిప్ కనిపించింది. ఆ దృశ్యాలను చూసిన మురళీ కార్తీక్.. ‘సిరాజ్ ఏడుస్తున్నాడా?’ అని ప్రశ్నించాడు. దీనికి రహానే స్పందిస్తూ.. ‘చూస్తుంటే అలానే అనిపిస్తోంది. కానీ కచ్చితంగా చెప్పలేం’ అన్నట్లుగా సైగ చేశాడు. సిరాజ్ చాలా భావోద్వేగాలు కలిగిన వ్యక్తి అని, అతడి ముఖంలో ఆ బాధ కనిపిస్తోందని కార్తీక్ వ్యాఖ్యానించాడు.


సిరాజ్‌ను తుది జట్టు నుంచి తప్పించడంపై మురళీ కార్తీక్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ‘జట్టు నుంచి తప్పిస్తే బాధ కలగడం సహజం. కొంతమంది ఆటగాళ్లు దాన్ని సాధారణంగా తీసుకుంటారు. మరికొందరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనైనా ఆడాలనుకుంటారు. ఆరోగ్యం బాగోలేకపోయినా మైదానంలోకి దిగి తమ శక్తినంతా ధారపోస్తారు. సిరాజ్ కూడా అలాంటి బౌలర్‌లాగే కనిపిస్తున్నాడు. ఇప్పటివరకు అతడి గణాంకాలు, ప్రదర్శనను చూస్తే ఆశ్చర్యంగా ఉంది. అతడి ఫామ్ బాగోలేదని భావిస్తున్నారా? నెట్స్‌లో బౌలింగ్ సరిగా చేయడం లేదా? టీమ్ మేనేజ్‌మెంట్ ఆలోచన ఏంటో నాకు తెలియదు. కానీ అతడిని ఆడించే ఉద్దేశమే లేకపోతే అసలు పర్యటనకు ఎందుకు తీసుకురావాలి? జట్టులోకి ఎంపిక చేసి బెంచ్‌కే పరిమితం చేయడం వల్ల ప్రయోజనం ఏమిటి?’ అంటూ కార్తీక్ ఘాటుగా ప్రశ్నించాడు.


ఇవి కూడా చదవండి:

భారత్‌తో రెండో టెస్టు: ముగిసిన తొలిరోజు ఆట.. కివీస్ స్కోర్ 246/5

యశస్వి జైస్వాల్ అరుదైన ఘనత.. సచిన్ టెండూల్కర్ ప్రపంచ రికార్డు బ్రేక్

Updated Date - Nov 27 , 2026 | 12:37 PM