Share News

11వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి విధ్వంసం.. భారత వెటరన్ క్రికెటర్ వరల్డ్ రికార్డు

ABN , Publish Date - Nov 27 , 2026 | 11:51 AM

భారత వెటరన్ క్రికెటర్ జయదేవ్ ఉనద్కత్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. పురుషుల క్రికెట్‌లో 11వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు.

11వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి విధ్వంసం.. భారత వెటరన్ క్రికెటర్ వరల్డ్ రికార్డు
Jaydev Unadkat

ఇంటర్నెట్ డెస్క్: భారత వెటరన్ క్రికెటర్ జయదేవ్ ఉనద్కత్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. 11వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో తమిళనాడుతో జరిగిన మ్యాచ్‌లో సౌరాష్ట్ర తరఫున ప్రాతినిధ్యం వహించిన జయదేవ్.. చివరి వికెట్‌గా క్రీజులోకి వచ్చి 26 బంతుల్లోనే 40 పరుగులు చేశాడు. దీంతో పురుషుల క్రికెట్‌లో 11వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు.


ఈ క్రమంలో ఇంగ్లండ్ ఆటగాడు డ్యానీ బ్రిగ్స్ పేరిట ఉన్న రికార్డును ఉనద్కత్ అధిగమించాడు. 2020 డిసెంబర్‌లో అడిలైడ్ స్ట్రైకర్స్ తరఫున హోబర్ట్ హరికేన్స్‌పై బ్రిగ్స్ 18 బంతుల్లో అజేయంగా 35 పరుగులు చేశాడు. ఇప్పటివరకు నంబర్ 11 బ్యాటర్‌గా డ్యానీదే అత్యధిక స్కోరుగా ఉండేది. తాజాగా ఉనద్కత్ 40 పరుగులతో ఆ రికార్డును బద్దలు కొట్టాడు.


తమిళనాడుపై 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌరాష్ట్ర ఒక దశలో 92 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలిచింది. అలాంటి పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన ఉనద్కత్.. చేతన్ సకారియాతో కలిసి అద్భుత పోరాటం చేశాడు. కేవలం 26 బంతుల్లో 40 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. ఉనద్కత్, చేతన్ సకారియా కలిసి పదో వికెట్‌కు 62 పరుగులు జోడించారు. టీ20 క్రికెట్‌లో చివరి వికెట్‌కు నమోదైన అత్యధిక భాగస్వామ్యాల్లో ఇది సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచింది. 2021లో పనామా తరఫున ఖెంగర్ అహిర్, నికుంజ్ అహిర్ కూడా అర్జెంటీనాపై పదో వికెట్‌కు 62 పరుగులు జోడించారు. ఈ జాబితాలో 2016 పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో క్వెట్టా గ్లాడియేటర్స్ తరఫున గ్రాంట్ ఇలియట్, జుల్ఫికర్ బాబర్ నెలకొల్పిన 63 పరుగుల భాగస్వామ్యమే ఇప్పటికీ అగ్రస్థానంలో ఉంది. సకారియా 21 పరుగులతో అజేయంగా నిలవగా.. చివరకు సన్నీ సంధు బౌలింగ్‌లో ఉనద్కత్ ఔటయ్యాడు. దీంతో సౌరాష్ట్ర 16.4 ఓవర్లలో 154 పరుగులకు ఆలౌటైంది. తమిళనాడు 38 పరుగుల తేడాతో విజయం సాధించింది.


ఇవి కూడా చదవండి:

భారత్‌తో రెండో టెస్టు: ముగిసిన తొలిరోజు ఆట.. కివీస్ స్కోర్ 246/5

యశస్వి జైస్వాల్ అరుదైన ఘనత.. సచిన్ టెండూల్కర్ ప్రపంచ రికార్డు బ్రేక్

Updated Date - Nov 27 , 2026 | 11:54 AM