Share News

మా వాళ్లు బాటిల్ మూతలతో బాల్ ట్యాంపరింగ్ చేసేవారు: షోయబ్ అక్తర్

ABN , Publish Date - Nov 19 , 2026 | 01:26 PM

పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. గతంలో ఇంగ్లండ్ పర్యటనలో బంతిని ట్యాంపరింగ్ చేసేందుకు పాక్ ప్లేయర్లు శాండ్‌పేపర్ కాకుండా బాటిల్ మూతలను ఉపయోగించేవారని బహిరంగంగా వెల్లడించాడు.

మా వాళ్లు బాటిల్ మూతలతో బాల్ ట్యాంపరింగ్ చేసేవారు: షోయబ్ అక్తర్
Shoaib Akhtar

స్పోర్ట్స్ డెస్క్: క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేసిన 2018 శాండ్‌పేపర్ వివాదం మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఉస్మాన్ ఖవాజా తన ఆత్మకథలో ప్రస్తావించిన పలు విషయాలతో ఈ వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. గతంలో ఇంగ్లండ్ పర్యటనలో బంతిని ట్యాంపరింగ్ చేసేందుకు పాక్ ప్లేయర్లు శాండ్‌పేపర్ కాకుండా బాటిల్ మూతలను ఉపయోగించేవారని బహిరంగంగా వెల్లడించాడు. ఈ విషయంపై ప్రపంచ క్రికెట్ ఇంతగా రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డాడు.


‘ఇక ఈ విషయాన్ని వదిలేయండి. దీనిపై ఇంత పెద్ద చర్చ ఎందుకు? క్రికెట్‌కు జరిగిన నష్టం నాకు అర్థమవుతోంది. మా క్రికెట్‌కు కూడా ఇలాంటి నష్టం జరిగింది. గతంలో ఇంగ్లండ్‌లో ఆడేటప్పుడు మా వాళ్లు శాండ్‌పేపర్ కాకుండా బాటిల్ మూతలను ఉపయోగించేవారు. బంతులను మార్చడం సహా రకరకాల పనులు చేసేవారు. నిజాలు బయటకు వచ్చాయి.. అంతటితో వదిలేయాలి. దీనిపై ఇంత హడావుడి అవసరం లేదు. అప్పటి జట్టులోని నా సహచరుల గురించి చెప్పడానికి నా దగ్గర చాలా విషయాలున్నాయి. వారు చేసిన తప్పుల గురించి కూడా నాకు తెలుసు. కానీ వారిని అందరి ముందు దోషులుగా నిలబెట్టాలని అనుకోవడం లేదు. కొన్ని సందర్భాల్లో నేను 22 మందితో పోటీ పడుతున్నానా? అన్న భావన కలిగేది. ఎందుకంటే నేను ఎదుర్కొన్న ప్రతి ఆటగాడి ప్రవర్తనపై ఏదో ఒక అనుమానం ఉండేది. ఎవరిని నమ్మాలో కూడా అర్థమయ్యేది కాదు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేస్తే మంచిది’ అని షోయబ్ అక్తర్ వెల్లడించాడు.


జట్టులో అందరికీ తెలిసే ఉంటుంది..

‘ఉస్మాన్ చెప్పిన విషయాన్ని చూస్తే.. ఇలాంటి నిర్ణయం కేవలం ఇద్దరు ముగ్గురు ఆటగాళ్లు మాత్రమే తీసుకునే అవకాశం లేదు. ఇది జట్టు స్థాయిలో జరిగిన నిర్ణయమే అయి ఉంటుంది. మేం క్రికెట్ ఆడుతున్నప్పుడు బంతులతో ఎన్నో పనులు చేసేవాళ్లం. బంతి రివర్స్ స్వింగ్ కాకపోతే మ్యాచ్‌లు గెలవడం కష్టమయ్యేది. అందుకే జట్టులో అందరికీ ఈ విషయాలు తెలిసి ఉండేవి. ఇప్పుడు బయటకు వస్తున్న విషయాలు గందరగోళానికి దారితీస్తున్నాయి. నిజాలు వెల్లడించడం ఖవాజా చేసిన మంచి పని. కానీ వాటిని బయటపెట్టిన సమయం మరింత మెరుగ్గా ఉండాల్సింది’ అని అక్తర్ చెప్పుకొచ్చాడు.


ఇవి కూడా చదవండి:

భారత్‌తో టెస్టు మ్యాచ్: ముగిసిన తొలి రోజు ఆట.. కివీస్ స్కోర్ 243/5

టెన్నిస్ ఛాంపియన్‌షిప్ విజేతగా లారా దత్తా కుమార్తె..

Updated Date - Nov 19 , 2026 | 01:40 PM