Share News

18 ఏళ్ల క్రితం రాజస్థాన్ రాయల్స్‌తో డీల్‌.. ఇప్పుడు షేన్ వార్న్‌ వాటా విలువ ఎంతో తెలుసా?

ABN , Publish Date - Mar 25 , 2026 | 10:29 AM

రాజస్థాన్ రాయల్స్‌ను అమెరికాకు చెందిన ప్రముఖ టెక్ వ్యాపారవేత్త కల్ సోమని నేతృత్వంలోని కన్సార్షియం సుమారు రూ.15,300 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఓ ఆసక్తికరమైన వార్త వెలుగులోకి వచ్చింది.

18 ఏళ్ల క్రితం రాజస్థాన్ రాయల్స్‌తో డీల్‌..  ఇప్పుడు షేన్ వార్న్‌ వాటా విలువ ఎంతో తెలుసా?
Shane Warne

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్‌లో రెండు ఫ్రాంచైజీల ఓనర్లు మారిన సంగతి తెలిసిందే. అందులో రాజస్థాన్ రాయల్స్‌ను అమెరికాకు చెందిన ప్రముఖ టెక్ వ్యాపారవేత్త కల్ సోమని నేతృత్వంలోని కన్సార్షియం సుమారు రూ.15,300 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఓ ఆసక్తికరమైన వార్త వెలుగులోకి వచ్చింది. 2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పుడు ఆస్ట్రేలియా దిగ్గజం షేన్ వార్న్ ఆర్ఆర్‌కు కెప్టెన్‌గా ఉన్నాడు. ఆ సమయంలో ఆర్ఆర్ ఫ్రాంచైజీతో ఓ ఒప్పందం కుదుర్చుకున్నాడు.


లీగ్ ఆరంభంలో తొలి నాలుగు సీజన్లకు కలిపి షేన్ వార్న్ కేవలం రూ.9.35 కోట్ల వేతనాన్ని మాత్రమే తీసుకున్నాడు. కాకపోతే ప్రతి ఏటా జట్టులో 0.75శాతం వాటా కావాలని ఆర్ఆర్ ఫ్రాంచైజీతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అలా నాలుగు ఏళ్లలో షేన్ వార్న్‌కు మొత్తం 3శాతం వాటా దక్కింది. అప్పట్లో ఆ 3శాతం వాటా విలువ తక్కువ మోతాదే అయినప్పటికీ భవిష్యత్తులో ఐపీఎల్ విలువ పెరుగుతుందని వార్న్ ముందే ఊహించాడు. తాజాగా రాజస్థాన్ రాయల్స్ అమ్మకం ప్రక్రియలో ఈ వాటా విలువ ఆకాశాన్ని తాకింది. సుమారు రూ.15,300 కోట్లకు అమ్ముడవ్వడంతో షేన్ వార్న్ దక్కించుకున్న ఆ 3శాతం వాటా విలువ ఇప్పుడు ఏకంగా రూ.460 కోట్లు. ఆనాడు అతడు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు తమ కుటుంబానికి భారీ ఆస్తిని తెచ్చిపెట్టింది.


2022లో అకస్మాత్తుగా ఆసీస్ దిగ్గజం షేన్ వార్న్ మరణించిన విషయం తెలిసిందే. అప్పట్లో అతడు చేసిన ఈ వ్యాపార ఒప్పందం వార్న్ ముగ్గురు పిల్లల భవిష్యత్తును సురక్షితం చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఇది అత్యంత ప్రత్యేకమైన కథగా నిలుస్తోంది. మొత్తానికి మైదానంలో మ్యాజిక్ చేసిన వార్న్.. వ్యాపార నిర్ణయాల్లో కూడా అదే స్థాయి తెలివితేటలు చూపించాడు.


ఇవి కూడా చదవండి:

ఆర్సీబీ కొత్త ఛైర్మన్‌గా ఐపీఎల్ మాజీ ప్లేయర్.. అసలెవరీ ఆర్యమాన్ బిర్లా?

ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి.. కోల్‌కతా నైట్ రైడర్స్ సంచలన నిర్ణయం

Updated Date - Mar 25 , 2026 | 11:41 AM