Share News

Afghanistan Cricket: యువ బ్యాటర్ సంచలన రికార్డు.. ఒకే ఓవర్‌లో 48 పరుగులు

ABN , Publish Date - Jan 05 , 2026 | 02:58 PM

కాబూల్ ప్రీమియర్ లీగ్ వేదికగా సెదికుల్లా అటల్ అనే బ్యాటర్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 21 ఏళ్ల వయసులోనే ఒకే ఓవర్‌లో ఏడు సిక్సర్లు తో సహా 48 పరుగులు రాబట్టి చరిత్రకెక్కాడు. షాహీన్ హంటర్స్, అబాసిన్ డిఫెండర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ అరుదైన రికార్డు నమోదైంది.

 Afghanistan Cricket: యువ బ్యాటర్ సంచలన రికార్డు.. ఒకే ఓవర్‌లో 48 పరుగులు
Afghanistan Cricket

ఇంటర్నెట్ డెస్క్: క్రికెట్ చరిత్రలో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టడం మనం చూశాం. ఈ విషయంలో టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ వెంటనే గుర్తుకు వస్తాడు. కానీ ఒకే ఓవర్లో 48 పరుగులు చేయడం ఎప్పుడైనా విన్నారా?. చాలా మంది ఇది అసాధ్యం అంటారు. అయితే అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు ఆఫ్ఘనిస్థాన్ కు చెందిన 21 ఏళ్ల యువ బ్యాటర్ సెదికుల్లా అటల్( Sediqullah Atal World Record). రెండేళ్ల క్రితం అతడు సృష్టించిన ఈ సంచలనం ఇప్పటికి చెక్కు చెదరకుండా ఉంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..


కాబూల్ ప్రీమియర్ లీగ్(Kabul Premier League) వేదికగా సెదికుల్లా అటల్ ఈ విధ్వంసం సృష్టించాడు. కేవలం 21 ఏళ్ల వయసులోనే ఒకే ఓవర్‌లో ఏడు సిక్సర్లు బాది చరిత్రకెక్కాడు. షాహీన్ హంటర్స్, అబాసిన్ డిఫెండర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ అరుదైన రికార్డు నమోదైంది. 19వ ఓవర్ వేయడానికి లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ అమీర్ జజాయ్ వచ్చాడు. అప్పటికే క్రీజులో పాతుకుపోయిన కెప్టెన్ సెదికుల్లా అటల్ నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డాడు. మొదటి బంతినే నో బాల్‌గా వేయగా.. అటల్ దానిని సిక్సర్‌గా మలిచాడు. దీంతో బౌలర్ బజాయ్ నియంత్రణ కోల్పోయి వరుసగా ఐదు వైడ్లు వేశాడు. నో-బాల్ తర్వాత వచ్చిన ఫ్రీ హిట్‌ను కూడా అటల్ ( Sediqullah Atal) సిక్సర్ గా మలిచాడు. ఓవర్‌లోని మిగిలిన ఐదు బంతులకు కూడా అటల్ వరుసగా ఐదు సిక్సర్లు కొట్టాడు. దీంతో ఆ ఒక్క ఓవర్లోనే 48 పరుగులు వచ్చాయి. ఈ క్రమంలోనే కేవలం 48 బంతుల్లోనే సెంచరీ కూడా చేశాడు. దీంతో 48 పరుగులు అనేది ఏ గుర్తింపు పొందిన టోర్నమెంట్‌లోనైనా ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్రపంచ రికార్డును నెలకొల్పింది. అలానే ఈ ఓవర్ అమీర్ జజాయ్‌కి ఒక పీడకల లాంటిది.


ఇక అటల్ విధ్వంసక బ్యాటింగ్ షాహీన్ హంటర్స్ 6 వికెట్లకు 213 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. అబాసిన్ డిఫెండర్స్ జట్టు కేవలం 121 పరుగులకే ఆలౌట్ అయింది. హంటర్స్ ఈ మ్యాచ్‌ను 92 పరుగుల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో అటల్ 56 బంతుల్లో 118 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 10 సిక్సర్లు ఉన్నాయి. కాబూల్ సమీపంలోని లోగర్‌ ప్రాంతానికి చెందిన అటల్ 2023-24లో ఆఫ్ఘనిస్థాన్ తరపున మూడు ఫార్మాట్లలో అరంగేట్రం చేశాడు. అతను ఇప్పటివరకు టెస్టులు, వన్డేలు మరియు టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు మరియు పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తన దూకుడు బ్యాటింగ్‌తో తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు.


ఇవి కూడా చదవండి:

ఫ్యాన్స్‌ను హెచ్చరించిన హిట్‌మ్యాన్.. ఎందుకంటే?

జో రూట్ అద్భుత శతకం.. ఆస్ట్రేలియా టార్గెట్ 384

Updated Date - Jan 05 , 2026 | 03:06 PM