2011 ప్రపంచ కప్: అదే 97 పరుగులు.. గంభీర్ చారిత్రాత్మక నాక్‌ను గుర్తు చేసిన సంజు శాంసన్
ABN , Publish Date - Mar 02 , 2026 | 03:20 PM
టీ20 ప్రపంచ కప్ 2026 దాదాపు ముగింపు దశకు చేరుకుంది. ప్రస్తుతం ఎక్కడ చూసిన సంజు నామస్మరణ మార్మోగిపోతోంది. విండీస్‌పై అతడు చేసిన విధ్వంసం అలాంటిది మరి. 50 బంతులు, 12 ఫోర్లు, 4 సిక్స్‌లు.. మొత్తంగా చేసిన పరుగులు 97.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026 దాదాపు ముగింపు దశకు చేరుకుంది. ప్రస్తుతం ఎక్కడ చూసిన సంజు నామస్మరణ మార్మోగిపోతోంది. విండీస్‌పై అతడు చేసిన విధ్వంసం అలాంటిది మరి. 50 బంతులు, 12 ఫోర్లు, 4 సిక్స్‌లు.. మొత్తంగా చేసిన పరుగులు 97. సంజు జట్టుకే భారం అన్నారు.. అవకాశాలు ఇచ్చినా ఉపయోగించుకోడని విమర్శించారు. తన 11 ఏళ్ల కెరీర్‌లో మైదానంలో కంటే డగౌట్‌లోనే ఎక్కువగా గడిపాడు. అయినా ఎక్కడా తనలో ఆత్మవిశ్వాసం తగ్గలేదు. చావో రేవో లాంటి మ్యాచ్‌లో తానేంటో నిరూపించుకున్నాడు. సంజు ఇప్పుడు జట్టుకు అవసరం అనేలా బ్యాట్‌తో సమాధానం చెప్పాడు.
అయితే 2011 వన్డే ప్రపంచ కప్ గెలుపులో కీలక పాత్ర పోషించినా గుర్తింపు రాని ప్లేయర్ గురించి ఇప్పుడు అంతటా మాట్లాడుకుంటున్నారు. అతడే ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్! ఇప్పుడు ఇతడి గురించి ఎందుకు చర్చ మొదలైందంటే.. 2011 వన్డే ప్రపంచ కప్‌లో శ్రీలంకపై మ్యాచ్‌లో గంభీర్ చేసిన పరుగులు కూడా 97. ఎంఎస్ ధోనీ లాంగాన్ మీదుగా కొట్టిన సిక్స్‌ను భారత అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు. ఆ సిక్స్‌తో టీమిండియా విజయం సాధించి.. దాదాపు 28 ఏళ్ల తర్వాత రెండో వన్డే ప్రపంచ కప్‌ను సగర్వంగా ముద్దాడింది.
కానీ.. ఆ మ్యాచ్‌లో గంభీర్ ఆడిన కీలక ఇన్నింగ్స్‌ను ఎవ్వరూ గుర్తుంచుకోలేకపోయారు. కారణం.. ధోనీ(91*) ఆఖరి వరకు క్రీజులో నిలబడి విన్నింగ్ షాట్ స్వయంగా కొట్టి జట్టును గెలిపించడమే. 97 పరుగులు చేసినప్పటికీ సెంచరీకి మూడు పరుగుల దూరంలో గంభీర్ పెరీరా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయి పెవిలియన్‌కు చేరాడు. అందుకే ఆఖరి వరకు నిలబడిన ధోనీకే ఎక్కువ క్రెడిట్స్ దక్కాయి. అమీతుమీ తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో బలమైన విండీస్‌పై ఆఖరి వరకు నిలబడి పోరాడి.. విన్నింగ్ షాట్ కొట్టి జట్టును గెలిపించాడు కాబట్టే సంజుపై ఇప్పుడు ప్రశంసల జల్లు కురుస్తోంది. ఏదేమైనా సెంచరీ కానీ సెంచరీ.. ఆ 97 పరుగులే లేకపోతే నాడు దేశానికి రెండో ప్రపంచ కప్ దక్కేదా? నేడు ప్రపంచ కప్ దక్కించుకోవడానికి మరో దశకు చేరుకునేవాళ్లమా!
ఇవి కూడా చదవండి:
వెస్టిండీస్‌పై పదేళ్ల తర్వాత పగ తీర్చుకున్న టీమిండియా
టీ20 డబ్ల్యూసీ: సంజుపై టీమిండియా కోచ్ గంభీర్ కీలక కామెంట్స్