భారత్ పై ఓడినా.. పాక్ ప్లేయర్ రికార్డ్‌ను బ్రేక్ చేసిన వెస్టిండీస్ బ్యాటర్
ABN , Publish Date - Mar 02 , 2026 | 12:39 PM
టీ20 వరల్డ్ కప్ 2026లో వెస్టిండీస్ తరపున అత్యుత్తమ బ్యాటర్‌గా నిలుస్తున్న షిమ్రోన్ హెట్‌మయెర్ మరో ఘనత సాధించాడు. ఆదివారం భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఎడమచేతి బ్యాటర్ పాకిస్థాన్ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ రికార్డును బ్రేక్ చేశాడు.
స్పోర్ట్స్ డెస్క్: టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8లో భాగంగా ఆదివారం భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ ఓటమి పాలైంది. దీంతో టీమిండియా సెమీస్‌కు చేరగా విండీస్ జట్టు ఇంటిబాట పట్టింది. అయితే ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ ఓడినా ఆ జట్టు తరపున అత్యుత్తమ బ్యాటర్‌గా నిలుస్తున్న షిమ్రోన్ హెట్‌మయెర్(Shimron Hetmyer) ఓ ఘనత సాధించాడు. పాకిస్థాన్ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ రికార్డును అధిగమించాడు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
నిన్న(ఆదివారం) ఈడెన్ గార్డెన్స్‌లో భారత్(Team India)తో జరిగిన మ్యాచ్‌లో హెట్‌మయెర్ 12 బంతుల్లో 27 పరుగులు చేశాడు. ఇందులో ఒక ఫోర్, రెండు సిక్స్‌లు ఉన్నాయి. ఈ క్రమంలోనే హిట్‌మయెర్ ఒకే ఎడిషన్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన ఆటగాడిగా కొత్త రికార్డు నెలకొల్పాడు. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో భారీ సిక్స్ కొట్టి ఫర్హాన్(18)ను దాటేశాడు. ప్రస్తుతం హిట్‌మయెర్ ఖాతాలో 19 సిక్స్‌లు ఉన్నాయి. అంతకుముందు ఇదే ఎడిషన్(2026)లోనే సాహిబ్జాదా ఫర్హాన్ 18 సిక్స్‌లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ ఎడిషన్‌కు ముందు వరకు అత్యధిక సిక్స్‌లు రికార్డు మరో విండీస్ ప్లేయర్ నికోలస్ పూరన్ పేరిట ఉండేది. అతను టీ20 ప్రపంచ కప్2024లో 17 సిక్స్‌లు కొట్టాడు.
కాగా, ఈ టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఫర్హాన్ (383)(Sahibzada Farhan) తొలి స్థానంలో ఉన్నాడు. అతడి ఖాతాలో 18 సిక్సర్లు, 37 ఫోర్లు, రెండు సెంచరీలు ఉన్నాయి. అలానే హెట్‌మయెర్ 248 పరుగులతో నాలుగవ స్థానంలో ఉన్నాడు. అతడు ఏడు ఇన్నింగ్స్‌లలో 41.33 సగటు, 86.46 స్ట్రైక్ రేట్‌తో ఉన్నాడు. మొత్తంగా హెట్‌మయెర్ పవర్ హిట్టింగ్ వెస్టిండీస్ విజయాలకు కీలక పాత్ర పోషించింది. అత్యధిక సిక్స్‌ల రికార్డుతో హెట్‌మయెర్ టీ20 ప్రపంచ కప్ చరిత్రలో మరో మైలురాయిని అందుకున్నాడు.
టీ20 వరల్డ్ కప్ ఒకే ఎడిషన్‌లో అత్యధిక సిక్స్‌లు
2026: షిమ్రోన్ హెట్‌మయెర్ (వెస్టిండీస్) – 19
2026: సాహిబ్జాదా ఫర్హాన్ (పాకిస్థాన్) – 18
2024: నికోలస్ పూరన్ (వెస్టిండీస్) –17
2012: క్రిస్ గేల్ (వెస్టిండీస్) – 16
2024: రహ్మానుల్లా గుర్బాజ్ (అఫ్గానిస్థాన్) – 16
ఇవి కూడా చదవండి:
వెస్టిండీస్‌పై పదేళ్ల తర్వాత పగ తీర్చుకున్న టీమిండియా
టీ20 డబ్ల్యూసీ: సంజుపై టీమిండియా కోచ్ గంభీర్ కీలక కామెంట్స్