Share News

వెస్టిండీస్‌పై పదేళ్ల తర్వాత పగ తీర్చుకున్న టీమిండియా

ABN , Publish Date - Mar 02 , 2026 | 11:35 AM

'రావడం లేటవచ్చు.. కానీ రావడం మాత్రం పక్కా' అనే సినిమా డైలాగ్ తరహాలో.. ' ప్రతీకారం తీర్చుకోవడం ఆలస్యం కావచ్చు.. కానీ తీర్చుకోవడం మాత్రం పక్కా' అనే డైలాగ్ టీమిండియా జట్టుకు సరిగ్గా సరిపోతుంది. వెస్టిండీస్ చేతిలో 2016 నాటి ఓటమికి 2026లో భారత్ వడ్డీతో సహా చెల్లించింది.

వెస్టిండీస్‌పై పదేళ్ల తర్వాత పగ తీర్చుకున్న టీమిండియా
India vs West Indies

స్పోర్ట్స్ డెస్క్: టీ20 ప్రపంచకప్‌ 2026లో భాగంగా నిన్న(ఆదివారం) జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై 5 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. ఈ గెలుపుతో పదేళ్ల క్రితం సొంతగడ్డపై సెమీస్‌లో ఎదురైన ఓటమికి టీమిండియా ప్రతీకారం తీర్చుకుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన సూపర్-8 మ్యాచ్‌లోసంజు శాంసన్ (97* నాటౌట్) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో భారత్.. విండీస్‌పై పగ తీర్చుకుని సెమీస్‌లోకి దూసుకెళ్లింది. అసలు పదేళ్ల క్రితం నాటి భారత్ ఓటమి ఏమిటి, ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..


సరిగ్గా పదేళ్ల క్రితం అంటే 2016 టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా సెమీ ఫైనల్‌లో భారత్, వెస్టిండీస్ జట్లు తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో టీమిండియాను వెస్టిండీస్ జట్టు చిత్తుగా ఓడించింది. ముంబైలోని వాంఖెడ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లకు 192 పరుగులు చేసింది. ఆ మ్యాచ్‌లో స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ 47 బంతుల్లో 89 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన కరేబియన్ జట్టు 19.4 ఓవర్లలో 196 పరుగులు చేసి.. భారత్‌ను ఓడించింది. 192 పరుగులు చేసిన భారత్.. గెలుస్తుందని అందరూ ధీమా ఉన్న వేళ.. వెస్టిండీస్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగి 196 పరుగులు చేసి టీమిండియాను టోర్నీ నుంచి బయటకు పంపారు. ఆ రోజు భారతీయుల కళ్లలో నీళ్లు తిరిగిన క్షణాలను ఎవరూ మర్చిపోలేరు. అప్పటి కెప్టెన్ ఎంఎస్ ధోని సైతం కన్నీరు పెట్టుకున్నాడు. ఆ టోర్నీలో తర్వాత వెస్టిండీస్ ఫైనల్‌కు వెళ్లి కప్పు కూడా గెలిచింది. సరిగ్గా పదేళ్లు తిరిగే సరికి అదే వెస్టిండీస్‌ను.. భారత్ అదే విధంగా ఓడించింది.


ఇంకా విచిత్రం ఏమిటంటే... 2016లో వెస్టిండీస్ చేసిన 196 పరుగుల స్కోర్.. తాజా టోర్నీలో కూడా టీమిండియాకు టార్గెట్. ఈసారి టీమిండియా ఏమాత్రం తడబడలేదు. సంజు శాంసన్ తన కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్(97 *)తో విండీస్ బౌలర్లను ఉతికి ఆరేశాడు. భారత్ కేవలం 19.2 ఓవర్లలోనే 199 పరుగులు చేసి, 5 వికెట్ల తేడాతో కరేబియన్ జట్టును ఓడించింది. పదేళ్ల క్రితం వారు మనల్ని ఫైనల్‌కి చేరకుండా అడ్డుకుంటే, ఈరోజు భారత్ వారిని ఓడించి టోర్నీ నుంచే పంపించి ప్రతీకారం తీర్చుకుంది. ఈ విజయం తర్వాత ఈడెన్ గార్డెన్స్ స్టేడియం మొత్తం భావోద్వేగాలతో నిండిపోయింది. పదేళ్ల క్రితం వాంఖెడేలో మొదలైన బాధాకరమైన కథ, తాజాగా ఈడెన్ గార్డెన్స్‌లో అద్భుతమైన విజయంతో సుఖాంతమైంది.


ఇవి కూడా చదవండి:

టీ20 డబ్ల్యూసీ: సంజుపై టీమిండియా కోచ్ గంభీర్ కీలక కామెంట్స్

భారత్‌పై మరోసారి విషం కక్కిన పాకిస్థాన్ మాజీ క్రికెటర్

Updated Date - Mar 02 , 2026 | 11:43 AM