సచిన్ టెండూల్కర్ ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన జింబాబ్వే క్రికెటర్
ABN , Publish Date - Sep 15 , 2026 | 08:26 PM
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న అరుదైన వన్డే రికార్డు బద్దలైంది. జింబాబ్వే వికెట్ కీపర్, బ్యాటర్ బ్రెండన్ టేలర్ సరికొత్త చరిత్ర సృష్టించాడు.
ఇంటర్నెట్ డెస్క్: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న అరుదైన వన్డే రికార్డు బద్దలైంది. జింబాబ్వే వికెట్ కీపర్, బ్యాటర్ బ్రెండన్ టేలర్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. పురుషుల వన్డే క్రికెట్‌లో అత్యంత సుదీర్ఘ కెరీర్ కలిగిన ఆటగాడిగా సచిన్‌ను వెనక్కి నెట్టి టేలర్ అగ్రస్థానంలో నిలిచాడు. హరారేలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో టేలర్ బరిలోకి దిగడంతో ఈ ఘనత అతడి ఖాతాలో చేరింది. సచిన్ వన్డే కెరీర్ 22 ఏళ్ల 91 రోజులు. కాగా ఈ టేలర్ వన్డే కెరీర్ 22 ఏళ్ల 148 రోజులు కావడం విశేషం.
ఈ రికార్డు జాబితాలో ఇప్పటివరకు అగ్రస్థానంలో ఉన్న సచిన్ టెండూల్కర్ రెండో స్థానానికి పడిపోయాడు. శ్రీలంక మాజీ క్రికెటర్ సనత్ జయసూర్య 21 సంవత్సరాల 184 రోజుల వన్డే కెరీర్‌తో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. అయితే వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సచిన్ రికార్డును మాత్రం ఎవరూ అందుకోలేకపోయారు. సచిన్ వన్డేల్లో ఏకంగా 18,426 పరుగులు సాధించాడు. అలాగే ఈ ఫార్మాట్‌లో అత్యధిక మ్యాచ్‌లు(463 వన్డేలు) ఆడిన రికార్డు కూడా అతడిదే.
2004లో అరంగేట్రం చేసిన టేలర్.. 2021లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే ఆ తర్వాత అతడు చేసిన ఓ సంచలన ప్రకటన క్రికెట్ ప్రపంచంలో కలకలం రేపింది. 2019లో మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడేలా కొందరు తనను ప్రలోభపెట్టారని, తనకు కొకైన్ ఇచ్చి బ్లాక్‌మెయిల్ చేశారని ఆరోపించాడు. ఈ వ్యవహారంపై విచారణ అనంతరం అతడిపై అన్ని రకాల క్రికెట్ నుంచి మూడున్నరేళ్ల నిషేధం విధించారు.
మళ్లీ జాతీయ జట్టులోకి..
తన నిషేధం పూర్తయిన అనంతరం టేలర్ 2025లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి తిరిగి వచ్చాడు. 2027 వన్డే ప్రపంచకప్‌కు జింబాబ్వే సిద్ధమవుతున్న సమయంలో అతడు రీఎంట్రీ ఇచ్చాడు. 2027 ప్రపంచకప్‌ను జింబాబ్వేతో పాటు దక్షిణాఫ్రికా, నమీబియా సంయుక్తంగా నిర్వహించనున్నాయి. రీఎంట్రీ అనంతరం తన అనుభవాన్ని జట్టుకు అందిస్తున్న టేలర్.. ఇప్పుడు ఏకంగా సచిన్ టెండూల్కర్ వంటి దిగ్గజం పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టి చరిత్ర సృష్టించాడు.
ఇవి కూడా చదవండి:
అఫ్గాన్‌తో రెండో టీ20: టాస్ నెగ్గిన భారత్.. జట్టులోకి కొత్త ప్లేయర్
వెస్టిండీస్‌తో సిరీస్.. వన్డే జట్టులో పంత్, హార్దిక్ పాండ్యలకు చోటు?